విధాత: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం హెలికాప్టర్ ద్వారా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కుమార్తె ఇతి శ్రీ ముర్ము, గవర్నర్ తమిళసై సౌందర్ రాజన్ లతో కలిసి యాదగిరిగుట్టకు ఉదయం 9:45గంటలకు చేరుకున్నారు.
రాష్ట్రపతి ముర్ముకు హెలిపాడ్ వద్ద దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, మంత్రులు గుంట కండ్ల జగదీశ్‌రెడ్డి, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, ఈవో గీత స్వాగతం పలికారు. హెలిపాడ్ నుంచి కాన్వాయ్‌లో గుట్టపైకి చేరుకున్న రాష్ట్రపతికి ఆలయ అర్చకులు మంగళ వాయిద్యాలతో, పూర్ణకుంభ స్వాగతం పలికారు.
ఉత్తర ద్వారం నుండి ఆలయంలోకి ప్రవేశించిన రాష్ట్రపతి గర్భాలయంలో శ్రీ లక్ష్మీనరసింహులను దర్శించుకుని సంకల్పం, సువర్ణపుష్పార్చన పూజలు నిర్వహించారు. స్వామి వారి దర్శనానంతరం రాష్ట్రపతికి ఆలయ పండితులు చతుర్వేద ఆశీర్వచనం పలికారు.
ఆలయ లడ్డు ప్రసాదాలను, జ్ఞాపికలను అందజేశారు. యాదాద్రి లక్ష్మీ నరసింహ ఆలయం పునర్నిర్మాణం జరిగాక ఆలయాన్ని సందర్శించిన మొదటి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కావడం విశేషం. ప్రధాన ఆలయ పరిసరాలను పరిశీలించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆలయ శిల్ప కళా శోభను తిలకించి ముగ్ధురాలయ్యారు.
ఆలయ నిర్మాణ విశేషాలను ఫోటో ఎగ్జిబిషన్ ద్వారా ఈవో గీత రాష్ట్రపతికి వివరించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ముర్ము ఆలయ అధికారులు, సిబ్బంది, పండితులతో ఫోటో సెషన్ లో పాల్గొన్నారు. ఆలయ పరిసరాల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మొక్కను నాటారు. అనంతరం 10:15గంటలకు నేరుగా హెలిప్యాడ్ చేరుకుని హైదరాబాద్ కు తిరుగు పయనమయ్యారు.