Wednesday, March 29, 2023
More
    HomelatestDHARANI: రైతుల భూములకు పట్టాదారు ‘గ్రామంలో లేరు’ తండ్రి కాలంలో ‘డాట్‌’

    DHARANI: రైతుల భూములకు పట్టాదారు ‘గ్రామంలో లేరు’ తండ్రి కాలంలో ‘డాట్‌’

    • ధరణిలో విచిత్రం
    • మైనర్ల హక్కుల కల్పన ఏదీ?
    • ఫౌతి చిక్కులెన్నో…
    • సాధ్యం కాని జాయింట్‌ రిజిస్ట్రేషన్‌

    పార్ట్‌-2

    DHARANI: భూమి సమస్యలకు సర్వరోగ నివారణి ధరణి అన్న ప్రభుత్వం.. పోర్టల్‌లో అనేక ఆప్షన్లు ఇవ్వలేదు. ఇచ్చిన వాటికేమో దరఖాస్తు చేయగానే రిజక్ట్‌ అని వస్తున్నది. ఇవ్వని వాటికి దరఖాస్తు కూడా చేసుకోలేని పరిస్థితి రైతులకు ఏర్పడింది. చివరకు వారసత్వ బదలాయింపులకూ ఇబ్బంది పడాల్సిన దుస్థితి ధరణిలో ఏర్పడింది. జాయింట్‌ రిజిస్ట్రేషన్లకు మంగళం పాడారు… కొన్ని భూములకు పట్టదారుకాలంలో ‘గ్రామంలో లేరు’ అని, తండ్రి కాలంలో ‘డాట్‌’ అని నమోదు చేసిన వైనం మనకు స్పష్టంగా కనిపిస్తోంది. వీటన్నింటినీ సరి చేయాలని పౌర సమాజం కోరుతోంది. ఆయా సమస్యలపై కేబినెట్‌ సబ్ కమిటీ (Cabinet Sub committee) చేసిన సూచనలు కూడా అమలులోకి రాకపోవడం గమనార్హం. ఈ మేరకు కాంగ్రెస్‌ నేత బక్క జడ్సన్‌ ఇచ్చిన వినతి పత్రం సారాంశం ఇలా ఉంది.

    విధాత: ధరణి (Dharani)లో చిత్ర విచిత్రాలు చోటు చేసుకున్నాయి. ధరణి పోర్టల్‌ వచ్చి మూడేళ్లు కావస్తున్నా… సమస్యల పరిష్కారంపై దృష్టి కేంద్రీకరించినట్లు లేదు. ముఖ్యంగా ఏళ్ల తరబడి పహాణిలో నమోదవుతూ వచ్చిన కొంత మంది రైతుల పేర్లు ధరణి వచ్చాక కనిపించకుండాపోయాయి. ఇలాంటి భూములకు ధరణిలో పట్టాదారు కాలంలో ‘గ్రామంలో లేరు’ అని, తండ్రి కాలంలో ‘డాట్‌’ అని నమోదు చేశారు.

    ఫలితంగా ఆయా భూముల యజమానులు (Landowners) పాత పాస్‌ పుస్తకంతో కలిపి కొత్త పాస్‌ బుక్‌ (New Pattadar Pas Book) కోసం నమోదు చేసుకుంటే రిజెక్ట్‌ చేస్తున్నారు. ఉదాహరణకు పెద్దపల్లి జిల్లా తరుపల్లెలో46 ఎకరాల భూమికి పట్టాదారు కాలంలో ‘గ్రామంలో లేరు’ అనే పేరుతో ఎంట్రీ చేశారు. తండ్రి కాలంలో ‘డాట్‌’ పెట్టారు. అయితే ఆ భూముల రైతులంతా అక్కడే ఉండి వ్యవసాయం చేసుకుంటుండటం గమనార్హం. ఇది రెవెన్యూ అధికారుల దాష్టీకానికి పరాకాష్ట.

    జాయింట్‌ రిజిస్ట్రేషన్‌ ఆప్షన్‌ ఏది?

    ధరణిలో ఎన్నెన్నో చిత్రాలున్నాయి. జాయింట్‌ రిజిస్ట్రేషన్‌కు ఆప్షన్‌ ఇవ్వలేదు. దీంతో గతంలో జాయింట్‌ రిజిస్ట్రేషన్‌ అయిన ఆస్తులను అమ్మాలన్నాకొనాలన్నా వీలు కావడంలేదు. క్రయ విక్రయాల పరంగా ఒకే అమ్మకం దారు… ఒకే కొనుగోలు దారు ఉంటేనే లావాదేవీలు జరుగుతున్నాయి.

