Planetary Conjunction | ఆకాశంలో ఖగోళ అద్భుతం ఆవిష్కృతం కానున్నది. సూర్యుడి చుట్టూ పరిభ్రమించే సమయంలో గ్రహాలు పలు సందర్భాల్లో ఒకే సరళరేఖలోకి వస్తుంటాయి. దీన్ని ప్లానెటరీ కంజెక్షన్ (Planetary Conjunction)గా పిలుస్తుంటారు. ఇంతకు ముందు పలు గ్రహాల సంయోగం.. ఖగోళ ప్రియులను అలరించగా.. తాజాగా శుక్రుడు, గురుడు, చంద్రుడు ఒకే చోటకు చేరబోతున్నారు. వాస్తవానికి ఈ మూడు గ్రహాల మధ్య మిలియన్ కిలోమీటర్ల దూరం ఉన్నా.. ఆకాశంలోకి చూసిన సందర్భంలో ఆయా గ్రహాలు ఒకదాంతో ఒకటి కలిసిపోయినట్లుగా.. లేదంటే పక్క పక్కనే ఉన్నట్లు కనిపిస్తాయి.
జ్యోతిష్యపరంగానూ ఈ గ్రహాల సంయోగానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది. మన సౌరవ్యవస్థలో అతిపెద్ద గ్రహం గురుడు. అత్యంత ప్రకాశవంతమైన గ్రహం శుక్రుడు. అయితే, ఈ రెండింటిని ఎలాంటి టెలిస్కోపులు అవసరం లేకుండా నేరుగా ఆకాశంలో చూడొచ్చు. గురుడు, శుక్రుడు, చంద్రుడు గ్రహాల సంయోగం జరుగబోతున్నది. ఫిబ్రవరి ప్రారంభం నుంచి గురు, శుక్ర, గ్రహాలు 29 డిగ్రీలతో వేరుగా ఉన్నాయి. ఈ నెలఖారు నాటికి రెండు గ్రహాలు కేవలం 2.3 డిగ్రీలతో దగ్గర దగ్గరగా కనిపిస్తాయి. మార్చి ఒకటిన గురుడు -2.0 మాగ్నిట్యూడ్, శుక్రుడు -4.0 మాగ్నిట్యూడ్ పరిమాణంతో ప్రకాశవంతంగా కనిపించనున్నాయి.
శుక్రుడు, గురుడితో వచ్చే మంగళ, బుధవారాల్లో చంద్రుడు సైతం దగ్గరగా రాబోతున్నాడు. ఆ సమయంలో చంద్రుడు కేవలం 4 శాతం ప్రకాశవంతంగా కపిస్తాడు. ఇది శుక్రుడి కన్నా 7 డిగ్రీల దిగువన కనిపిస్తుంది. గురుడు ఈ రెండింటితో 8 డిగ్రీలతో వేరు చేయబడి వీటికి పైన కనిపిస్తుంటాడు. మార్చి ఒకటిన ఈ మూడు గ్రహాలు సంయోగం చెందనుండగా.. సూర్యుడు అస్తమించిన తర్వాత శుక్రుడు, బృహస్పతి గ్రహాలు ఆకాశంలో ఒకే భాగంలో కనిపిస్తాయి. timeanddate.com తెలిపిన వివరాల ప్రకారం.. మార్చి ఒకటిన రాత్రి 8:38 నిమిషాలకు గురుగ్రహం, రాత్రి 8:40 నిమిషాలకు శుక్రగ్రహం అస్తమిస్తాయి. మీరు ఖగోళ ప్రియులైతే తప్పక ఈ అద్భుతాన్ని చూడడం మిస్సవొద్దు మరి..!