- లిక్కర్ స్కామ్‌లో ఈడీ నోటీసులు
- పోటా పోటీ ధర్నాలు
- పెద్దపల్లి జిల్లాలో ధరణి అదాలత్ నిర్వహించిన కాంగ్రెస్
రాష్ట్రంలో రాజకీయం సెగలు పుట్టిస్తోంది. రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలు పోటా పోటీగా ధర్నాలు, సమావేశాలు నిర్వహిస్తుండగా, విపక్షంలో ఉన్నకాంగ్రెస్ పార్టీ పాదయాత్రను నమ్మకున్నది.
విధాత: ఢిల్లీ మద్యం కేసును (Delhi Liquor Case) ప్రధాన రాజకీయ పార్టీలు తమ రాజకీయ అవసరాలకు వాడుకుంటున్నాయి. ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పనలో అవకతవకలు జరిగాయని, పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ జరిగిందన్న ఆరోపణపై కేంద్రం విచారణకు ఆదేశించింది. ఈ విచారణ పూర్తిగా బీజేపీకి లబ్ధికలిగేలా కొనసాగుతున్నదన్న ఆరోపణలు ఉన్నాయి. అదే సమయంలో ఈడీ (ED)నోటీసులను రాష్ట్రంలో సెంటిమెంట్ రగలించేందుకు వినియోగించుకునే పనిలో బీఆర్‌ఎస్ (BRS) పడింది.
విచారణకు ముందే ఢిల్లీలో ధర్నా
లిక్కర్ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ ఎదుర్కోక తప్పదన్న ప్రచారం గత కొద్ది కాలంగా జరుగుతున్నది. అందరూ ఊహించినట్లుగా విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీస్‌లు జారీ చేసింది. ఈ పరిణామాన్ని ముందే ఊహించిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత (Kalvakuntla Kavitha).. మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం కోరుతూ ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ద దీక్షకు సమాయత్తమయ్యారన్న అభిప్రాయాలు రాజకీయ పరిశీలకుల నుంచి వెలువడ్డాయి.
ఇటు రాష్ట్రంలో బీజేపీ దీక్షలు
మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదించాలంటూ ఢిల్లీలో కవిత దీక్ష చేపట్టగా, పోటీగా బీజేపీ (BJP) హైదరాబాద్‌లో ‘మహిళా గోస-బీజేపీ భరోసా’ పేరుతో దీక్ష చేపట్టింది. ఇదే సమయంలో ఢిల్లీలో మద్యం కుంభకోణంపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ రాజీనామా చేయాలని బీజేపీ ధర్నా నిర్వహించింది. ఇలా కవిత ధర్నాకు పోటీగా ఢిల్లీ, హైదరాబాద్‌లలో బీజేపీ ధర్నా చేపట్టంది.
యాత్రల్లో కాంగ్రెస్
బీఆర్‌ఎస్, బీజేపీలు పోటా పోటీ ధర్నాలు నిర్వహిస్తుండగా, కాంగ్రెస్ పార్టీ హాత్ సే హాత్ జోడో (Hath se Hath Jodo) యాత్ర పేరుతో పాదయాత్రలు నిర్వహిస్తున్నది. గ్రామ గ్రామానా సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నది. రైతులు ఎదుర్కొంటున్నధరణి సమస్యలను ప్రధాన ప్రచార అస్త్రంగా తీసుకున్నది. ధరణి పోర్టల్ (Dharani) ద్వారా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై శుక్రవారం పెద్దపల్లి జిల్లా సుల్తాన్ పూర్‌లో ధరణి అదాలత్ నిర్వహించింది. ధరణి సమస్యలు నమోదు చేసుకున్న రైతులకు గ్యారెంటీ కార్డులను అందించింది.