Friday, December 9, 2022
More
  Homelatestరాష్ట్రంలో పొలిటిక‌ల్ ఫ్యాక్ష‌నిజం!

  రాష్ట్రంలో పొలిటిక‌ల్ ఫ్యాక్ష‌నిజం!

  • అధికారం కోసం ఎంత దూర‌మైనా..
  • సిట్ ద‌ర్యాప్తు ప్ర‌తిగా.. ఐటీ, ఈడీ దాడులు
  • రాష్ట్రంలో ఇంకా మ‌రిన్ని దాడులు జ‌రిగే అవ‌కాశం

  విధాత‌: రాష్ట్రంలో పొలిటిక‌ల్ ఫ్యాక్ష‌నిజం జ‌డ‌లు విప్పి తాండ‌వం చేస్తోంది. అధికారం కోసం రాజ‌కీయ పార్టీలు ఎంత దూర‌మైనా వెళ్ల‌డానికి వెనుకాడ‌టం లేదు. కాంగ్రెస్ ఎదుగుద‌ల‌ను అడ్డుకొని టీఆర్ఎస్‌కు ప్ర‌త్యామ్నాయంగా నిల‌బ‌డాల‌న్న ఆతృత‌తో ఉన్నది బీజేపీ. అందుకు కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌ల చేత దాడులు చేయించ‌డంతో పాటు, అధికార టీఆర్ఎస్‌, కాంగ్రెస్ పార్టీల‌కు చెందిన ప్ర‌జా ప్ర‌తినిధులు, ఇత‌ర నాయ‌కుల‌ను కొనుగోలు చేసే కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టింది.

  ఇందులో భాగంగా ఈట‌ల రాజేంద‌ర్ మొద‌లు కొమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి వ‌ర‌కు తాజాగా మ‌ర్రి శ‌శిధ‌ర్‌ రెడ్డిని కూడా పార్టీలోకి లాగేసుకున్న‌ది. ఇలా టీఆర్ఎస్‌, కాంగ్రెస్‌కు చెందిన నేత‌ల‌ను బీజేపీలో చేర్చుకునే ప‌నిని ముమ్మ‌రం చేసింది. ఈ క్రమంలో మునుగోడు ఉప ఎన్నిక‌ల సంద‌ర్భంగా టీఆర్ఎస్ మ‌నో ధైర్యాన్ని దెబ్బ‌తీయ‌డం కోసం బీజేపీ సాధు స‌న్యాసుల చేత‌ ఎమ్మెల్యేల కొనుగోలుకు బేర సారాలకు దిగి అడ్డంగా దొరికిపోయింది.

  కొనుగోలును తీవ్రంగా తీసుకున్న‌ టీఆర్ఎస్

  ఎమ్మెల్యేల కొనుగోలు వ్య‌వ‌హారంపై తీవ్రంగా స్పందించిన టీఆర్ఎస్ చ‌కచ‌కా త‌న కార్యాచ‌ర‌ణ మొద‌లు పెట్టింది. కొనుగోలు చేయ‌డానికి వ‌చ్చిన సాధువులపై కేసులు, అరెస్ట్‌లు, విచార‌ణ అంతా శ‌రవేగంగా చేప‌ట్టింది. ఈ మేర‌కు ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం(సిట్‌)ను ఏర్పాటుచేసింది. దీంతో బీజేపీకి ఏమి చేయాలో తోచ‌క‌ కేసుపై సిట్ విచార‌ణ నిలిపి వేయాల‌ని బీజేపీ కోర్టును ఆశ్ర‌యించి బంగ‌ప‌డింది. సిట్ విచార‌ణ చేయ‌డానికి హైకోర్టు ఆదేశించింది.

  విచార‌ణ‌కు రావాల్సిందే…

  సుప్రీం కోర్టులో కూడా బీజేపీకి శ్రుంగ‌భంగం ఎదురైంది. బీజేపీలో కీల‌క నేత బీఎల్ సంతోష్‌(మోదీ, అమిత్‌షాల త‌ర్వాత ఇత‌ని మాటే వేదమ‌ట‌)తో పాటు తుషార్, జ‌గ్గు స్వామిల‌ను విచారించాల‌ని ఆదేశిస్తూ నోటీస్‌లు జారీ చేసింది. సంతోష్ విచార‌ణ‌కు రావాల్సిందేన‌ని న్యాయ‌స్థానం కూడా స్ప‌ష్టం చేసింది.

