ఏర్పాట్లు ప‌రిశీలించిన రాచ‌కొండ సీపీ మ‌హేష్ భ‌గ‌వ‌త్‌, క‌లెక్ట‌ర్ పమేలా స‌త్ప‌తి అద‌నంగా మూడు హెలీప్యాడ్‌లు సిద్ధం విధాత: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానాన్ని సందర్శించనున్నారు. రాష్ట్రపతి రాకను పురస్కరించుకొని జిల్లా యంత్రాంగం, దేవస్థానం అధికారులు, పోలీసులు చేపట్టిన ఏర్పాట్లను గురువారం సమీక్షించుకున్నారు. రాష్టప్రతి కాన్వాయ్ హెలిపాడ్ నుంచి కొండపైకి రాకపోకలు సాగించే మార్గంలో గురువారం రాచకొండ సీపీ మహేష్ భగవత్, కలెక్టర్ పమేల సత్పతి బృందం […]

  • ఏర్పాట్లు ప‌రిశీలించిన రాచ‌కొండ సీపీ మ‌హేష్ భ‌గ‌వ‌త్‌, క‌లెక్ట‌ర్ పమేలా స‌త్ప‌తి
  • అద‌నంగా మూడు హెలీప్యాడ్‌లు సిద్ధం

విధాత: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానాన్ని సందర్శించనున్నారు. రాష్ట్రపతి రాకను పురస్కరించుకొని జిల్లా యంత్రాంగం, దేవస్థానం అధికారులు, పోలీసులు చేపట్టిన ఏర్పాట్లను గురువారం సమీక్షించుకున్నారు.

రాష్టప్రతి కాన్వాయ్ హెలిపాడ్ నుంచి కొండపైకి రాకపోకలు సాగించే మార్గంలో గురువారం రాచకొండ సీపీ మహేష్ భగవత్, కలెక్టర్ పమేల సత్పతి బృందం తమ వాహనశ్రేణితో రిహార్సల్స్ సాగించారు. రాష్ట్రపతి రాక సందర్భంగా ఆమె వచ్చి వెళ్లేంత వ‌రకు భక్తులకు స్వామి వారి సర్వదర్శనాలను నిలిపివేయనున్నారు.

ఉదయం 9:10గంటలకు హైద్రాబాద్ బొల్లారం రాష్ట్రపతి నిలయం నుంచి హెలికాప్టర్‌లో రాష్ట్రపతి ముర్ము 9:30కి యాదగిరిగుట్టకు చేరుకోనున్నారు. అక్కడి నుంచి కాన్వాయ్‌లో 9:50కి కొండపైకి చేరుకుని 10గంటల నుంచి 10:30వరకు స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి తిరిగి బొల్లారం చేరుకుంటారు.

రాష్ట్రపతి పర్యటన కోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లలో భాగంగా పెద్దగుట్టపై ఇప్పటికే ఉన్న హెలిఫ్యాడ్ తో పాటు అదనంగా మరో మూడు హెలిప్యాడ్లు సిద్ధం చేశారు. రాష్ట్రపతి హెలిప్యాడ్ నుండి కాన్వాయ్ లో నేరుగా కొండపైగల ప్రోటోకాల్ ఆఫీస్ పక్క నుంచి ప్రధాన ఆలయం చేరుకునేలా ఏర్పాట్లు చేశారు. బాలాలయం నుండి ప్రధానాలయం క్యూ కాంప్లెక్స్ వరకు ప్రత్యేక ర్యాంపు ఏర్పాటు చేశారు.

యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని ఇప్పటివరకు నలుగురు భారత రాష్ట్రపతులు దర్శించుకున్నారు. 1956లో భారత మొదటి రాష్ట్రపతి డాక్టర్ బాబు రాజేంద్రప్రసాద్, తర్వాత ఆరేళ్లకు 1962లో రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, తదుపరి 1996లో రాష్ట్రపతి శంకర్ దయాల్ శర్మ, 2015లో ప్రణబ్ ముఖర్జీలు లక్ష్మీనరసింహుడిని దర్శించుకోవడం గమనార్హం.

Updated On 29 Dec 2022 3:19 PM GMT
CH RAJITHA

CH RAJITHA

Next Story