విధాత: బీజేపీ, టీఆర్ఎస్ రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తున్నాయని, రాజ్యాంగ విరుద్థంగా పాలన సాగిస్తున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. గాంధీభవన్లో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకల్లో భట్టి విక్రమార్క, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. రాజ్యాంగాన్ని పరిరక్షిద్దామని కాంగ్రెస్ శ్రేణులతో భట్టి ప్రమాణం చేయించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్తోనే రాజ్యాంగ పరిరక్షణ అని, రాజ్యాంగాన్ని అందించడంలో కృషి చేసిన కాంగ్రెస్కు నిబద్ధతతో ఉండాలన్నారు. భావన ప్రకటన స్వేచ్ఛను మోడీ ప్రభుత్వం హరిస్తున్నదని, రాజ్యాంగాన్ని మార్చి మనుశాస్త్రాన్ని అమలు చేయాలని బీజేపీ చూస్తున్నదని మండిపడ్డారు. రాజ్యాంగాన్ని మార్చాలన్న బీజేపీ, టీఆర్ఎస్ కుట్రలను తిప్పికొట్టాలన్నారు.
దేశంలో ఆర్థిక అసమానతలను బీజేపీ పెంచి పోషిస్తున్నదని, ఒకరిద్దరు కార్పొరేట్లకే దేశ సంపదను దోచిపెడుతున్నదని ఆరోపించారు. రాజకీయ సమానత్వంలో పేదవాడు కూడా ఎన్నికల్లో గెలవాలన్నారు. బీజేపీ చేస్తున్న అరాచకాలను కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని భట్టి పిలుపునిచ్చారు. రాజ్యాంగ మూల సిద్ధాంతమే.. కాంగ్రెస్ మూల సిద్ధాంతం అని తెలిపారు.