విధాత: భార‌త్ జోడో యాత్ర‌తో కాంగ్రెస్‌ పార్టీలో జోష్ నింపుతున్న ఆ పార్టీ అధిష్ఠానానికి రాజ‌స్థాన్ రాజ‌కీయాలు త‌ల‌నొప్పిగా మారాయి. కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్ష స్థానానికి పోటీ ప‌డుతున్న అశోక్ గెహ్లాట్ ఒకవేళ అధ్య‌క్షుడైతే సీఎం సీటు వ‌దుకోవాల్సి వ‌స్తుంది. అయితే గెహ్లాట్ అధ్య‌క్షుడైనా రెండు ప‌ద‌వుల‌ను స‌మ‌ర్థ‌వంగా నిర్వ‌హించ‌గ‌ల‌రని ఆయ‌న మ‌ద్ద‌తుదారులు చెబుతున్నా రాహుల్ గాంధీ ఒకే వ్య‌క్తికి ఒకే ప‌ద‌వి అన్న పిలుపు మేర‌కు ఆయ‌న దిగిపోవాల్సిన ప‌రిస్థితి నెల‌కొన్న‌ది. అదే జ‌రిగితే స‌చిన్ […]

విధాత: భార‌త్ జోడో యాత్ర‌తో కాంగ్రెస్‌ పార్టీలో జోష్ నింపుతున్న ఆ పార్టీ అధిష్ఠానానికి రాజ‌స్థాన్ రాజ‌కీయాలు త‌ల‌నొప్పిగా మారాయి. కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్ష స్థానానికి పోటీ ప‌డుతున్న అశోక్ గెహ్లాట్ ఒకవేళ అధ్య‌క్షుడైతే సీఎం సీటు వ‌దుకోవాల్సి వ‌స్తుంది. అయితే గెహ్లాట్ అధ్య‌క్షుడైనా రెండు ప‌ద‌వుల‌ను స‌మ‌ర్థ‌వంగా నిర్వ‌హించ‌గ‌ల‌రని ఆయ‌న మ‌ద్ద‌తుదారులు చెబుతున్నా రాహుల్ గాంధీ ఒకే వ్య‌క్తికి ఒకే ప‌ద‌వి అన్న పిలుపు మేర‌కు ఆయ‌న దిగిపోవాల్సిన ప‌రిస్థితి నెల‌కొన్న‌ది.

అదే జ‌రిగితే స‌చిన్ పైలట్ త‌దుప‌రి సీఎం అవుతార‌ని ప్ర‌చారం జ‌రుగుతుండ‌టం గెహ్లాట్ వ‌ర్గానికి మింగుడు ప‌డ‌టం లేదు. అంతేకాదు సుమారు 90 మంది గెహ్లాట్ వ‌ర్గం ఎమ్మెల్యేలు రాజీనామాకు సిద్ధ‌మ‌ని అధిష్ఠానికి అల్టిమేటం జారీ చేస్తున్నారు. ఈ వివాదం స‌ద్దుమ‌ణిగేలా అధిష్టాన ప‌రిశీల‌కులుగా ఉన్న సీనియ‌ర్ నేత‌లు మ‌ల్లిఖార్జున ఖ‌ర్గే, అజ‌య్ మాకెన్ చేస్తున్న ప్ర‌య‌త్నాలు ఫ‌లించ‌డం లేదు.

2023 అసెంబ్లీ ఎన్నిక‌ల వేళ రాజ‌స్థాన్‌లో జ‌రుగుతున్న రాజ‌కీయ ప‌రిణామాలు మ‌రో పంజాబ్‌కు దారి తీస్తాయా? అని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఎన్నిక‌ల‌కు కొద్ది రోజుల ముందు పంజాబ్‌లో సీఎం కెప్టెన్ అమ‌రీంద‌ర్ సింగ్ ఆ రాష్ట్ర పీసీసీ అధ్య‌క్షుడు సిద్ధూల మధ్య త‌రుచూ విభేదాలు త‌లెత్తాయి. ఈ క్ర‌మంలో కాంగ్రెస్ అధిష్ఠానం అమ‌రీంద‌ర్ సింగ్ ప‌నితీరుపై స‌మీక్ష చేసి ఆయ‌న స్థానంలో చ‌ర‌ణ్‌జిత్ సింగ్ చ‌న్నీముఖ్య‌మంత్రి ప‌ద‌విలో కూర్చోబెట్టింది.

దీన్ని అవ‌మానంగా భావించిన కెప్టెన్ ఎమ్మెల్యే ప‌ద‌వితో పాటు పార్టీ ప్రాథ‌మిక‌ స‌భ్య‌త్వాన్ని రాజీనామా చేసి పంజాబ్ లోక్ కాంగ్రెస్‌ను స్థాపించారు. తాజాగా కెప్టెన్ త‌న పార్టీని బీజేపీలో విలీనం చేసి ఆయ‌న కూడా అందులో చేరిన సంగ‌తి తెలిసిందే. ఎన్నిక‌ల‌కు ముందు చేసిన ఈ ప్ర‌యోగం ఘోరంగా విఫ‌ల‌మై కాంగ్రెస్ పార్టీ ఆ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఘోరంగా ఓడిపోయింది. ఆప్ భారీ మెజారిటీతో అక్క‌డ అధికారంలోకి వ‌చ్చింది.

ప్ర‌స్తుతం రాజ‌స్థాన్‌లో గెహ్లాట్, పైల‌ట్ వ‌ర్గాల మ‌ధ్య విభేదాల కార‌ణంగా నెల‌కొన్న‌రాజ‌కీయ అనిశ్చిత్తిని ప‌రిష్క‌రించ‌కుండా ముందుకెళ్తే ఆ రాష్ట్రం కూడా మ‌రో పంబాబ్ అవుతుందంటున్నారు. అదే జ‌రిగితే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల జాబితా నుంచి రాజ‌స్థాన్ చేజారే ప్ర‌మాదం ఉన్న‌దంటున్నారు. అంతేకాదు ఒక‌వేళ గెహ్లాట్ వ‌ర్గ ఒత్తిళ్ల‌కు త‌లొగ్గి ఆయ‌న వ‌ర్గంలోని వారికే ముఖ్య‌మంత్రి ప‌ద‌వి ఇస్తే పైల‌ట్ వ‌ర్గం తిరుగుబావుటా ఎగ‌రేయ‌వ‌చ్చు. అది మ‌రో మ‌ధ్య‌ప్ర‌దేశ్ ఉదంతానికి దారి తీయ‌వ‌చ్చు.

కాంగ్రెస్ పార్టీలో నెల‌కొనే ప్ర‌తి సంక్షోభాన్ని త‌న‌కు అనుకూలంగా మ‌లుచుకోవ‌డానికి క‌మ‌ల‌నాథులు కాచుకుని కూర్చున్నారు. ఫ‌లితంగానే అనేక రాష్ట్రాల‌కు ఆ పార్టీ ఖాతాలోకి వెళ్లాయ‌ని రాజ‌కీయ పండితులు గుర్తు చేస్తున్నారు. కాబ‌ట్టి కాంగ్రెస్‌ పార్టీ అధిష్ఠానం రాజ‌స్థాన్‌లో రాజ‌కీయ ఉత్కంఠ‌కు ఎలా తెర‌ దించుతుందో చూడాలి.

Updated On 27 Sep 2022 1:34 AM GMT
krs

krs

Next Story