- సంక్రాంతి తర్వాత రాజకీయ రణరంగమే అంటున్న విశ్లేషకులు..
విధాత: ప్రజల ఆశ్వీర్వాదం ఉంటే పదవులు అవే వస్తాయి. అధికారంలో ఉన్నా లేకున్నా నిత్యం ప్రజల్లోనే ఉన్నాను. నమ్ముకున్న వారి కోసమే నా జీవితం, ప్రజల ఆశీస్సులతో కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తాను.ఖమ్మం జిల్లాలో ప్రతి గ్రామంలో తిరిగి ప్రజల్ని కలుస్తాను. ఎన్నికష్టాలు వచ్చినా ప్రజలను వదిలేది లేదు. నన్ను ఇబ్బంది పెట్టినా ప్రజల నుంచి వేరు చేయలేరు. సమయం సందర్భం వచ్చినప్పుడు అన్ని విషయాలు వెల్లడిస్తానని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మణుగురులో తన అభిమానులు, అనుచరులతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.
పొంగులేటి తాజా వ్యాఖ్యలతో బీఆర్ఎస్తో తన అనుబంధం ముగిసిందనే చెప్పాలి. అధికారికంగా పార్టీని వీడటం, మరో పార్టీ కండువా కప్పుకోవడమే మిగిలింది. బహుశా ఆయన సమయం సందర్భం వచ్చినప్పుడు అన్ని విషయాలు వెల్లడిస్తాను అన్నది అందుకే. ఆ వేదిక నుంచే నాలుగేళ్లుగా అధికార పార్టీలో తనకు ఎదురైన చేదు అనుభవాలను ప్రజలతో పంచుకునే అవకాశం ఉన్నది. అలాగే వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేస్తానని కుండబద్దలు కొట్టారు. కాబట్టి ఖమ్మం పార్లమెంటు స్థానం లేదా మూడు జనరల్ స్థానాల్లోని ఏదో ఒక నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేయవచ్చు.
మొదటి నుంచి అంటున్నట్టు ఆయన పార్టీ మారుతారనే ప్రచారం ఒకటి అయితే ఆయన ఎంపీగా పోటీ చేస్తే ఆ పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లోనూ ఆ ప్రభావం ఉంటుందని అంటున్నారు. కేసీఆర్ కూడా బీఆర్ఎస్ ఆవిర్భావ సభ ఏర్పాట్ల గురించి ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతల భేటీలో పొంగులేటి అంశాన్ని ప్రస్తావించారు. ఆయన పార్టీ వీడినా క్యాడర్ వీడకుండా చూడాలని నేతలకు సూచించారు.
గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో వచ్చిన ఫలితాలు తిరిగి పునరావృతం కాకుండా ముందుగానే అక్కడ ఫోకస్ పెట్టారు. పొంగులేటి బీజేపీలో చేరుతారనే వార్తలు వస్తున్నాయి. అక్కడ కాంగ్రెస్ పార్టీ బలంగానే ఉన్నది. పొంగులేటి చేరిక కమలనాథులకు కలిసి వస్తుంది. చంద్రబాబు కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచే తెలంగాణలో ఆ పార్టీ ఉనికి చాటాలని భావిస్తున్నారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు తెలంగాణలో తన అదృష్టాన్ని పాలేరు నియోజకవర్గంలో పరీక్షించుకుంటున్నారు.
ఖమ్మంలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభ విజయవంతం చేసి విపక్ష నాలుగు పార్టీలకు గట్టి సంకేతం పంపాలని యోచిస్తున్నారు. ఇప్పటికైతే పొంగులేటి బైటపడ్డారు. ఇంకా తుమ్మల వైఖరి ఏమిటో తేలలేదు. ఆయన అసంతృప్తి జిల్లా మంత్రిపై ఉన్నది గానీ బీఆర్ఎస్ అధినేతపై మాత్రం ఆయన ప్రశంసలు కురిపిస్తున్నారు. దీంతో కేసీఆర్ నుంచి ఆయనకు స్పష్టమైన హామీ వస్తే పార్టీ మారకపోయే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. సంక్రాంతి సందర్భంగా ఉభయ గోదావరి జిల్లాలో కోడి పందెల వలె పండుగ తర్వాత ఖమ్మం జిల్లాలో రాజకీయ రణరంగం రసవత్తరంగా మారనున్నది.