  అంతేకాకుండా విచార‌ణ‌కు హాజ‌రుకావ‌డంలో సంతోష్‌కు ఉన్న ఇబ్బంది ఏమిట‌ని ప్ర‌శ్నించింది. మొత్తంగా చూస్తే ఈ ఎపిసోడ్‌తో జాతీయ స్థాయిలో బీజేపీ త‌న ప‌రువు పోగొట్టుకున్న‌ది. ఇదే స‌మ‌యంలో మునుగోడు బీజేపీ అభ్య‌ర్థి, ఇటీవ‌ల కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన రాజ‌గోపాల్‌రెడ్డికి చెందిన సంస్థ‌ల‌పైన జీఎస్టీ అధికారులు దాడులు నిర్వ‌హించ‌టం గ‌మ‌నార్హం.

  ప్ర‌తీకారంగా…

  ఎమ్మెల్యేల కొనుగోలు కేసును రాష్ట్ర ప్ర‌భుత్వంలోని విచార‌ణ సంస్థ‌లు ద‌ర్యాప్తు చేస్తుండ‌గా, ప్ర‌తీకారంగా బీజేపీ నాయ‌క‌త్వంలోని కేంద్ర ప్ర‌భుత్వం త‌న దర్యాప్తు సంస్థ‌లైన ఐటీ, ఈడీల చేత రాష్ట్రంలోని టీఆర్ ఎస్ నేత‌ల‌కు చెందిన ఇండ్లు, వ్యాపార సంస్థ‌ల‌పై వ‌రుస‌గా దాడులు నిర్వ‌హిస్తున్న‌ది.

  తాజాగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మ‌ల్లారెడ్డికి చెందిన విద్యాసంస్థ‌లు, కార్యాల‌యాలు, కూతురు, కుమారుడు, సోద‌రులతో పాటు ఇత‌ర బంధువులు, వీరి వ్యాపార లావాదేవీలు చూసుకునే ఉద్యోగుల ఇండ్ల‌లో ఐటీ అధికారులు రెండు రోజులు వ‌రుస‌గా సోదాలు నిర్వ‌హించి రూ.15 కోట్ల‌కుపైగా న‌గ‌దు సీజ్ చేశారు. అనేక ప‌త్రాలు స్వాధీనం చేసుకున్నారు.

  2018 ఎన్నిక‌ల త‌ర్వాత…

  2018 ఎన్నిక‌ల త‌ర్వాత టీఆర్ఎస్, బీజేపీల మ‌ధ్య వివాదం ముదిరింది. ఎలాగైనా రాష్ట్రంలో పాగా వేయాల‌ని చూస్తున్న‌ బీజేపీ చాపకింద నీరులా ప్ర‌య‌త్నిస్తున్న‌ది. రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌చార‌క్‌ల‌ను నియ‌మించింది. దీనికితోడు జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో సీట్లు అధికంగా రావ‌డంతో త‌న దూకుడును పెంచింది.

  ఆ త‌రువాత జ‌రిగిన ప‌రిణామాల్లో దుబ్బాక ఎమ్మెల్యే రామ‌లింగారెడ్డి మ‌ర‌ణంతో వ‌చ్చిన ఉప ఎన్నిక‌లో బీజేపీ అభ్య‌ర్థి గెల‌వ‌డంతో ఆ పార్టీలో ఊపు వ‌చ్చింది. ఆ త‌రువాత టీఆర్ఎస్ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ మంత్రి ప‌ద‌వికి రాజీనామా, ఆ త‌రువాత ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసి, బీజేపీలో చేర‌డం బీజేపీకి బాగా క‌లిసి వ‌చ్చింది.

  బీజేపీలో ధీమా..

