Vemulawada |
విధాత బ్యూరో, కరీంనగర్: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ (Vemulawada) మున్సిపల్ వ్యవహారాలు రసకందాయంలో పడ్డాయి. 20 మంది కౌన్సిలర్లు ఉన్న వేములవాడ మున్సిపల్ లో చైర్ పర్సన్‌పై అవిశ్వాసానికి జరుగుతున్న ప్రయత్నాలను అడ్డుకునేందుకు విహారయాత్ర రాజకీయానికి తెరలేసింది. కౌన్సిలర్లను బుజ్జగించే ప్రయత్నంలో భాగంగా దాదాపు 20 మంది అధికార, ప్రతిపక్ష కౌన్సిలర్లను చైర్ పర్సన్ భర్త రాజు గోవా ట్రిప్‌కు తీసుకెళ్లడం చర్చనీయాంశమైంది.
వేములవాడ పురపాలక సంఘం కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులతో కూడిన బృందం తో పాటు బీఅర్ఎస్ పట్టణ అధ్యక్షుడు కూడా మంగళవారం వేములవాడ నుండి గోవా ట్రిప్‌కు బయలుదేరి వెళ్లారు. ముఖ్యంగా తమపై అవిశ్వాస తీర్మానం పెడతారన్న సమాచారం, కౌన్సిల్ మీటింగ్లో తమకు అనుకూలంగా మద్దతు తెలిపాలని కోరుతూ మండుతున్న ఎండల్లో కౌన్సిలర్లను ‘చల్ల’బరిచేందుకు మూడు రోజుల పర్యటన ఖరారు చేసి తీసుకెళ్లారు.
గతంలో మున్సిపల్ బిల్లుల ఆమోదం కోసం ఏర్పాటు చేసిన సమావేశానికి సభ్యులు గైరాజర్ అయ్యారని, దీంతో మున్సిపల్ కౌన్సిల్ గడువు ముగిసే వరకు తమకు అనుకూలంగా ఉండాలని అధికార, ప్రతిపక్ష పార్టీ కౌన్సిలర్లను దాదాపు పది లక్షలు ఖర్చుపెట్టి తీసుకెళ్లడం వేములవాడలో ఆసక్తికర అంశం అయింది.