పోల్ మేనేజ్మెంట్‌తో గెలుపుపై టీఆర్ఎస్ ధీమా.. నిశ్శబ్ద ఓటింగ్‌తో విజయంపై కమలనాధుల ఆశలు విధాత: తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశవాసులలో ఆసక్తి రేపిన మునుగోడు ఉప ఎన్నిక ఫలితంపై రాజకీయ పార్టీలలో ఉత్కంఠ నెలకొంది. ఎన్నికలలో రికార్డు స్థాయిలో 93.13% పోలింగ్ నమోదైన నేపథ్యంలో ఫలితం ఏ పార్టీ అభ్యర్థికి అనుకూలంగా ఉంటుందోనన్న చర్చలు జోరందుకున్నాయి. ఉప ఎన్నికలో 47మంది అభ్యర్థులు పోటీ పడినప్పటికీ ప్రధాన పోటీ టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, బీజేపీ అభ్యర్థి […]

  • పోల్ మేనేజ్మెంట్‌తో గెలుపుపై టీఆర్ఎస్ ధీమా..
  • నిశ్శబ్ద ఓటింగ్‌తో విజయంపై కమలనాధుల ఆశలు

విధాత: తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశవాసులలో ఆసక్తి రేపిన మునుగోడు ఉప ఎన్నిక ఫలితంపై రాజకీయ పార్టీలలో ఉత్కంఠ నెలకొంది. ఎన్నికలలో రికార్డు స్థాయిలో 93.13% పోలింగ్ నమోదైన నేపథ్యంలో ఫలితం ఏ పార్టీ అభ్యర్థికి అనుకూలంగా ఉంటుందోనన్న చర్చలు జోరందుకున్నాయి. ఉప ఎన్నికలో 47మంది అభ్యర్థులు పోటీ పడినప్పటికీ ప్రధాన పోటీ టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతిల మధ్యనే సాగింది. పోలింగ్ సరళి విశ్లేషిస్తే టీఆర్ఎస్, బీజేపీల మధ్యనే గట్టి పోటీ నడిచిందని చెప్పవచ్చు.

ఉప ఎన్నికల్లో గెలుపు ఎవరిదన్న దానిపై టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు తమ కేడర్ ద్వారా లెక్కలు వేసుకుని పనిలో నిమగ్నమయ్యారు. నియోజకవర్గంలోని 298 పోలింగ్ కేంద్రాలలో నమోదైన ఓట్లను పోలింగ్ సరళిని విశ్లేషిస్తు బూత్‌ల వారీగా ఎవరెవరికి ఎన్ని ఓట్లు పడ్డాయోనన్నా కూడికలు తీసివేతల లెక్కల్లో మునిగి తేలుతున్నారు. బూతుల వారీగా నాయకులను పిలిపించుకొని పోలింగ్ సరళిపై లెక్కలు వేసుకుంటున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులంతా జోరుగా డబ్బు పంపిణీ చేయగా ఎంత మేరకు తమకు ఓట్లు పడ్డాయోనన్న లెక్కలు తమ అనుచరుల ద్వారా ఆరా తీస్తున్నారు. గ్రామాలు, పోలింగ్ బూత్‌ల వారీగా ఎవరెవరికి ఎన్ని ఓట్లు పడ్డాయి అన్న లెక్కలు సేకరిస్తున్నారు.

కాగా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి గ్రామాల్లో ఎక్కువగా, బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డికి పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా ఓట్లు నమోదైనట్లు భావిస్తున్నారు. సంక్షేమ పథకాల లబ్ధిదారులు, చేనేత, గీత, యాదవ దళిత వర్గాలలో మెజార్టీ ఓటింగ్ టీఆర్ఎస్‌కే పడినట్లు అధికార పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇంకా కొంత కాలం తమ ప్రభుత్వం అధికారంలో ఉండనుందని అభివృద్ధి తమతోనే సాధ్యమవుతుందన్న భావనతో టీఆర్ఎస్‌కు మెజార్టీ ఓటర్లు మొగ్గు చూపారని ధీమాగా ఉన్నారు.

