దేశానికి ఆదర్శం తెలంగాణ అభివృద్ధి కేంద్ర అసమర్థ విధానాల వ‌ల్ల రాష్ట్రానికి 3 లక్షల కోట్ల నష్టం బీజేపీ విష వృక్షాన్ని పెంచుతున్నది మ‌హ‌బూబాబాద్‌ అభివృద్ధికి రూ. 171 కోట్లు కొత్తగూడెంకు రూ.178 కోట్ల నిధులు మైనింగ్ ఇంజినీరింగ్ కాలేజీ అభివృద్ధి విధాత, వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రత్యేక ప్రతినిధి: మతం‌, కులం పేరుతో విడగొట్టి.. విడదీసి ప్రజల మధ్య విషవృక్షాన్ని పెంచి పోషిస్తే దేశం ఆగమైతదీ. విద్వేషాలు రగిలితే శాంతిభద్రతలు లోపిస్తాయి. అభివృద్ధి ఆగిపోయి నాశనమైతం.. […]

  • దేశానికి ఆదర్శం తెలంగాణ అభివృద్ధి
  • కేంద్ర అసమర్థ విధానాల వ‌ల్ల రాష్ట్రానికి 3 లక్షల కోట్ల నష్టం
  • బీజేపీ విష వృక్షాన్ని పెంచుతున్నది
  • మ‌హ‌బూబాబాద్‌ అభివృద్ధికి రూ. 171 కోట్లు
  • కొత్తగూడెంకు రూ.178 కోట్ల నిధులు
  • మైనింగ్ ఇంజినీరింగ్ కాలేజీ అభివృద్ధి

విధాత, వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రత్యేక ప్రతినిధి: మతం‌, కులం పేరుతో విడగొట్టి.. విడదీసి ప్రజల మధ్య విషవృక్షాన్ని పెంచి పోషిస్తే దేశం ఆగమైతదీ. విద్వేషాలు రగిలితే శాంతిభద్రతలు లోపిస్తాయి. అభివృద్ధి ఆగిపోయి నాశనమైతం.. తాలిబాన్ పద్ధతి అమలుచేస్తే అడుగుబట్టి ఆగమైపోతం.

దేశ పురోభివృద్ధి పై రాష్ట్ర అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. మనం బాగున్నంత మాత్రాన సరిపోదు చుట్టూ ఏం జరుగుతుందో యువత, మేధావులు ఆలోచన చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు బీజేపీ, కేంద్ర విధానాల మీద మండిపడ్డారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో మహబూబాబాద్‌ ప్రాంతానికి వచ్చా. అప్పుడు ఇక్కడ చాలా దారుణమైన కరువు పరిస్థితులు ఉండేవి. కండ్లకు నీళ్లు పెట్టుకుని ఏడ్చిన. పక్కన కృష్ణమ్మ ఉన్నా.. ఫలితమేమీ లేకపాయె. ఇప్పుడు ఒకప్పటి కరువు ప్రాంతాలు సమృద్ధి నీటితో పచ్చబడ్డాయని రాష్ట్ర అభివృద్ధి దేశానికి ఆదర్శమని సీం అన్నారు.

మానుకోట, కొత్తగూడెం సమీకృత జిల్లా కలెక్టరేట్ల ను గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్, సీఎస్ శాంతి కుమారితో కలిసి కలెక్టరేట్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభల్లో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ తుంగతుర్తి, వర్ధన్నపేట, పాలకుర్తి ప్రాంతాలు తిరిగినప్పుడు అక్కడ సగం గీకిన కాలువలు చూసి ఈ జన్మలో నీళ్లు రావు అని చాలా బాధపడ్డా.

ఏటూరునాగారం వచ్చినప్పుడల్లా.. చిల్లర డబ్బులు వేసి తల్లీ గోదావరి మా నేలమీదకు ఎప్పుడొస్తావు, మా కరువు ఎప్పుడు తీరుస్తావు అంటూ దండం పెట్టుకునేవాడిని. తెలంగాణ వస్తే బంగారు మీసాలు చేయిస్తా అని కొమురువెల్లి స్వామికి మొక్కుకున్నా. స్వామి దయ, మీరు చేసిన ఉద్యమం, మానుకోట రాళ్ళ బలం అన్నీ కలిసి అద్భుత రాష్ట్రం సాకారమైందన్నారు.

