- KMC మెడికో ప్రీతి ఆత్మహత్యయత్నం కేసులో వెలుగు చూస్తున్న నిజాలు.
- ప్రీతి తండ్రి ఎఎస్పీతో ఫోన్ చాటింగ్ వివరాలు బహిర్గతం
- పోలీసుల విచారణ ముమ్మరం
- మలుపు తిరిగిన ప్రీతి ఆత్మహత్య కేసు
- తెరపైకి హోంమంత్రి మహమూద్ అలీ పేరు
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: వరంగల్ పోలీస్‌ల నిర్లక్ష్యం వల్లే ప్రీతి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించిందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసులు సకాలంలో స్పందించి తగిన చర్యలు తీసుకుంటే ఆత్మహత్యాయత్నం నిలువరించే అవకాశాలు ఉండేవని అభిప్రాయం వ్యక్తమవుతుంది. KMC మెడికో ప్రీతి ఆత్మహత్యయత్నం సంఘటన తాజాగా మరో మలుపు తీసుకుంది. ఒకవైపు పోలీసులు మరోవైపు కాలేజ్ ప్రొఫెసర్ల కమిటీ విచారణ కొనసాగుతోంది.
మెడికో ప్రీతి తండ్రి వరంగల్ రైల్వే స్టేషన్లో ఆర్పిఎఫ్ ఏఎస్ఐగా పని చేస్తున్న ధరావత్ నరేందర్ నాయక్ వరంగల్ పోలీసులతో జరిపిన చాటింగ్ బహిరంగం కావడంతో పోలీసుల నిర్లక్ష్యం వెలుగు చూస్తోంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
చొరవ తీసుకున్న ప్రీతి తండ్రి
నిందితుడు సీనియర్ పిజి మెడికో సైఫ్ చేస్తున్న అఘాత్యాల గురించి తన తండ్రి నరేందర్ నాయక్‌కు వివరాలన్నీ ప్రీతి చెప్పింది. తన బిడ్డకు భరోసా ఇస్తూనే తాను కూడా రైల్వే పోలీస్ శాఖలో ఉద్యోగిగా ఉన్నందున చొరవ తీసుకొని వరంగల్ ఏఎస్పీకి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు.
ఎఎస్పీకి ఫోన్లో మెసేజ్
దీంతో పరిస్థితిని ఎఎస్పీ బోనాల కిషన్ దృష్టికి తీసుకువచ్చేందుకు తన ఫోన్ ద్వారా మెసేజ్ పెట్టారు. ఈనెల 21వతేదీ రాత్రి 9 గంటల 57 నిమిషాలకు నరేందర్ నాయక్ తన ఫోన్ నుంచి ‘Sir jaihind I D.Narender ASI/RPF warangal railway station please lift my call, అంటూ ఒక మెసేజ్ పంపించారు.
వెంటనే రెండవ మెసేజ్ Dr said anaesthesia second year kmc 9963611275, 83280288551 Harassing all juniors doctor of anaesthesia department పంపించారు. ఈ రెండు మెసేజ్‌లు రాత్రి 10.28 నిమిషాల సమయంలో చదివినట్లు చాటింగ్‌లో ఉంది.
అదే సమయంలో రెండవ మెసేజ్ ని మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ కు కూడా నరేందర్ తన ఫోన్ నుంచి పంపించారు. ఎమ్మెల్యేకు రాత్రి10.13 నిమిషాలకు పంపించినట్లు చాటింగ్‌లో ఉంది.
ఆత్మవిశ్వాసం సన్నగిల్లి ఆత్మహత్యాయత్నం
పోలీస్‌లకు మెస్సేజ్ పంపినా రెస్పాన్స్ రాకపోవడంతో తండ్రి నరేందర్ నాయక్ మనస్తాపంతో ఈ విషయాన్ని తన కూతురికి చెప్పి బాధను వ్యక్తం చేశారు. తన తండ్రి స్వయంగా ఆర్ ఎఎస్సై కావడంతో పోలీస్ ప్రొటెక్షన్ లభిస్తుంధుని ఎదురుచూసిన ప్రీతికి తండ్రి సమాధానంతో నిరాశ నెలకొంది.
తన తండ్రి పోలీస్‌లకు ఫోన్ చేసి వివరాలు చెప్పినప్పటికీ స్పందించకపోవడంతో పోలీసుల సహకారం లభించలేదంటూ ఆత్మవిశ్వాసం సన్నగిల్లి ప్రీతి ఆత్మహత్య యత్నం చేసినట్లు భావిస్తున్నారు.