ఎగ్జిట్ పోల్స్ అన్ని టీఆర్ఎస్‌కే గెలుపు అవకాశాలు ఉన్నాయని చెబుతున్నప్పటికీ .. యువత, మహిళ పెద్ద ఎత్తున ఓటింగ్‌లో పాల్గొనడంతో బీజేపీ కూడా గెలుపుపై గట్టి ఆశలు పెట్టుకుంది. అదీ గాక పైకి టీఆర్ఎస్‌కు ఓటేశారని భావించిన ఓటర్లలో కొంతమంది బీజేపీకి ఓటు వేసినట్లుగా అనుమానిస్తున్నారు. ఇక కమ్యూనిస్టు పార్టీ ఓటర్లు పోలింగ్‌లో కొన్నిచోట్ల టీఆర్ఎస్ వ్యతిరేక వైఖరితో బీజేపీకి వేయలేక కాంగ్రెస్ కు వేసినట్లుగా కూడా అంచనా వేస్తున్నారు. మధ్యాహ్నం తర్వాత సాయంత్రం నుండి రాత్రి వరకు జరిగిన పోలింగ్ తమకు అనుకూలంగా సాగిందని బీజేపీ నాయకత్వం నమ్ముతుంది.

మర్రిగూడ, నాంపల్లి మండలాల్లో డిండి ప్రాజెక్టు నిర్వాసితులలో అసంతృప్తులు బీజేపీకి ఓటు వేయ వచ్చని, గట్టుప్పల మండలంలో కూడా మండల కేంద్రంలో బీజేపీకి, గ్రామాల్లో టీఆర్ఎస్‌కు అనుకూలంగా ఉండవచ్చని లెక్కలు వేస్తున్నారు. చౌటుప్పల్ , చండూర్ నారాయణపూర్, గట్టుపల్, మునుగోడు మండల కేంద్రాల్లో బీజేపీకి స్వల్పంగా మెజారిటీ దక్కవచ్చని ఆ పార్టీ శ్రేణులు ఆశలు పెట్టుకున్నాయి.

అటు ప్రచార ఘట్టంలో పెద్ద ఎత్తున స్థానిక ప్రజాప్రతినిధులు పార్టీలు మారిన నేపథ్యంలో వారు ఎంత మేరకు తాము చేరిన పార్టీలకు తమ స్థానిక ప్రజలతో ఓట్లు వేయించారన్న దానిపై కూడా అభ్యర్థులు లెక్కలు తీసుకుంటున్నారు. అయితే అధికార పార్టీకి ఉన్న అవకాశాల నేపథ్యంలో వారు ఓటర్లకు పక్కాగా నగదు, మద్యం అందించగా, ఈ వ్యవహారంలో బీజేపీ వెనుక పడడం కొంత ఆ పార్టీకి ప్రతికూలంగా కనిపిస్తుంది. ఇదిలాఉండగా 2018లో ఇక్కడ విజయం సాధించిన కాంగ్రెస్‌ పార్టీ విజయావకాశాలపై ఎవరూ అంతగా చర్చించడం లేదు. మూడో స్థానంలో ఉంటుందని స్పష్టం చేస్తున్నారు.

అయితే నిశ్శబ్దం ఓటర్ల అండతో తాము సంచలన విజయం నమోదు చేస్తామని కమలనాధులు చెబుతున్నారు. ఇంకోవైపు కాంగ్రెస్, బీఎస్పి పార్టీలు చీల్చే ఓట్లు ఎంత మేరకు ఉంటాయోనని, ఆ పార్టీలు చీల్చే ఓట్లు టీఆర్ఎస్, బీజేపీలలో ఎవరికి అనుకూలమో, ప్రతికూలమోనన్న ఆసక్తి విశ్లేషణ లెక్కలతో కూసుకుంట్ల, రాజగోపాల్ రెడ్డి వర్గాలు కుస్తీ పడుతున్నాయి. ఏది ఏమైనా ఈనెల ఆరో తేదీన జరిగే ఓట్ల లెక్కింపులోనే మునుగోడు మొనగాడు.. విజేత ఎవరన్నది తేలనుండగా, లెక్కింపు ప్రక్రియ కోసం సర్వత్రా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Updated On 4 Nov 2022 1:51 PM GMT
krs

krs

Next Story