అభివృద్ధిలో మానుకోట పరుగులు

సీఎం మాట్లాడుతూ వెనుకబడిన ప్రాంతాల్లో వెలుతురు నింపడం కోసమే పాత 10 జిల్లాలను 33 జిల్లాలుగా విస్తరించాం. ఇపుడు మహబూబాబాద్ కూడా జిల్లా అయ్యాక అభివృద్ధి పరుగులు పెడుతున్నది. తెలంగాణ వచ్చాక చాలా పనులు చేసుకున్నాం. చాలా జిల్లాల్లో కొత్త కలెక్టరేట్లు కట్టుకున్నాం.

ఇప్పుడు మహబూబాబాద్‌ జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ప్రారంభించడం సంతోషంగా ఉంది. ఈ కలెక్టరేట్‌ ప్రజాసమస్యలు తీర్చే కార్యాలయంగా మారాలి. తెలంగాణ రాకముందు మనకు 3, 4 వైద్య కళాశాలలు ఉండేవి. రాష్ట్రం ఏర్పడ్డాక అనేక కొత్త వైద్య కళాశాలలను తెచ్చుకున్నాం. మహబూబాబాద్ జిల్లాకు మెడికల్ కాలేజీ ఇచ్చినం. ఇపుడు ప్రభుత్వ ఇంజినీరింగ్ కాలేజీ నిర్మాణానికి కూడా అనుమతిస్తున్నం. వచ్చే విద్యా సంవత్సరం నుండే అడ్మిషన్లు ప్రారంభమయ్యేలా చూస్తం.

అభివృద్ధికి నిధుల హామీ

సీఎం మాట్లాడుతూ సీఎం ప్రత్యేక నిధి నుండి మహబూబాబాద్ మున్సిపాలిటీలో అభివృద్ధి పనుల కోసం రూ.50 కోట్ల నిధులిస్తున్నం. మరో మూడు మున్సిపాలిటీలు తొర్రూరు, డోర్నకల్, మరిపెడలకు ఒక్కో దానికి రూ. 25 కోట్లు మంజూరు చేస్తున్నం, అలాగే, మహబూబాబాద్ జిల్లాలో ఉన్న 461 పంచాయతీలలో 283 గ్రామపంచాయ తీలను నూతనంగా మనం ఏర్పాటు చేశాం.

అనేక తండాలను గ్రామ పంచాయతీలుగా చేసుకున్నం. జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలకు రూ.10 లక్షల చొప్పున ప్రత్యేక నిధి మంజూరు చేస్తున్నం. నూకల రాంచంద్రారెడ్డి, మాజీ ప్రధాని పీవీ నరసింహా రావు గురువు. అలాంటి మహనీయులను భావితరాలు స్మరించుకోవాల్సిన అవసరం ఉన్నది. అందుకే వారి కాంస్య విగ్రహాన్ని మానుకోటతో పాటు వరంగల్ జిల్లా కేంద్రంలో తెలంగాణ ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుంది. ఒక ప్రతిష్టాత్మక సంస్థకు వారి పేరు కూడా పెడతం’’ అని ప్రకటించారు.

అభివృద్ధి పథంలో కొత్తగూడెం

కొత్తగూడెం జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ సీతారామ ప్రాజెక్టు వల్ల త్వరలో జిల్లాలో సాగునీటి సమస్య పరిష్కారం అవుతుంది. ముర్రేడు వాగు కోత నుంచి కాపాడేందుకు చర్యలు తీసుకుంటాం. జిల్లాలో ని గ్రామపంచాయతీలు మున్సిపాలిటీల అభివృద్ధికి చర్యలు తీసుకుంటాం.

పెద్ద మున్సిపాలిటీలు కొత్తగూడెం, పాల్వంచలకు రూ. 40 కోట్లు చొప్పున మొత్తం రూ.80 కోట్లు. ఇల్లందు, మణుగూరులకు రూ.25 కోట్ల చొప్పున రూ.50కోట్ల నిధులు, గ్రామపంచాయతీకి రూ. 10 లక్షలు చొప్పున జిల్లాలోని 481 పంచాయతీలకు రూ.48కోట్లు ప్రకటిస్తున్నాం.

మిషన్ కాకతీయ ఫలితాలు

సీఎం మాట్లాడుతూ ‘‘ తెలంగాణలో మిషన్ కాకతీయతో చెరువులు బాగు చేసుకున్నం. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసుకున్నం. మొండిగా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకున్నాం కాబట్టే తెలంగాణ రైతులకు సాగునీటి సమస్య లేదని సీఎం అన్నారు. ఇపుడు భూ గర్భ జలాలు పెరిగి బోర్ల నుండి నీళ్లు బయటకు కక్కుతున్నాయి. కానీ, కేంద్రం మాత్రం ఏ అభివృద్ధీ చేస్తలేదు.