  హుజూరాబాద్ ఉప ఎన్నిక‌లో గెలువ‌డంతో రాష్ట్రంలో జ‌రిగే ఉప ఎన్నిక‌ల్లో గెలుస్తామ‌న్న ధీమా బీజేపీలో వ్య‌క్త‌మైంది. దీంతో కాంగ్రెస్‌కు చెందిన రాజ‌గోపాల్‌రెడ్డిని పార్టీలోకి తీసుకొని ఉప ఎన్నిక‌కు కార‌ణ‌ం అయ్యారు. ఇదే స‌మ‌యంలో ఈట‌ల రాజేంద‌ర్ ఇష్యూ త‌రువాత బీజేపీ టీఆర్ఎస్‌పై క‌క్ష సాధింపు చ‌ర్య‌లు మొద‌లు పెట్టింది.

  టీఆర్ఎస్ నేత‌ల‌తో ప్ర‌త్య‌క్షంగా కానీ, ప‌రోక్షంగా కానీ భాగ‌స్వామ్యం ఉన్న అనేక వ్యాపార సంస్థ‌ల‌పై ఐటీ, ఈడీ దాడులు చేయించారు. దీంతో హైద‌రాబాద్‌లో వ్యాపార సంస్థ‌లు త‌మ వ్యాపారాలు కొన‌సాగించాలంటే భ‌య‌ప‌డే వాతావ‌ర‌ణం సృష్టించింది. ఈ దాడుల పరంప‌ర తీవ్ర‌మై నేరుగా టీఆర్ఎస్‌కు చెందిన నేత‌ల వ్యాపార సంస్థ‌ల‌పైనే ఐటీ దాడులు నిర్వ‌హిస్తున్న‌ది.

  దాడులు మ‌ల్లారెడ్డి వ‌ర‌కే ప‌రిమిత‌మా..?

  ఐటీ, ఈడీ లాంటి కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌లు నిర్వ‌హించే దాడులు మంత్రి మ‌ల్లారెడ్డి వ‌ర‌కే ప‌రిమితం కావ‌ని, టీఆర్ఎస్ నేత‌ల‌కు చెందిన , వారి కుటుంబ స‌భ్యుల‌కు చెందిన అనేక మంది వ్యాపార సంస్థ‌ల‌పై దాడులు జ‌రిగే అవ‌కాశం ఉంటుంద‌న్న చ‌ర్చ రాజ‌కీయ వ‌ర్గాల‌లో జ‌రుగుతున్న‌ది. ఇప్ప‌టికే క్యాసినో కేసుతో పాటు, ఢిల్లీ మ‌ద్యం కుంబ‌కోణం కేసులో ప‌లువురిని అరెస్టులు చేసి విచారిస్తున్న సంగ‌తి తెలిసిందే.

  రాజ‌కీయ ల‌బ్ధి కోసం..

  రాష్ట్రంలో ఈ మ‌ధ్య కాలంలో మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్‌, ఎంపీలు వ‌ద్ది రాజు ర‌విచంద్ర‌, పార్థ‌సార‌థిరెడ్డి, ఆర్ఎస్ బ్ర‌ద‌ర్స్‌, సాహితీ క‌న్‌స్ట్ర‌క్ష‌న్స్‌, ఫినిక్స్ త‌దిత‌ర సంస్థ‌లు, వ్య‌క్తుల ఇండ్లు, కార్యాల‌యాల‌పై దాడులు నిర్వ‌హించాయి. దీంతో.. బీజేపీ త‌మ జోలికి వ‌స్తే దాడులు ఇలాగే ఉంటాయ‌ని బీజేపీ హెచ్చ‌రికలు జారీ చేస్తున్న‌ది.

  మ‌రో వైపు టీఆర్ ఎస్ కూడా త‌మ జోలికి వ‌స్తే అడ్డుకుంటామ‌ని చెప్ప‌క‌నే సిట్ ద‌ర్యాప్తు ద్వారా కేంద్రానికి స్ప‌ష్టం చేసింది. ఇలా రాజ‌కీయ ల‌బ్ధి కోసం ఈ రెండు పార్టీలు ద‌ర్యాప్తు సంస్థ‌ల‌ను వినియోగించి స‌రికొత్త ఫ్యాక్ష‌న్ రాజ‌కీయాలు చేస్తున్నాయ‌న్న అభిప్రాయాన్ని రాజ‌కీయ ప‌రిశీల‌కులు వ్య‌క్తం చేస్తున్నారు.

  RELATED ARTICLES

  Latest News

  Cinema

  Politics

  Most Popular

  You cannot copy content of this page