Tuesday, January 31, 2023
More
  Homelatest19న రాష్ట్రానికి ప్రధాని.. ఈసారైన సీఎం కేసీఆర్‌ పాల్గొంటారా?

  19న రాష్ట్రానికి ప్రధాని.. ఈసారైన సీఎం కేసీఆర్‌ పాల్గొంటారా?

  • సికింద్రాబాద్ టు విజ‌య‌వాడ న‌డిపించేందుకు దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం
  • రైలులో ఒకేసారి 1,128మంది ప్రయాణించే అవకాశం
  • గంట‌కు 130కి.మీ వేగంగా ప్ర‌యాణం..

  విధాత‌, హైదరాబాద్: ఈ నెల 19న ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి, బహిరంగ సభలో పాల్గొనున్నారు. పర్యటనలో ప్రధాని మోదీ- వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించనున్నారు. వందేభారత్ సిరీస్‌లో ఇది ఎనిమిదో రైలు. ఇటీవల వర్చువల్‌గా ఏడో వందేభారత్‌ రైలును ప్రారంభించిన విషయం తెలిసిందే.

  పశ్చిమ బెంగాల్‌లోని హౌరా నుంచి న్యూ జల్‌పాయ్‌గురి మధ్య ఈ రైలు పరుగులు పెడుతున్నది. సికింద్రా బాద్- విజయవాడ మధ్య ప్రవేశపెట్టనున్నది ఎనిమిదో ఎక్స్‌ప్రెస్‌. రద్దీతో కూడుకుని ఉన్న ఈ రెండు నగరాల మధ్య వందేభారత్ ట్రైన్‌ను ప్రవేశపెట్టేందుకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఇప్పటికే ప్రతిపాదనలు పంపగా.. ఈ మేరకు రైల్వేబోర్డు ఆమోదించింది.

  అదేవిధంగా దక్షిణమధ్య రైల్వే జోన్ ప్రధాన కేంద్రం కొనసాగుతోన్న సికింద్రాబాద్‌లో రైల్వే స్టేషన్‌లో రూ.699 కోట్లతో ఆధునీకరణ పనులను ప్రధాని ప్రారంభించనున్నారు. గతంలో యూపీఏ ప్రభుత్వం అనుమతులను జారీ చేయగా.. తాజాగా మోదీ ఆ పనులను ప్రారంభించనున్నారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో చేపట్టే ఈ పనులను మూడేళ్ల వ్యవధిలో పూర్తి చేయనున్నారు. ప్రస్తుతం ఈ స్టేషన్ నుంచి ప్రతినిత్యం 200కు పైగా ప్యాసెంజర్ రైళ్లు రాకపోకలు సాగిస్తుండగా, 1.8 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణాలు చేస్తున్నారు.

  ఆధునీకరణలో భాగంగా మూడంతస్తుల స్టేషన్ భవనాలు, మల్టీ లెవెల్ పార్కింగ్ సౌకర్యం, దక్షిణ భాగంలో అండర్ గ్రౌండ్ పార్కింగ్, టూ వాక్ వేలు, మెట్రో రైలు స్టేషన్‌ను కలుపుతూ స్కై వేలు, ఫ్లాట్ ఫారం ఆధునీకరణ చేయనున్నారు. స్టేషన్ ఎంట్రీ, ఎగ్జిట్ కోసం ప్రత్యేక గేట్లు, 5వేల కిలోవాట్ల సోలార్ పవర్‌ను ఏర్పాటు చేయనున్నారు.

  వందే భారత్ రైలును తొలుత సికింద్రాబాద్ స్టేషన్ నుంచి విశాఖపట్నం వరకు నడపాలని నిర్ణయించారు. ఇప్పట్లో సాధ్యమయ్యే పరిస్థితులు లేకపోవడంతో విజయవాడ వరకు వయా కాజిపేట జంక్షన్ మీదుగా నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. ఆ తరువాత ఈ రైలును విశాఖ వరకు పొడిగించనున్నారు.

  ఈ రైలుకు ప్రధాని నరేంద్ర మోదీ పచ్చజెండా ఊపి ప్రారంభించనున్నారు. రెండో వందే భారత్ రైలును సికింద్రాబాద్ స్టేషన్ నుంచి తిరుపతి వరకు నడపనున్నారు. ఎప్పుడు ప్రారంభించేది ఇంకా తెలియడం లేదు. జిపిఎస్ ఆధారిత ఈ రైలులో ఒకేసారి 1,128 ప్రయాణికులు ప్రయాణించే అవకాశం ఉంటుంది. గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే రైలులో వై ఫై సౌకర్యం కూడా కల్పించారు. సికింద్రాబాద్ విజయవాడ మధ్య నడిచే వందే భారత్ గంటకు 130 కిలో మీటర్ల వేగంతో ప్రయాణించనున్నది.

  సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులకు శంకుస్థాపన, వందే భారత్ రైలుకు పచ్చ జెండా ఊపిన తరువాత ప్రధాని నరేంద్ర మోది ప్రజల‌నుద్దేశించి ప్రసంగించనున్నారు. స్టేషన్ సమీపంలో ఏర్పాటు చేసే బహిరంగ సభలో ప్రధాని పాల్గొన‌నున్నట్లు తెలిసింది. ఈ ఏడాది చివరలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండడంతో బిజెపి నాయకత్వం రాష్ట్రంపై దృష్టి సారించింది.

  ఈసారైన ముఖ్యమంత్రి పాల్గొంటారా?

  ప్రధాని నరేంద్రమోడీ ఈ నెల 19వ తేదీన తెలంగాణ రాష్ట్రానికి రానున్నారు. వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ను, సికింద్రాబాద్‌ స్టేషన్‌ ఆధునీకరణ పనులను ప్రధాని ప్రారంభించనున్న నేపథ్యంలో ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్‌ పాల్గొంటారా? లేక గతంలో లానే డుమ్మా కొడుతారా? అనే చర్చ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో జోరుగా జరుగుతున్నది.

  మోడీ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూనే తమిళనాడు సీఎం స్టాలిన్‌, బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ లాంటి వాళ్లు ప్రధాని పర్యటనలో మాత్రం పాల్గొంటున్నారు. రాజకీయంగా తమ వైఖరిని నిర్మొహమాటంగా వెల్లడిస్తున్నారు. కానీ కేసీఆర్‌ ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. కొంతకాలంగా ప్రధాని ఎప్పుడు రాష్ట్రానికి వచ్చినా ఏదో ఒక కారణం చెప్పి ఆయా కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. మరి ఈసారి ఏం చేస్తారో అనే చర్చ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో జరుగుతున్నది.

  RELATED ARTICLES

  Latest News

  Cinema

  Politics

  Most Popular