- పేదలకు భూములు ఇవ్వాల్సింది పోయి, వారి భూముల పైనే కన్నేశారు
- స్వాధీనం చేసుకోవాల్సి వస్తే ప్రత్యామ్నాయం చూపించాలి
- రసాయన ఫ్యాక్టరీ నిర్మాణం పేరుతో పేదల భూములు తీసుకుంటే పోరాటాలు తప్పవు
- సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి
విధాత, కరీంనగర్ బ్యూరో: పేదల భూములను స్వాధీనం చేసుకునే ప్రభుత్వ విధానాలకు తాము వ్యతిరేకమని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడా వెంకటరెడ్డి అన్నారు. గతంలో పేదలకు పంచిన భూములను తిరిగి స్వాధీనం చేసుకోవడం దుర్మార్గమైన ప్రక్రియ అన్నారు.
శుక్రవారం జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం మెట్లచిట్టాపూర్ గ్రామాన్ని ఆయన సందర్శించారు. రసాయన కంపెనీ పేరుతో ప్రభుత్వం పేదల భూములు స్వాధీనం చేసుకునే ప్రయత్నాలకు వ్యతిరేకంగా ఆందోళన బాట పట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. తమ భూములను ప్రభుత్వం బలవంతంగా తీసుకోవడంతో ఆందోళన చెందుతున్న గ్రామస్తులను కలసి వారికి తమ మద్దతు ప్రకటించారు.
అనంతరం వెంకటరెడ్డి మాట్లాడుతూ గ్రామంలోని ఎస్సీ, ఎస్టీ, బడుగు బలహీన వర్గాలకు సర్వే నంబర్ 348లో గత ప్రభుత్వాలు పట్టాలు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం
ఒకసారి ఈ భూమిలో ఇంథనాల్ ఫ్యాక్టరీ పెడతామని, మరోసారి గురుకుల పాఠశాలలు కడతామని, చివరికి రసాయన ఫ్యాక్టరీ పెడతామనే పేరుతో ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు.
పేదలకు కేటాయించిన ప్రభుత్వ భూములు తిరిగి తీసుకోవద్దనే విషయంలో గతంలో శాసనసభ వేదికగా చర్చ జరిగి దీనిపై ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగిందన్నారు. అందుకు విరుద్ధంగా మెట్ల చిట్టాపూర్ లో రసాయన ఫ్యాక్టరీ పేరుతో పేదలకు చెందిన దాదాపు మూడు వందల ఎకరాల భూమిని ప్రభుత్వం వారి నుండి లాక్కోవడానికి ప్రయత్నం చేస్తోందన్నారు.
తెలంగాణ ఏర్పాటు అనంతరం ప్రభుత్వం పేదలకు భూములు పంపిణీ చేసే బాధ్యత నుండి వైదొలగి, గత ప్రభుత్వాలు వారికి కేటాయించిన భూములను స్వాధీనం చేసుకునే ప్రయత్నం సిగ్గుచేటు అన్నారు. నిజంగానే అభివృద్ధి పనులకు ప్రభుత్వం వారి భూములు తీసుకోవాలని అనుకుంటే. ముందు వారికి ప్రత్యామ్నాయం చూపించిన పిదపే భూములు తీసుకోవాలన్నారు.పేదల భూములు వారికి దక్కేంత వరకు సిపిఐ మీవెంట ఉండి పోరాటం చేస్తుందని గ్రామస్తులకు చాడా హామీ ఇచ్చారు.