- నెల్లూరులో వెలసిన శిలాఫలకం
విధాత: మొదటి దానికి మొగుడు లేడు అంటే కడదానికి కల్యాణం అన్నాడట ఒకడు. రానున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇంకా టీడీపీ జనసేన పొత్తు కూడా కుదరనే లేదు. ఎవరు ఎక్కడ నుంచి పోటీ చేస్తారో తెలియదు. ఇంతకూ పవన్ ఎక్కడ బరిలోకి దిగుతారో తెలియదు.
గతంలో భీమవరం, గాజువాక రెండు చోట్లా ఓడిపోయిన పవన్(Pawan Kalyan) ఇప్పుడు ఎక్కడ పోటీ చేస్తారో, ఈసారైనా గెలుస్తారో లేదో తెలీదు కానీ ఆయన సీఎం అయినట్లు భావించారో. కలగన్నారో తెలియదు కానీ నెల్లూరులో ఓ కార్యకర్త మాత్రం పవన్ కళ్యాణ్ సీఎం హోదాలో ఓ బ్రిడ్జి కి శంఖుస్థాపన చేసినట్లు ఏకంగా శిలా ఫలకం వేసేశారు.
ఇదేందిరా.. నేనెక్కడా చూళ్ళేదు అంటూ అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరులు, మౌళిక సదుపాయాల శాఖ వారు ఓ శిలాఫలకాన్ని ఏర్పాటు చేసినట్టు కేతంరెడ్డి వినోద్‌రెడ్డి ఓ శిలాఫలకాన్ని తయారు చేయించారు.
నెల్లూరు సిటీ నియోజకవర్గంలోని సర్వేపల్లి కాలువపై మినీ బైపాస్ రోడ్డు, బాలాజీనగర్‌లను కలిపే వంతెన పనులు రూ.కోటితో చేపట్టేందుకు బుధవారం తన సారథ్యంలో ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేస్తున్నట్టుగా శిలాఫలకాన్ని తయారు చేయించారు.
ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ నేతృత్వంలో ఏర్పడే ప్రజాప్రభుత్వంలో ఎలాంటి ఆలస్యం చేయకుండా పూర్తి చేస్తారని కూడా రాశారు. ఈ శిలాఫలకాన్ని చూసి జనం కొందరు నవ్వుకుంటూ వెళ్తున్నారు.