కట్టడి బాధ్యత మంత్రులకు బయ్యారం, గార్లలో ప్రభావం 'నూకల' పేరెత్తడంలో మతలబిదే? విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ఖమ్మం మాజీ ఎంపీ, గులాబీ అసమ్మతి నేత, తాజాగా బిజెపిలో చేరుతారని చర్చ జరుగుతున్నది. దీనికి తోడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇప్పటికే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తన పట్టును నిలబెట్టుకునేందుకు అనుచరులతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తూనే పొరుగున ఉన్న మహబూబాబాద్ జిల్లా పై కూడా దృష్టి సారించినట్లు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. గతంలో ఉమ్మడి […]

  • కట్టడి బాధ్యత మంత్రులకు
  • బయ్యారం, గార్లలో ప్రభావం
  • 'నూకల' పేరెత్తడంలో మతలబిదే?

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ఖమ్మం మాజీ ఎంపీ, గులాబీ అసమ్మతి నేత, తాజాగా బిజెపిలో చేరుతారని చర్చ జరుగుతున్నది. దీనికి తోడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇప్పటికే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తన పట్టును నిలబెట్టుకునేందుకు అనుచరులతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తూనే పొరుగున ఉన్న మహబూబాబాద్ జిల్లా పై కూడా దృష్టి సారించినట్లు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ సాగుతోంది.

గతంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భాగమైన బయ్యారం, గార్ల మండలాలు ప్రస్తుతం మానుకోట జిల్లాలో ఉన్నాయి. ఈ ప్రాంతాలపై పొంగులేటికీ అవగాహనతో పాటు అక్కడ ఆయన అనుచరులు ఉన్నారు.

ఈ అనుబంధానికి తోడు, పొంగులేటికి మానుకోట నియోజక వర్గంలో ఉన్న కుటుంబ సంబంధ బాంధవ్యాలు, సామాజిక వర్గ అనుబంధాలు బాగానే ఉపయోగపడే అవకాశాలు ఉన్నట్లు భావిస్తున్నారు. వీటి ద్వారా మానుకోటలో కూడా పాగా వేసేందుకు శ్రీనివాసరెడ్డి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

పొంగులేటి ఆకస్మిక తిరుగుబాటు

గత కొంతకాలంగా టిఆర్ఎస్ పై అసంతృప్తితో ఉన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇటీవల తన అసమ్మతిని బహిరంగంగా ప్రకటిస్తున్నారు. ఒక విధంగా అధిష్టానం పై తిరుగుబాటుకు సిద్ధమైనట్లు స్పష్టమైన సంకేతాలిస్తున్న విషయం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో పొంగులేటి బిఆర్ఎస్ పార్టీకి టాటా చెప్పి కమలం గూటికి చేరేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లతో పాటు పూర్వ రంగాన్ని సిద్ధం చేసుకున్నట్లు భావిస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభంతో తన అసమ్మతి కార్యాచరణకు పదును పెట్టి వేగంగా పావులు కదుపుతున్నట్లు అర్థమవుతుంది.

అనుచరులు జారకుండా జాగ్రత్త

ఖమ్మం జిల్లాలో పొంగులేటి అసమ్మతితో తలెత్తిన పరిస్థితిని చక్కదిద్దేందుకు అవసరమైన చర్యలు బీఆర్ఎస్ అధిష్టానం చేపట్టడానికి ముందే తన అనుచర వర్గాన్ని కట్టడి చేసుకుంటూ పట్టుసడలకుండా గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే తనకు బలమైన అనుచరులుగా ఉన్న నాయకులు బహిరంగంగా గులాబీ అధిష్టానంతో అమీతుమీకి సిద్ధమైనట్లు ప్రకటిస్తున్నారు.

కేడర్ చేజారి పోకుండా కాపాడుకునే ప్రయత్నంలో నిమగ్నమయ్యారు. ఉమ్మడి జిల్లాలోని భద్రాచలం, వైరా, కొత్తగూడెం, పినపాక, ఇల్లందు, మధిర, సత్తుపల్లి, ఖమ్మం, పాలేరు నియోజకవర్గాలలో పొంగులేటికి బలమైన అనుచర వర్గం ఉన్న విషయం తెలిసిందే. వారందరినీ తాను ఏ పార్టీలో చేరితే ఆ పార్టీలో తన వెంట వచ్చే విధంగా ఇప్పటికే కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది.

మానుకోటపై పొంగులేటి దృష్టి

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పట్టును నిలబెట్టుకుంటూనే పక్కనే ఉన్న మానుకోటపై నజర్ పెట్టినట్లు గులాబీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. తాను చేరనున్న పార్టీలో తన బలాన్ని ప్రదర్శించేందుకు మంచి అవకాశంగా చెబుతున్నారు. మూడు జిల్లాల్లో తన ప్రభావం ఉంటుందనే సంకేతాలిస్తున్నట్లు సమాచారం.

భద్రాద్రి జడ్పి చైర్మన్ కోరం కనకయ్య ఇల్లెందు నియోజకవర్గంలో బలమైన సామాజిక వర్గ నేతగా పొంగులేటి అనుచరునిగా ఉన్నందున ఆ ప్రభావం కూడా మానుకోటపై పడనున్నది.

