Ponguleti Srinivas Reddy|
విధాత: బీఆర్‌ఎస్ బహిష్కృత నేత పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆత్మరక్షణలో పడ్డారా? ఏ పార్టీలో చేరాలో తేల్చుకోలేక కన్ఫ్యూజన్‌లో ఉన్నారా? కేసీఆర్‌ను గద్దె దింపడమే తన లక్ష్యమన్న ఆయన ప్రస్తుతం ఊగిసలాటలో ఉన్నారా? అంటే ఔననే అంటున్నారు. ఏ పార్టీలో చేరకుండా స్వతంత్రంగానే బరిలోకి దిగి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్క బీఆర్‌ఎస్ అభ్యర్థిని కూడా అసెంబ్లీలోకి అడుగుపెట్టనివ్వనని శపథం చేసిన ఆయన ఏ పార్టీవైపు అడుగువేయాలో తేల్చుకోలేక సతమతమవుతున్నారు.
ఖమ్మం జిల్లాలో ఆత్మీయ సమ్మేళనాల్లో సీఎం కేసీఆర్ లక్ష్యంగా తీవ్ర విమర్శలు చేశారు. పది నియోజకవర్గాలు, ఒక పార్లమెంటు స్థానం గెలుపే లక్ష్యంగా కొంతకాలంగా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. దీంతో మీడియా అంతా ఆయనఫైనే ఫోకస్ పెట్టింది. కానీ ఎప్పుడైతే ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకోబుతున్నారని వార్తలు రావడం, మరోవైపు ఈటల రాజేందర్ నేతృత్వంలోని బృందంతో ఆయన భేటీ కావడంతో పొంగులేటికి ఆయన అనుచరుల నుంచే ప్రశ్నలు ఎదురవుతున్నాయని సమాచారం.
వామపక్ష భావజాల ప్రభావం ఉన్న ఆ జిల్లాలో బీజేపీకి అంతగా బలం లేదు. కానీ ఆయన బీజేపీ నేతలతో సమావేశం కావడంతో ఇప్పటివరకు ఆయనపై ఉన్న కొద్దిపాటి సానుభూతి కూడా పోయింది అంటున్నారు. అలాగే ఆయనను బీఆర్‌ఎస్ సస్పెండ్ చేసిన తర్వాత ఏదో ఒక పార్టీలో చేరితో పరిస్థితి ఇక్కడిదాకా రాకపోయిది. కానీ వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్ ఇలా అన్ని పార్టీల నేతలతో టచ్‌లో ఉండటంతో పొంగులేటికి తాను రాజకీయంగా అనేక సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉన్నది.
మరోవైపు బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన నేతలకు తగిన ప్రాధాన్యం దక్కడం లేదని ప్రచారం జరుగుతున్నది. వాళ్లంతా వేరే పార్టీ పెట్టి ఒకే గొడుగు కిందికి రావాలనే ఆలోచనతో ఉన్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. అందుకే ఖమ్మంలో పొంగులేటితో పాటు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుతో ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, యెన్నెం శ్రీనివాస్‌రెడ్డి, ఏనుగు రవీందర్‌రెడ్డి సమావేశంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని స్పందన అడిగితే తనకు సమాచారం లేదన్నారు.
దీన్నిబట్టి రాష్ట్ర నాయకత్వాన్ని బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నేతల నుంచి బీజేపీలో చేరిన వారికి మధ్య సఖ్యత లేదనే సందేహాలు వ్యక్తమౌతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి బీఆర్‌ఎస్‌ను ఓడించే పార్టీలో తాను చేరుతానని గతంలో ప్రకటించారు. అధికారపార్టీకి ప్రత్యామ్నాయంగా ప్రజలే కాదు అదికారపార్టీ కూడా కాంగ్రెస్ పార్టీనే అంంటున్నది. మరి బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం తామే అని బీజేపీ నేతలు చెబతున్నారు కదా అని కొందరు అంటుండవచ్చు.
అయితే రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి ఏమిటి అని అడిగితే రాజకీయంగా అవగాహన ఉన్న ఎవరైనా ఇట్టే చెబుతారు. దానికి పెద్దగా ఆలోచన కూడా అక్కరలేదు. కాబట్టి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తాను పార్టీలో చేరాలనేది ఆయన కార్యకర్తల అభిప్రాయం మేరకు, వ్యక్తిగత ఆలోచన మేరకు ఏదైనా నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ ఆయనకు ఉన్నది.
అయితే బీజేపీ సిద్ధాంతాలు నచ్చకున్నా బీఆర్‌ఎస్ లేదా కాంగ్రెస్ ను వీడి తమ వ్యక్తిగత ప్రయోజనాల దృష్ట్యా కాషాయ తీర్థం పుచ్చుకుంటే ఏం జరుగుతున్నదో చూస్తున్నాం. పొంగులేటి కూడా వారి బాటలోనే నడిస్తే రాజకీయంగా బలోపేతం కంటే ఇబ్బందులే అధికంగా ఉంటాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
ఎందుకంటే ఈటల రాజేందర్ బీఆర్‌ఎస్ వీడిన తర్వాత ఉప ఎన్నిక అనివార్యం అని తేలడంతో ఆయన గ్రాఫ్ 75 శాతానికిపైగానే ఉన్నది. ఆయన కాషాయ కండువా కప్పుకున్న తర్వాత పోలింగ్ తేదీ నాటికి చాలా తగ్గిపోయిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. అలాగే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఉదంతాన్నికూడా ఉదాహరణగా చెబుతున్నారు.