తనకు హోంమంత్రి అండ ఉంది
ఇదిలా ఉండగా కొంతకాలంగా ప్రీతిని వేదిస్తున్న సీనియర్ పి జి మెడికో సైఫ్ తనకు హోం మంత్రి మహమూద్ అలీ అండదండలు ఉన్నాయని బెదిరించినట్లు ప్రీతి తన తండ్రికి తెలిపినట్లు తెలుస్తుంది.
దర్యాప్తులో వేగం పెంచిన పోలీసులు
ఒకవైపు పోలీసుల జాప్యం వల్లే ప్రీతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందనే విమర్శలు వ్యక్తం అవుతుండగా ఈ కేసులో వరంగల్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ప్రీతి ఆత్మహత్య సంఘటన పట్ల విద్యార్థి సంఘాలు, రాజకీయ పక్షాలు జోక్యం చేసుకోవడంతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
ప్రీతి కేసులో నిందితుడు సైఫ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. గతకొంతకాలంగా ప్రీతిని సైఫ్ వేధించినట్లు ఆధారాలు లభ్యమైనట్లు తెలిసింది. ప్రీతిని అవమానించే రీతిలో సైఫ్ వాట్సాప్ లో చాటింగ్ చేసినట్లు గుర్తించినట్లు చెబుతున్నారు.
ఈ మేరకు సైఫ్ దగ్గర నుంచి పలు వివరాలు పోలీసులు సేకరించారు. దర్యాప్తులో భాగంగా ఆధారాల కోసం ఆత్మహత్యాయత్నం చేసుకున్న ప్రీతి గదిని పోలీసులు పరిశీలించారు. ఆమె గదిలో మత్తు ఇంజక్షన్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇతరత్రా ఆధారాలపై కూపి లాగుతున్నట్లు సమాచారం.
నిష్పాక్షికంగా విచారిస్తే వాస్తవాలు వెలుగులోకి..
ఏమైనా పీజీ మెడికో ధరావత్ ప్రీతి ఆత్మహత్యాయత్నం సంఘటనపై అటు ప్రొఫెసర్ల కమిటీ ఇటు పోలీసుల దర్యాప్తు నిష్పక్షపాతంగా చేపెడితే వాస్తవాలు వెలుగు చూసే అవకాశాలు ఉన్నట్లు భావిస్తున్నారు.
కేఎంసీ వేధింపుల కేసులో నింధితునిపై ర్యాగింగ్, అట్రాసిటీ కేసు నమోదు: ఏఎస్పీ
కాకతీయ మెడికల్ కళాశాల పిజి విద్యార్థిని ధరావత్ ప్రీతి ఆత్మ హత్యాయత్నం కేసులో నింధితునిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీతో పాటు ర్యాగింగ్ కేసు నమోదు చేసినట్లు వరంగల్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ బోనాల కిషన్ తెలిపారు.
నిందితునిపై క్రైమ్ నంబర్ 69/2023 u/s 306 r/w 108 , 354 of IPC, 4(v) of ragging act, 3(1)(r), 3 (2)(va),3 (1)(w)(ii) of sc st act నమోదు చేశామని చెప్పారు.
బాధితురాలు బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ జరిపి ఈ కేసు నమోదు చేశామని తదుపరి విచారణ అనంతరం శాఖా పరమైన చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా వివరించారు.
తప్పు చేస్తే ఎంతటి వారైనా చట్టం ముందు శిక్షార్హులే నని దోషులు ఎప్పటికైనా తప్పించుకోలేరని అన్నారు. సంస్థాగతంగా పూర్తి స్థాయిలో విచారణ లేకుండా సామాజిక మధ్యమాల్లో వస్తున్న సమాచారం సరైనది కాదని అందరూ సంయమనం పాటించాలని సూచించారు.
ప్రీతి కుటుంబాన్ని పరామర్శించిన ఉషా దయాకర్
హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో మెరుగైన చికిత్స పొందుతున్న ధరావత్ ప్రీతి కుటుంబాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సతీమణి ఉషా దయాకరరావు గురువారం పరామర్శించారు. ప్రీతికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు అభ్యర్థించారు.
పీజీ వైద్య విద్యార్థి స్వస్థలం పాలకుర్తి నియోజకవర్గం మొండ్రాయి గ్రామం గిర్నితండాకు చెందిన వారుగా చెప్పారు. ప్రీతి తల్లిదండ్రులు శారద, (రైల్వేలో ఏఎస్ఐ) దరావత్ నరేందర్ నాయక్‌లతో మాట్లాడారు. జరిగిన పరిస్థితులను తెలుసుకున్నారు. వారికి ధైర్యం చెప్పారు.