కొండగట్టు: పవన్ ‘వారాహి’ పూజలు పూర్తి
విధాత: జనసేన అధినేత పవన్ కల్యాణ్ జగిత్యాల జిల్లా కొండగట్టు పర్యటనలో ఉన్నారు. పార్టీ ప్రచార రథం వారాహికి కొండగట్టు అంజన్న సన్నిధిలో పురోహితుల సమక్షంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మంగళవారం ఉదయం భారీ కాన్వాయ్‌తో కొండగట్టుకు వచ్చిన పవన్ కల్యాణ్‌కు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. పవన్‌కు హైదరాబాద్ నుంచి కొండగట్టు దాకా అభిమానులు అడుగడునా నీరాజనాలు పలికారు.
పవన్ పర్యటన సందర్భంగా 200 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు. పూజల అనంతరం పవన్ కళ్యాణ్ బృందావనం రిసార్ట్ కు చేరుకోగా ఫోటోలు దిగేందుకు అభిమానులు, పోలీసులు ఉత్సా హం చూపారు.
అనంతరం మీడియాతో మాట్లాడిన పవన్ ఏపీలో వచ్చే ఎన్నికల్లో పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఓట్లు చీలకూడదనేది తన అభిప్రాయం అన్నారు. బీజేపీతో ఇప్పటికే పొత్తులో ఉన్నామని, ఆ పార్టీ కాదంటే ఒంటరిగా వెళ్తామన్నారు. కొత్త పొత్తులు వస్తే ఆ పార్టీలతో కలిసి ముందుకు వెళ్తామని పవన్ స్పష్టం చేశారు.
తెలంగాణలో పరిమిత సంఖ్యలో పోటీ చేస్తామని పవన్ కల్యాణ్ అన్నారు. 7 నుంచి 14 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్ధమన్నారు. తెలంగాణలోనూ ఎవరైనా పొత్తుకు వస్తే సంతోషమని తెలిపారు. సొంతంగా గెలిచే స్థాయి లేనప్పుడు పోటీ చేయవద్దని భావిస్తానని అన్నారు.
నేను ఒక ఆశయం కోసం పోరాడుతున్నాను. తెలంగాణ ప్రజలకు సందేశం ఇచ్చే స్థాయిలో నేను లేను. తెలంగాణ ప్రజల నుంచి నేర్చుకునే స్థాయిలో ఉన్నాను. ఇక్కడి ప్రజల పోరాటాల నుంచి నేను స్ఫూర్తి పొందుతానని చెప్పారు.