కేంద్ర ప్రభుత్వ వైఫల్యం

సీఎం కేసీఆర్ మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడే నాటికి మన జీఎస్డీపీ 5 కోట్లు ఉండేదని, ప్రస్తుతం 11.54 కోట్లకు చేరిందని, మన స్థాయిలో కేంద్ర ప్రభుత్వం పని చేసి ఉంటే మన జీఎస్డిపి 14.5 లక్షల కోట్లకు చేరేది. కేంద్రం అసమర్ధ పనితీరు వల్ల తెలంగాణ రాష్ట్రానికే దాదాపు 3 లక్షల కోట్ల నష్టం జరిగింది. దేశంలో నదులలో సమృద్ధిగా నీరు అందుబాటులో ఉంటాయి. రైతుల పొలాల వద్దకు రావని, కృష్ణా నదిపై ఏర్పాటు చేసిన ట్రిబ్యునల్ 19 సంవత్సరాలు గడిచినా తీర్పు ఇవ్వదు.

దేశంలో సమృద్ధిగా నీటి వనరులు అందుబాటులో ఉన్నప్పటికీ నదులపై ఉన్న వివాదాలను తేల్చకుండా దేశ రాజధానిలో సైతం త్రాగునీటి సమస్య తీరలేదు, ఈనాడు కర్ణాటక, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలలో త్రాగునీటి ఎద్దడి ఇంకా ఎందుకు ఉందని, 10 రోజులకు ఒకసారి సరఫరా చేసే దుస్థితికి కారణాలు ఆలోచించాలి. ప్రజలు అభివృద్ధి వైపు సాగాలంటే సమాజంలో శాంతి, సహనం అవసరమని, మత పిచ్చి, కుల పిచ్చి పెంపోందించి విద్వేషాలు రెచ్చగొడితే దేశం తిరోగమనం వైపు పయనిస్తుంది.

కలెక్టర్లకు సీఎం అభినందన

మానుకోట, కొత్తగూడెం కలెక్టరేట్ల‌ను ప్రారంభించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ ఛాంబర్ లోని సీటులో మానుకోట కలెక్టర్ శశాంకను, కొత్తగూడెం కలెక్టర్ అనూప్ ను కూర్చుండబెట్టి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా జరిగిన సర్వమత ప్రార్థనల్లో పాల్గొన్నారు. అనంతరం మహబూబాబాద్, కొత్తగూడెం జిల్లా ప్రజా ప్రతినిధులు, అధికారులతో సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా సమావేశ‌మ‌య్యారు. దీనికి ముందు బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించి గులాబీ జెండాను ఆవిష్కరించారు. పార్టీ జిల్లా అధ్యక్షురాలు, మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవితా నాయక్ ను కుర్చీలో కూర్చుండబెట్టి ఆమెను ఆశీర్వదించారు.

కార్యక్రమాల్లో సీఎం కేసీఆర్ వెంట మంత్రులు సత్యవతి రాథోడ్‌, ఎర్రబెల్లి దయాకర్‌ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్, ఎంపీలు నామా నాగేశ్వరరావు, మాలోతు కవితా నాయక్, వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, వద్దిరాజు రవిచంద్ర, మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, తక్కెళ్లపల్లి రవీందర్ రావు, డాక్టర్ బండా ప్రకాశ్, ఎమ్మెల్యేలు డీఎస్ రెడ్యానాయక్, బానోతు శంకర్‌నాయక్‌, ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్‌రావు, హరిప్రియా నాయక్, పెద్ది సుదర్శన్ రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, డాక్టర్ టి.రాజయ్య, గండ్ర వెంకటరమణారెడ్డి, నన్నపునేని నరేందర్, సీఎం సెక్రటరీ స్మితా సబర్వాల్, మహబూబాబాద్ జెడ్పీ చైర్మన్ బిందు, మున్సిపల్ చైర్మన్ డాక్టర్ పాల్వాయి రాంమోహన్ రెడ్డి, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, జిల్లా కలెక్టర్ శశాంక్, అనూప్, కొత్తగూడెం ఎస్పీ, అడిషనల్ కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ శరత్ చంద్రపవార్ తదితరులతోపాటు పలువురు ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Updated On 12 Jan 2023 1:15 PM GMT
krs

krs

Next Story