People are the Vidhaathas | Vidhaatha విధాత: నేడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం. తెలంగాణ సమాజానికి పర్వదినం. ఒక జాతి తన అస్తిత్వాన్ని ప్రకటించుకున్న రోజు. ఒక సమాజం తన భవిష్యత్తును నిర్దేశించుకున్న సుదినం. పరాయి పాలనతో పోలిస్తే స్వాతంత్య్రం గొప్పదనం వాదనకు అతీతం. పాలకుల పట్ల లేదా పాలకులు తీసుకునే కొన్ని చర్యల పట్ల ప్రజలందరికి ఏకీభావం ఉండకపోవచ్చు. కానీ స్వపరిపాలనకు ప్రత్యామ్నాయం లేదు. ప్రజాస్వామ్యంలో ప్రజల చైతన్యానికి అనుగుణమైన ప్రభుత్వాలు ఏర్పడతాయి. ప్రజాస్వామ్యం, […]

People are the Vidhaathas | Vidhaatha
విధాత: నేడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం. తెలంగాణ సమాజానికి పర్వదినం. ఒక జాతి తన అస్తిత్వాన్ని ప్రకటించుకున్న రోజు. ఒక సమాజం తన భవిష్యత్తును నిర్దేశించుకున్న సుదినం. పరాయి పాలనతో పోలిస్తే స్వాతంత్య్రం గొప్పదనం వాదనకు అతీతం. పాలకుల పట్ల లేదా పాలకులు తీసుకునే కొన్ని చర్యల పట్ల ప్రజలందరికి ఏకీభావం ఉండకపోవచ్చు. కానీ స్వపరిపాలనకు ప్రత్యామ్నాయం లేదు.
ప్రజాస్వామ్యంలో ప్రజల చైతన్యానికి అనుగుణమైన ప్రభుత్వాలు ఏర్పడతాయి. ప్రజాస్వామ్యం, జాతి వికాసం ఒక్కరోజులో ఆవిర్భవించవు. పరిణామక్రమంలో రూపుదిద్దుకుంటాయి. తెలంగాణ ప్రజలు తాము ఎంచుకున్న బాటలో పయనించే స్వేచ్ఛ లభించిన రోజు ఇది.
గత తొమ్మిదేండ్ల కాలంలో తెలంగాణ సమాజం తనదైన దారిలో పయనించింది. తమ ఆకాంక్షల మేరకు ఎన్నో విజయాలను సాధించింది. ఇది మనందరికి గర్వకారణం. తెలంగాణ ప్రజలకు పాలించుకోవడం చేతకాదని, విఫల రాష్ట్రంగా మిగులుతుందని శాపనార్థాలు పెట్టిన వారికి ఈ విజయాలే దీటైన జవాబులు.
పదవ ఏట అడుగుపెడుతున్నందుకు సంబురాలు జరుపుకుంటూనే కొంత ఆత్మ విమర్శ చేసుకోవలసిన సందర్భమిది. తెలంగాణ లోకం తెలువని పదేళ్ల అమాయక బాలిక. ప్రముఖ కవి నందిని సిధారెడ్డి ఒక పాటలో చెప్పినట్టు- 'పట్టుపడని లౌక్యం, పాలుపోని కోపం' తెలంగాణ స్వభావం. విభజన సందర్భంగా ఆంధ్రకు అన్యాయం జరిగిందని ఎవరైనా అంటే తెలంగాణకు అంతకన్నా ఎక్కువే జరిగిందని చెప్పలేని దుస్థితి.
తెలంగాణ ఏర్పాటులో అన్యాయం జరిగిందని అక్కడెక్కడో ఒక ఆంధ్రా పెద్ద మనిషి దబాయించి చెబుతూ ఉంటే మన వైపు ఒక్కటంటే ఒక్క గొంతు వినిపించదు. ఆనాటి విలీనమే ప్రజాస్వామ్య విరుద్ధమని, ఆ తరువాత చరిత్ర పొడుగునా సాగింది అణచివేతే అని, తెలంగాణకు అన్యాయం సాగిస్తూ బలవంతంగా కలిసి ఉండాలనేదే ప్రజాస్వామ్య విరుద్ధమనే డిమాండ్ అని చెప్పాలని ఉన్నా అది మన గొంతు దాటి రాదు.
ఏవో టెక్నికాలిటీస్ పేర అప్రజాస్వామిక, నైతిక విరుద్ధమైన వాదనను నిర్లజ్జగా వినిపిస్తూ ఉంటే, మన మీద మొరటుగా దాడి జరుగుతున్నదని గుర్తించే స్పృహనే కోల్పోయాం. దేశానికి హైదరాబాద్ రెండవ రాజధాని అంటే పొంగిపోయే అమాయకత్వం. మన అస్తిత్వానికి అనేక రూపాలలో పెనుముప్పు కమ్ముకొస్తున్నా గ్రహించలేనంతగా మొద్దుబారి పోయామేమిటి?
ఇంతకాలం ఎవడో మన ఏడుపు ఏడవడం విన్నాం. ఎవడి నవ్వో మన నవ్వని భ్రమసి పడ్డాం. ఇంకా ఆ దశ నుంచి బయట పడనే లేదు. కాలం స్తంభించి పోయిందనిపించే భావన భీతి గొలుపుతున్నది. మన నవ్వును మనం నవ్వలేక పోతున్నాం. మన ఏడుపును మనసారా ఏడ్వలేకపోతున్నాం. నిజాం హయాంలోనైనా మనకంటూ, మనదైన శిష్ట వర్గం ఉండేది.
మన బాగోగులను పట్టించుకునే, కనీసం మాట్లాడే పౌర సమాజం ఉండేది. కానీ పరాయి పాలకులు ఆ ఆత్మను చిదిమివేశారు. ఆ గొంతును నులిమివేశారు. ఆ సమాజం మళ్ళీ జీవం పోసుకోలేక పోతున్నది. మళ్ళీ జీవం పోయాలంటే, అది పాలకవర్గమో, ప్రభుత్వ యంత్రాంగమో చేయవలసింది కాదు. విజ్ఞులైన పౌరుల కర్తవ్యం. ఆ కర్తవ్య నిర్వహణలో భాగంగానే, ఈ నిశ్శబ్దాన్ని ఛేదించే ప్రయత్నంలోనే 'విధాత' రూపుదిద్దుకున్నది.
ఈ విధాత ప్రజల ఆర్తరావం, ఆనంద హేల. ఆలోచనా ధార. విధాత ప్రజల రాతను రాయదు. ప్రజలే తమ రాతను రాసుకోవాలని చెప్పడమే 'విధాత" కర్తవ్యం. చరిత్రలో ఒక కీలకమైన మలుపులో విధాత ఆవిర్భవించింది. మన గొంతును వినిపించదలుచుకున్నది. కర్తవ్య పరాయణులైన తెలంగాణ ప్రజలు ప్రత్యేకించి విద్యావంతులు 'విధాత" పిలుపును అందుకుంటారని, ఈ ప్రయత్నాన్ని ఆదరిస్తారని ఆశిస్తున్నాం.
