Tuesday, January 31, 2023
More
  Homelatestవలసలపై పార్టీల మైండ్ గేమ్..! నాయకుల పరేషాన్.. కేడర్‌లో రచ్చ రచ్చ!

  వలసలపై పార్టీల మైండ్ గేమ్..! నాయకుల పరేషాన్.. కేడర్‌లో రచ్చ రచ్చ!

  విధాత: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది అధికార, విపక్ష పార్టీలు ప్రత్యర్థి పార్టీల నాయకులను తమ పార్టీల్లోకి రప్పించుకునే క్రమంలో ఆడుతున్న మైండ్ గేమ్ నాయకులను పరేషాన్ చేస్తుంది. నాయకుల పార్టీ మార్పు ప్రచారంతో ఎప్పుడు ఏ నాయకుడు పార్టీ నుంచి పోతాడోనన్న చర్చలు కేడర్లో రచ్చ రేపుతున్నాయి.

  మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా జోరందుకున్న వలసల పర్వాన్ని బీఆర్ఎస్, ప్రతిపక్ష బీజేపీలు మరింత ముందుకు తీసుకెళ్లడంలో పోటీ పడుతున్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ నేతలపై బీజేపీ, బీఆర్ఎస్ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ మైండ్ గేమ్ దెబ్బకు ఆలేరు, భువనగిరి నియోజకవర్గాల కాంగ్రెస్ నాయకులు బీర్ల అయిలయ్య యాదవ్, కుంభం అనిల్ కుమార్ రెడ్డి మీడియా ముందుకు వచ్చి తాము పార్టీ మారడం లేదంటూ జనానికి ఏకరువు పెట్టుకోవాల్సి రావడం గమనార్హం.

  రానున్న ఎన్నికల్లో ఆలేరు కాంగ్రెస్ అభ్యర్థిగా భావిస్తున్న బీర్ల అయిలయ్య బీజేపీలో చేరుతున్నారని తాజాగా ప్రచారం సాగుతోంది. అలాగే భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా భావిస్తున్న ప్రస్తుత డీసీసీ అధ్యక్షుడైన కుంభం అనిల్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్‌లో చేరుతున్నారంటూ విస్తృత ప్రచారం చోటు చేసుకోవడం జిల్లా కాంగ్రెస్ కేడర్‌ను కుదిపేసింది.

  దీంతో బీర్ల అయిలయ్య , కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఇద్దరు కూడా తామూ పార్టీ మారడం లేదంటూ కాంగ్రెస్‌లోనే కొనసాగుతున్నామంటూ మీడియా ముందు స్వయంగా ప్రకటించి క్యాడర్‌లో నెలకొన్న గందరగోళానికి తెరవేశారు. అయితే భువనగిరికి చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి ఎమ్మెల్సీ పదవీకాలం వచ్చే మార్చినాటికి ముగిసిపోతున్న నేపథ్యంలో సదరు ఎమ్మెల్సీ పదవిని కుంభం అనిల్ కుమార్ రెడ్డికి ఇస్తామన్న హామీతో ఆయనకు బీఆర్ఎస్‌లోకి ఆహ్వానం అందినట్లు ప్రచారం గుప్పుమంది.

  ఉమ్మడి జిల్లా పార్టీ బాధ్యతలు చూస్తున్న ఎమ్మెల్యే కుటుంబంతో అనిల్ కుమార్ రెడ్డికి ఉన్న సన్నిహిత సంబంధాల నేపథ్యంలో అనిల్ కుమార్ రెడ్డిని కేసీఆర్ ఫామ్ హౌస్‌కి తీసుకెళ్లి ఎమ్మెల్సీ హామీ, పార్టీ మార్పు అంశాలపై చర్చలు జరిపినట్లు ప్రచారం సాగింది.

  యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆర్థికంగా, రాజకీయంగా కాంగ్రెస్ పార్టీకి పెద్దదిక్కుగా మారిన కుంభం అనిల్ కుమార్ రెడ్డి పార్టీ మారుతున్న ప్రచారం కాంగ్రెస్ క్యాడర్‌ను ఆందోళనకు గురిచేసింది. అయితే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీదే గెలుపని అలాంటప్పుడు తనకు పార్టీ మారాల్సిన అవసరం లేదంటూ కుంభం తనపై వచ్చిన పార్టీ మార్పు ప్రచారాన్ని స్వయంగా కొట్టివేశారు.

  కాగా ఇటీవల కాలంలో పార్టీ మారే నాయకులంతా పార్టీ మారేదాకా రొటీన్ గా పార్టీ మార్పు ప్రచారాన్ని ఖండించడం.. ఆ పిమ్మట పార్టీ మారిపోవడం సాధారణమైన నేపథ్యంలో కుంభం అనిల్ కుమార్ రెడ్డి పార్టీ మార్పు వ్యవహారం పై రేగిన ప్రచారం కేడర్‌లో చర్చల రచ్చను కొనసాగిస్తుండటం ఆసక్తికరంగా మారింది.

  RELATED ARTICLES

  Latest News

  Cinema

  Politics

  Most Popular