    పాస్‌ బుక్‌ లేకుంటే ఫౌతీ ఏది?

    వివిధ కారణాల వల్ల కొత్త పాస్‌ బుక్‌ రాని రైతులు ఏదో ఒక కారణంతో మరణిస్తే సదరు రైతు వారసులకు భూమిని విరాసత్‌ (ఫౌతీ) చేయడం లేదు. చనిపోయిన రైతు పేరున ఉన్న భూమిని వారసుల పేరుమీదకు మార్చాలంటే ధరణిలో భూ యజమానికి సంబంధించిన పాస్‌ బుక్‌ తప్పని సరిగా నమోదుచేయాల్సి ఉంటుంది. కానీ వివిధ కారణాల వల్ల కొంత మంది రైతులకు కొత్త పాస్‌ బుక్‌లు రాలేదు. ఈ తరహా రైతులు ఎవరైనా దురదృష్టవశాత్తు చనిపోతే కొత్తపాస్‌బుక్‌ లేదన్న కారణంతో ఫౌతీ చేయడం లేదు. అలాగే ఆధార్‌ (Aadhar) కార్డ్‌ వ్యవస్థ రావడానికి ముందు భూమిని కొనుగోలు చేసిన వ్యక్తి తన పేరిట మ్యుటేషన్‌ (Mutation)కాకముందే మరణిస్తే, అలాంటి వారి వారసులకు భూమిపై యజమాన్య హక్కులు కల్పించడం ఇబ్బంది అవుతున్నది.

    రిజిస్ట్రేషన్ల ప్రక్రియలోనూ..

    రిజిస్ట్రేషన్ల (Registration)ప్రక్రియలోనూ అనేక అడ్డంకులు ఎదురవుతున్నాయి. గతంలో రిజిస్ట్రేషన్‌ సమయంలో హాజరు కాలేని భూ యజమానులు తమ తరఫున కుటుంబ సభ్యులను పంపించేందుకు 32(ఏ) ఆథరైజేషన్‌ పత్రాన్ని ఇస్తే.. దాని ఆధారంగా సబ్‌ రిజిస్ట్రార్‌ (Sub Registrar)భూ యజమాని సూచించిన వారితో లావాదేవీలు పూర్తి చేసే వాడు. ధరణిలో ఈ విధానానికి చరమగీతం పాడారు. ఫలితంగా క్రయవిక్రయాలలో భూ యజమానులు, కొనుగోలు దారులు ఇబ్బందులకు గురవుతున్నారు. అలాగే పాత రిజిస్ట్రేషన్‌ విధానంలో పిల్లల (మైనర్ల) పేరిట గిఫ్ట్‌ డీడ్‌ (Gift Deed) చేయడానికి వీలుండేది. పిల్లల సంరక్షకుడి పేరు జత చేస్తూ రిజిస్ట్రేషన్‌ చేసి హక్కు పత్రాలు జారీ చేసే వారు. ధరణిలో ఇలాంటి ఆప్షన్‌ ఇవ్వలేదు.

    పట్టదారుల సమస్యలు ఎన్నెన్నో….

    • రికార్డ్‌ల్లో చాలా చోట్ల పట్టదారు పేరులో అక్షర దోషాలు, ఇతర తప్పులు నమోదయ్యాయి.
    • ఏదైనా డాక్యుమెంట్‌లో తప్పులు ఉంటే వాటిని సవరించడానికి కేవలం నాలుగు అంశాలకు మాత్రమే వెసులుబాటు ఉంది. పాన్ కార్డ్‌, వ్యక్తిగత వివరాలు, హద్దులు, చిరునామా కాకుండా ఇతర అంశాల్లో.. ముఖ్యంగా సర్వే నంబర్ల వంటి వాటిల్లో తప్పులు సవరించుకోవడానికి వీలు లేకుండా పోయింది.
    • పలు చోట్ల పట్టా భూములు లావణి భూములుగా, మరికొన్ని చోట్ల భూదాన్‌, దేవాదాయ భూములుగా ధరణిలో పేర్కొన్నారు.
    • పట్టా భూములు కూడా నిషేధిత జాబితాల్లో నమోదు కావడం ధరణిలో మరో ముఖ్యమైన సమస్య.
    • అనేక చోట్ల సర్వే నంబర్లు, వాటి సబ్‌ డివిజన్‌ నంబర్లు ధరణి పోర్టల్‌లో కనిపించడం లేదు. ఈ ఒక్క అంశంపైననే 35 వేల వరకు ఫిర్యాదులున్నాయి.
    • భూ విస్తీర్ణం నమోదులో అనేక తప్పిదాలున్నాయి. ఈ అంశంపై 16 వేల ఫిర్యాదులున్నాయి.
    • పాత రిజిస్ట్రేషన్ విధానంలో సబ్‌ రిజిస్ట్రార్‌ ఒక భూమి విలువను ధృవీకరిస్తూ పత్రం జారీ చేసే వారు. కోర్టు ద్వారా రిజిస్ట్రేషన్‌ ప్రక్రియలో ఈ పత్రం పనికొచ్చేది. అయితే ధరణిలో మార్కెట్‌ విలువ ధృవీకరణ పత్రం జారీ చేసే అవకాశం లేదు. ఇది రైతులకు ఇబ్బందిగా మారింది.

