Pilli Ramaraju
- జనాదరణకు స్పీడ్ పెంచిన రామరాజు
- కంచర్లపై వ్యంగ్యాస్త్రాలు
విధాత: నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గం బీఆర్ఎస్ నేత పిల్లి రామరాజు (Pilli Ramaraju) వచ్చే ఎన్నికల్లో పార్టీ టికెట్ లక్ష్యంగా తన ప్రజాసేవ కార్యక్రమాల్లో జోరు పెంచారు. సిట్టింగ్ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి (MLA Kancharla Bhpal Reddy) పార్టీలో తనకు ప్రత్యర్థిగా తయారైన పాత మిత్రుడు రామరాజును పట్టణ పార్టీ అధ్యక్ష పదవి నుండి తొలగించి రాజకీయంగా దెబ్బతీశానని భావించిన సంతోషం కాస్తా పిల్లి దూకుడుతో ఆయనకు ఎన్నో రోజులు ఉండేటట్లుగా కనిపించడం లేదు.
పట్టణ పార్టీ అధ్యక్ష పదవి నుంచి తనను తొలగించి పార్టీ కోసం, ప్రజాసేవ కోసం మరింత స్వేచ్ఛను, పదోన్నతిని కల్పించినట్లుగా కంచర్లపై వ్యంగ్యాస్త్రాలు విసిరిన రామరాజు.. అన్నట్లుగానే ప్రజల్లో తన కార్యక్రమాల జోరు పెంచేశారు. హోలీ వేడుకల్లో కంచర్ల ప్రదర్శనకు దీటుగా తాను సైతం అంటూ రామరాజు బైక్ ర్యాలీతో హంగామా చేశారు. రామరాజు యాదవ్ తన ఆర్కెఎస్ ఫౌండేషన్ ప్రజాసేవ కార్యక్రమాల్లో భాగంగా సగటున రోజుకు లక్షకు పైగా ఖర్చు చేస్తూ కష్టాల్లో ఉన్న ప్రజలకు ఆర్థిక సాయం చేస్తుండగా.. బుధవారం కూడా ఒక లక్ష 30 వేల ఆర్థిక సాయాన్ని అందించడం విశేషం.
మాడుగులపల్లి మండలం దాచారం ఆంజనేయస్వామి ఆలయ నిర్మాణానికి రూ.లక్షా 116, మున్సిపాలిటీ 15వ వార్డులో కంబాలపల్లి లింగమ్మ కుటుంబానికి, రెండో వార్డ్ పానగల్ ఇటికాల మల్లమ్మ కుటుంబానికి, దండంపల్లి చినపాక శ్రవణ్ కుమార్ కుటుంబానికి తలా పదివేల చొప్పున ఆర్థిక సాయం అందించి నిత్య దాతృత్వంలో తనకు తిరుగులేదని చాటుకున్నారు.
పట్టణ పార్టీ అధ్యక్ష పదవి నుంచి రామరాజును తొలగించినప్పటికీ ఆయన పార్టీలోని తన వర్గీయులతో కలిసి ప్రజాసేవ కార్యక్రమాలను పార్టీ బ్యానర్ కింద తన ఫౌండేషన్ పేరుతో చేస్తుండడం ఈ సందర్భంగా గమనార్హం. దీంతో పట్టణ పార్టీ అధ్యక్ష పదవి నుంచి తనను తొలగించిన సందర్భంగా రామరాజు చెప్పినట్లుగా అసలు ఆట ఇప్పుడే మొదలైందని, కంచర్లకు ముందుంది మొసళ్ల పండుగ అని నిరూపించే విధంగా తన ట్రేడ్ మార్క్ ఆర్థిక సహాయాలతో రామరాజు చేస్తున్న ప్రజాసేవ కార్యక్రమాలు నియోజకవర్గ రాజకీయాల్లో కాక రేపుతున్నాయి.