ముఖ్యంగా పొంగులేటికి బీఆర్ఎస్ పార్టీ అన్యాయం చేసిందనే అభిప్రాయం ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న రెడ్డి సామాజిక వర్గంలో బలంగా ఉంది. ఈ కారణంగా మానుకోటలో ఆ సామాజిక వర్గం నుంచి సానుకూల పరిస్థితి నెలకొనే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.

ఈ ప్రాంత బలమైన నేతలతో దగ్గరి బంధుత్వం ఉంది. ఇతర వర్గాల్లో కూడా సానుకూలత ఉన్నందున అనుచరుల, అభిమానుల మద్ధతు కన్పిస్తుందని చెబుతున్నారు.

కేసీఆర్ నోట నూకల మాట

మాజీ ఎంపి, డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే, ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాలను ఒక దశలో శాసించిన జాతీయ స్థాయి కాంగ్రెస్ నేత, ముఖ్యమంత్రి కేసీఆర్ మానుకోట సభలో కీర్తించిన మాజీ మంత్రి నూకల రామచంద్రారెడ్డి స్వంత బావమరిది రామసహాయం సురేందర్ రెడ్డి మనవడికి ఇటీవలే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూతురుతో పెళ్లి జరిగింది. ఈ బాంధవ్యం ఈ సందర్భంగా గమనార్హం. ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత నూకల రామచంద్రరెడ్డిని ఆకాశానికి ఎత్తడం ఓ రాజకీయ వ్యూహంలో భాగమని పలువురు అభివర్ణిస్తున్నారు.

ఉద్యమకాలం నుండి నేటి దాకా మహబూబాబాద్ జిల్లాకు ఎన్నోసార్లు వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎప్పుడూ గుర్తుకురాని నూకల రామచంద్రారెడ్డి ఒక్కసారిగా మొన్నటి సభలో గుర్తు రావడం. మానుకోట గడ్డపై అడుగుపెట్టి నూకల రామచంద్రారెడ్డిని స్మరించుకోకుంటే ఆ..కార్యక్రమం అసంపూర్ణమే అంటూ ఆయనను పొగడ్తలలో ముంచెత్తడం, ఏకంగా ఆయనకు కాంస్య విగ్రహాన్నిఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడం గమనార్హం.

జత చేసిన పీవి పేరు

ఈ ఎత్తు బహిరంగం కాకుండా పీవీ పేరు జతచేయడం కేసీఆర్ రాజకీయ చతురతగా పేర్కొంటున్నారు. హన్మకొండలో పీవీనరసింహారావు విగ్రహం ఇప్పటికే ఉంది. అయినా ఇవన్నీ కేసీఆర్ ముందస్తు ఎత్తుగడలో భాగమంటున్నారు. మహబూబాబాద్ జిల్లాలో రాజకీయంగా నాయకత్వ స్థానంలో ఉంటూ ప్రభావితవర్గంగా పనిచేసే రెడ్డి సామాజికవర్గాన్ని కట్టడిచేసే కోణం ఇందులో దాగుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

బుజ్జగింపులూ… ప్రాధాన్యత

ఇల్లందు మాజీ ఎమ్మెల్యే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జెడ్పీచైర్మన్ కోరం కనకయ్య పొంగులేటి వెంట వెళ్ళకుండా బీఆర్ఎస్ నాయకులు బుజ్జగింపులు ప్రారంభించారు. బీఆర్ఎస్ రాష్ట్రకార్యదర్శి నూకల నరేష్ రెడ్డికి పార్టీలో సడన్‌గా అత్యంత ప్రాధాన్యత పెరిగింది.

జన సమీకరణతో గులాబీల అడ్డుకట్ట

పొంగులేటి ప్రభావం, ప్రయత్నం ఈ అంశాలన్నింటిని కెసిఆర్ ముందస్తుగానే పరిగణలోకి తీసుకొని అడ్డుకట్ట వేసేందుకు ప్రత్యేక వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు సమాచారం. దీనికి వరంగల్ ఉమ్మడి జిల్లాకు చెందిన, మానుకోటతో అనుబంధం ఉన్న మంత్రులు సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎంపీ కవితలకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం.

పొంగులేటి గాలి ఖమ్మం నుంచి మానుకోట జిల్లాకు సోకకుండా కట్టడిచేసే బాధ్యత అధిష్టానం అప్పగించినట్లు సమాచారం. బయటికి మేకపోతు గాంభీర్యం ప్రకటిస్తున్నప్పటికీ, అంతర్గతంగా పొంగులేటికి అడ్డుకట్ట వేసేందుకు ప్రత్యేక కార్యాచరణతో కదులుతున్నారు.

ఈనెల 18న ఖమ్మంలో జరిగే బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు పొంగులేటి ప్రభావం పడకుండా జనసమీకరణ చేపట్టే విధంగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ సభ సక్సెస్ బాధ్యతలు తీసుకున్న మంత్రి తన్నీరు హరీష్‌రావు ఇప్పటికే ఈ ప్రాంతాల్లో సమావేశాలు నిర్వహించారు. సభకు జన సమీకరణ ప్రయత్నం సాగుతోంది.

Updated On 16 Jan 2023 3:24 PM GMT
krs

krs

Next Story