    క్యాబినెట్‌ సబ్‌ కమిటీ సూచనలు ఇవే..

    • ప్రత్యేక మాడ్యూల్స్‌ (Special Modules) రూపకల్పన
    • ఒకరి కంటే ఎక్కువ మంది కొనుగోలు, అమ్మకం దారులకు అనుమతిచ్చేలా పోర్టల్‌ సాఫ్ట్‌ వేర్‌ అప్‌డేట్‌ (Software Update) చేయడంతో పాటు ప్రత్యేక మాడ్యూల్‌ రూపకల్పన.
    • జిల్లా స్థాయిలో ధరణి హెల్ప్‌ డెస్క్‌ల (Help Desk) ఏర్పాటు
    • ధరణి పోర్టల్‌ను సమర్థవంతంగా అమలు చేయడానికి రెవెన్యూ అధికారులకు శిక్షణ ఇవ్వాలి. జడ్పీ, మున్సిపల్‌ సమావేశాలకు జిల్లా కలెక్టర్‌ హాజరై పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ఇవ్వడం ద్వారా స్థానిక ప్రజా ప్రతినిధులకు అవగాహన కల్పించాలి.
    • ఏజెన్సీ ప్రాంతాల్లోని (Agency Area) భూముల వారసత్వ మార్పునకు కార్యాచరణ రూపొందించాలి.
    • హైకోర్టులో దాఖలైన మూడు రిట్‌ పిటిషన్లపై అధ్యయనం చేయాలి.
    • సాఫ్ట్‌వేర్‌ సమస్యల పరిష్కారానికి నిపుణుల సేవలను ఉపయోగించుకోవాలి.
    • దరఖాస్తు దారుల బయోమెట్రిక్‌ (Bio Metric) తీసుకోవాలి. సంబంధిత డాక్యుమెంట్లను అప్‌లోడ్‌ చేయాలి. వాటిని పరిశీలించి కలెక్టర్‌ జారీ చేసే ఉత్తర్వులను పోర్టల్‌లో పొందుపరిచేలా డాటా మేనేజ్‌మెంట్‌ మాడ్యూల్‌ను అందేబాటులోకి తేవాలి.
    • ఎన్నారైల నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు భూక్రయ విక్రయ లావాదేవీల సమయంలో వారు నియమించుకున్న ప్రతినిధిని స్పెషల్‌ పవర్‌ ఆఫ్‌ అటార్నీ (Special Power of Attorney)(ఎస్‌పీఏ)గా గుర్తించేందుకు రిజిస్ట్రేషన్ల చట్టానికి అనుగుణంగా మార్పులు చేయాలి.
    • ఆక్యుపెన్సీ రైట్స్‌ సర్టిఫికెట్‌ (Occupancy Rights Certificate)(ఓఆర్సీ) ప్రొటెక్టెడ్‌ టెనెంట్స్‌ సర్టిఫికెట్‌ (పీటీసీ)లను జారీ చేసేందుకు ప్రత్యేక మాడ్యూల్‌ను అభివృద్ధి చేసి కలెక్టర్ల ద్వారా పత్రాలు జారీ చేయించాలి.

    DHARANI। ధరణిలో రైతు సమస్యలకు పరిష్కారం ఎన్నడో…?

    spot_img
    RELATED ARTICLES

    Latest News

    Cinema

    Politics

    Most Popular