Peddagattu Jathara | మేడారం జాత‌ర త‌ర్వాత తెలంగాణ‌లో అతిపెద్ద జాత‌రగా పేరుగాంచిన పెద్ద‌గ‌ట్టు లింగ‌మంతుల స్వామి జాత‌ర ఫిబ్ర‌వ‌రి 5వ తేదీన‌(ఆదివారం) ప్రారంభం కానుంది. ఈ జాత‌ర ఐదు రోజుల పాటు కొన‌సాగ‌నుంది. అయితే యాద‌వులు త‌మ కుల‌దైవంగా లింగ‌మంతుల స్వామిని ఆరాధిస్తారు. శ‌తాబ్దాల చ‌రిత్ర క‌లిగిన ఈ జాత‌ర గురించి అనేక క‌థ‌లు, ప్ర‌త్యేక‌త‌లు ప్రాచుర్యంలో ఉన్నాయి. ఈ జాత‌ర‌కు దురాజ్‌ప‌ల్లి జాత‌ర అని కూడా పేరు ఉంది. స్థ‌ల పురాణం ప్ర‌కారం.. రాష్ట్ర […]

Peddagattu Jathara | మేడారం జాత‌ర త‌ర్వాత తెలంగాణ‌లో అతిపెద్ద జాత‌రగా పేరుగాంచిన పెద్ద‌గ‌ట్టు లింగ‌మంతుల స్వామి జాత‌ర ఫిబ్ర‌వ‌రి 5వ తేదీన‌(ఆదివారం) ప్రారంభం కానుంది. ఈ జాత‌ర ఐదు రోజుల పాటు కొన‌సాగ‌నుంది. అయితే యాద‌వులు త‌మ కుల‌దైవంగా లింగ‌మంతుల స్వామిని ఆరాధిస్తారు. శ‌తాబ్దాల చ‌రిత్ర క‌లిగిన ఈ జాత‌ర గురించి అనేక క‌థ‌లు, ప్ర‌త్యేక‌త‌లు ప్రాచుర్యంలో ఉన్నాయి. ఈ జాత‌ర‌కు దురాజ్‌ప‌ల్లి జాత‌ర అని కూడా పేరు ఉంది.

స్థ‌ల పురాణం ప్ర‌కారం.. రాష్ట్ర కూట వంశానికి చెందిన ధ్రువుడు త‌న పేరిట, ప్ర‌స్తుతం జాత‌ర జ‌రిగే ప్రాంతంలో గ్రామం నిర్మించాడ‌నీ పురాణాలు చెబుతున్నాయి. ధ్రువుడు అనే పేరే కాల‌క్ర‌మంలో దురాజ్‌ప‌ల్లిగా మారింద‌ని చెబుతుంటారు. ఇక్క‌డున్న గుట్ట‌పై కాక‌తీయుల కాలంలో శివుడు, చౌడ‌మ్మ‌ ఆల‌యాలు ఉండేవ‌ని, మొక్కులు చెల్లించుకునేందుకు ఓ గ‌ర్భిణి రాగా, గుట్ట ఎక్కుతుండ‌గా, కాలు జారిప‌డి మ‌ర‌ణించిన‌ట్లు క‌థ‌నాలు ఉన్నాయి.

దాంతో ఆమె భర్త గుట్టపైనున్న విగ్రహాలను బావిలో పడేశాడట. ఆ సమయంలో పశువుల్ని మేపేందుకు పెద్దగట్టుకు వెళ్లిన గొర్ల, మెంతెబోయిన వంశస్థులు అలసిపోయి పడుకున్నప్పుడు వాళ్లకు స్వామి కలలో కనిపించి బావిలో ఉన్న విగ్రహాలను బయటకు తీయమని.. వాటిని భక్తులు దర్శించుకునేలా దురాజ్‌పల్లి గుట్టపైన ప్రతిష్ఠించమని చెప్పాడట. అలా విగ్రహాల్ని బయటకు తీసిన యాదవ వంశస్థులు వాటిని దురాజ్‌పల్లి గుట్టపైన ఉంచి పూజలు మొదలుపెట్టారనీ.. అప్పటినుంచే జాతర మొదలయ్యిందనీ స్థానికులు చెబుతారు.

ఈ జాత‌రలో ముఖ్య‌మైన ఘ‌ట్టం.. అంద‌న‌పు చౌడ‌మ్మ త‌ల్లి దేవ‌ర‌పెట్టెలో ఉంటుంది. ఉత్స‌వాల్లో భాగంగా ఊరేగిస్తుండ‌గా దేవ‌ర కోసం ఎదురుచూస్తున్న భ‌క్తులు ఓ లింగా.. ఓ లింగా అని స్మ‌రిస్తూ దేవ‌ర‌పెట్టెను తాకుతారు. ఆ దేవ‌ర‌పెట్టెను తాక‌డం వ‌ల్ల పుణ్యం ల‌భిస్తుంద‌ని భ‌క్తుల న‌మ్మ‌కం.

లింగమంతు స్వామి శాఖాహారి కావడంతో ఆయనకు నైవేద్యం సమర్పిస్తారు. మిగితా దేవతలకు జంతుబలులు ఇస్తారు. జాతరకు ఒకరోజు ముందు భక్తులు చేరుకుంటారు. పురుషులు ఎరుపురంగు వస్త్రాలు ధరించి, కాళ్లకు గజ్జెలు కట్టుకొని డిల్లెం బల్లెం శబ్దాల నడుమ నడుస్తూ ఓలింగా.. ఓ లింగా అంటూ హోరెత్తిస్తారు.

ఇక, మహిళలు తడి బట్టలతోనే పసుపు, కుంకుమ, పూల దండలు, అగరవత్తులతో అలకరించిన మంద గంప నెత్తిన పెట్టుకొని నడుస్తారు. సంతానంలేని మహిళలు బోనం కుండ ఎత్తుకుంటారు. పిల్లలు లేనివారు స్నానం చేసి తడిబట్టలతో గుడిచుట్టూ ప్రదక్షిణలు చేస్తే స్వామి అనుగ్రహంతో సంతానం కలుగుతుందని నమ్మకం.

Updated On 2 Feb 2023 1:40 AM GMT
subbareddy

subbareddy

Next Story