Hyderabad జనంలో చర్చనీయాంశమైన పోస్టర్‌.. ఫ్లెక్సీ పోరు విధాత : కాంగ్రెస్‌ పార్టీ సీడబ్ల్యుసీ సమావేశాలు, బీజేపీ అమిత్‌ షా తెలంగాణ విమోచన సభ నేపధ్యంలో దేశ రాజకీయాలు రెండు రోజుల పాటు హైద్రాబాద్‌ కేంద్రంగా సాగుతున్నాయి. ప్రజల దృష్టిని ఆకర్షించడంలో కాంగ్రెస్‌, బీజేపీతో పాటు అధికార బీఆరెస్‌ పార్టీ లు ప్రచార యుద్ధానికి దిగగా, వాటి మధ్య పరస్పర ఆరోపణలతో సాగుతున్న పోస్టర్‌ వార్‌ తారాస్థాయికి చేరింది. ముందుగా బీఆరెస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా […]

Hyderabad

  • జనంలో చర్చనీయాంశమైన పోస్టర్‌.. ఫ్లెక్సీ పోరు

విధాత : కాంగ్రెస్‌ పార్టీ సీడబ్ల్యుసీ సమావేశాలు, బీజేపీ అమిత్‌ షా తెలంగాణ విమోచన సభ నేపధ్యంలో దేశ రాజకీయాలు రెండు రోజుల పాటు హైద్రాబాద్‌ కేంద్రంగా సాగుతున్నాయి. ప్రజల దృష్టిని ఆకర్షించడంలో కాంగ్రెస్‌, బీజేపీతో పాటు అధికార బీఆరెస్‌ పార్టీ లు ప్రచార యుద్ధానికి దిగగా, వాటి మధ్య పరస్పర ఆరోపణలతో సాగుతున్న పోస్టర్‌ వార్‌ తారాస్థాయికి చేరింది. ముందుగా బీఆరెస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా కర్నాటక ఎన్నికల తరహాలో కాంగ్రెస్‌ పోస్టర్‌ వార్‌కు తెరలేపింది.

కర్నాటక ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వంపై 40శాతం కమిషన్‌ సర్కార్‌ అంటూ పే సీఎం పేరుతో విస్తృత ప్రచారం సాగించి ఆశించిన విజయాన్ని అందుకుంది. అదే తరహాలో తెలంగాణ సీఎం కేసీఆర్‌ 30శాతం కమిషన్‌ సీఎంగా పేర్కోంటూ బుక్‌ మై సీఎం స్కామ్‌-2023 పేరుతో పోస్టర్‌ ప్రచారం, సోషల్‌ మీడియా ప్రచారం చేపట్టారు.

దీనికి కౌంటర్‌గా బీఆరెస్‌ ప్రభుత్వం రెండు జాతీయ పార్టీలను టార్గెట్‌ చేస్తూ పోస్టర్ల యుద్దాన్ని ముమ్మరం చేసింది. ముందుగానే మెట్రో, ఫై వోవర్ల ఫిల్లర్లను బుక్‌ చేసుకున్న బీఆరెస్‌ కాంగ్రెస్‌ పార్టీ సీడబ్ల్యుసీ సమావేశాలను లక్ష్యంగా చేసుకుని ఆ పార్టీకి సంబంధించిన 24మంది ముఖ్య నేతలపై వచ్చిన స్కామ్‌ల ఆరోపణలతో కూడిన వివరాల పోస్టర్లను వాటిపై నింపేసింది.

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్‌ ఖర్గే సహా మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌, సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ, సీడబ్ల్యుసీ సభ్యులు, వారి కుంభకోణాల వివరాలతో కరెప్ట్‌ వర్కింగ్‌ కమిటీ, బీవేర్‌ ఆఫ్‌ స్కామర్స్‌, స్కామర్లు జాగ్రత్త అనే ట్యాగ్‌ లైన్లతో పోస్టర్లు, హోర్డింగ్‌లు ఏర్పాటు చేశారు. ఈ పోస్టర్లను జనం ఆసక్తిగా తిలకిస్తూ యూపీఏ హాయంలో జరిగిన కుంభకోణాలను మరోసారి చర్చించుకుంటున్నారు.

అలాగే తెలంగాణలో 2016 రూపాయల పింఛన్‌ ఇస్తున్నారని, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో ఇస్తున్న పింఛన్లు ఎంత అని ప్రశ్నిస్తూ మరిన్ని ఫెక్సీలు, పోస్టర్లను ఏర్పాటు చేశారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇస్తామన్న రాహుల్, సోనియా ఎందుకు జాతీయ హోదా ఇవ్వడం లో విఫలం అయ్యారు అంటూ మరిన్ని పోస్టర్లు వేశారు.

మీ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు రైతులకు వ్యవసాయానికి మూడు గంటల విద్యుత్ చాలు అంటున్నారు దానికి మీరు ఒప్పుకుంటున్నారా అంటూ కాంగ్రెస్ కు ప్రశ్నలు సంధించారు. 2004 నుండి 2014 వరకు అధికారం లో ఉన్న కాంగ్రెస్ ఎస్సీ వర్గీకరణ చెయ్యలేదని, ఇప్పుడు కూడా ఎస్సీ డిక్లరేషన్ పేరుతొ అలానే చేస్తారా? అంటూ పోస్టర్‌లలో ప్రశ్నించారు.

అటు బీజేపీకి వ్యతిరేకంగా సెప్టెంబర్‌ 17న పరేడ్‌ గ్రౌండ్‌లో తెలంగాణ విమోచన సభకు హాజరవుతున్న అమిత్‌ షాను ప్రశ్నిస్తూ నగరంలో పోస్టర్లు, ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు పెట్టారు. గోవా విమోచన దినోత్సవానికి 300కోట్లు ఇచ్చిన మోడీ ప్రభుత్వం తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవానికి ఒక్క రూపాయి ఎందుకు ఇవ్వలేదంటూ వాటిలో ప్రశ్నించారు. తెలంగాణకు వస్తున్న అమిత్‌షా ఏమైనా నిధులిస్తారా అంటూ ఫ్లెక్సీలలో పశ్నించారు. ఈ ఫ్లెక్సీలను ఎక్కువగా పరేడ్‌ గ్రౌంట్‌ చుట్టూ పెట్టారు.

Updated On 16 Sep 2023 12:26 PM GMT
somu

somu

Next Story