విధాత, మెదక్ బ్యూరో: ప్రజావాణిలో వచ్చిన వినతులను పరిశీలించి సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని అదనపు కలెక్టర్ రమేష్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి వివిధ సమస్యల నిమిత్తం వచ్చిన వారి నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ప్రజావాణిలో నేరుగా అధికారుల దృష్టికి సమస్యలు తీసుకురావడం ద్వారా సమస్యల పరిష్కారానికి ఖచ్చితమైన సమాధానం లభిస్తుందనే నమ్మకంతో వస్తారని, ఆ నమ్మకాన్ని వ‌మ్ము చేయకుండా తమ పరిధిలో పరిష్కారమైతే వెంటనే పరిష్కరించాలని, లేకుంటే […]

విధాత, మెదక్ బ్యూరో: ప్రజావాణిలో వచ్చిన వినతులను పరిశీలించి సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని అదనపు కలెక్టర్ రమేష్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి వివిధ సమస్యల నిమిత్తం వచ్చిన వారి నుండి ఫిర్యాదులను స్వీకరించారు.

ప్రజావాణిలో నేరుగా అధికారుల దృష్టికి సమస్యలు తీసుకురావడం ద్వారా సమస్యల పరిష్కారానికి ఖచ్చితమైన సమాధానం లభిస్తుందనే నమ్మకంతో వస్తారని, ఆ నమ్మకాన్ని వ‌మ్ము చేయకుండా తమ పరిధిలో పరిష్కారమైతే వెంటనే పరిష్కరించాలని, లేకుంటే పరిష్కారానికి మార్గం చూపాలని సూచించారు.

డిఆర్ డిఓ శ్రీనివాస్, డి.ఎస్.ఓ. తో కలిసి ప్రజల నుండి 48 ఆర్జీలను స్వీకరించారు. ఇందులో భూ సమస్యలు, పోడు భూములు, భూముల సర్వే, ధరణి వంటి రెవిన్యూ శాఖకు సంబంధించి 28, డబుల్ బెడ్ రూమ్ కు సంబందించి 4, ఉపాధి హామీ పథకానికి సంబంధించి 6 దరఖాస్తులు వ‌చ్చాయి.

మున్సిపాలిటీ, పంచాయతీ రాజ్, మహిళా శిశు సంక్షేమం, పింఛన్లు తదితర అంశాలకు సంబంధించి 10 దరఖాస్తులు రాగా సంబంధిత అధికారులను ఫిర్యాదుదారుల అర్జీలను పరిశీలించి సకాలంలో పరిష్కరించాల‌ని సూచించారు.

ప్రజావాణిలో వచ్చిన కొన్ని అర్జీలు ఇలా..
చండి గ్రామంలోని 328, 334, 339, 361, 373, 375 సర్వే నెంబర్లలో ఉన్న ప్రభుత్వ భూమిని కొందరు ఆక్రమించుకొని పనికి ఆహార పథ‌కం క్రింద వేసిన దారిని తొలగించారని, తద్వారా మా పంట పొలాలకు వెళ్లలేకపోవుచున్నామని చర్య తీసుకోవలసిందిగా ఆ గ్రామ వాసులు నాగులు, అనిల్ కుమార్, సుధాకర్ తదితరులు విజ్ఞప్తి చేశారు.

విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ నిమిత్తం ఆరుగురం వ్యక్తులం డిడిలు కట్టి సంవత్సరమైనా ట్రాన్స్ ఫార్మర్, విద్యుత్ స్తంభాలు వేయడం లేదని తగు చర్య తీసుకోవలసిందిగా రామాయంపేట వాసులు శంకర్ తదితరులు విజ్ఞప్తి చేశారు.

బాలానగర్ శివారులోని (15) హల్దీవాగు కరింగ్ ఖానాలను పైకి, క్రిందికి ఎత్తే విధంగా మరమ్మత్తులు చేపట్టాలని లేకుంటే బాలానగర్ శివారులోని 50 ఎకరాలు, జానకంపల్లి శివారు పొలాలు 70 ఎకరాలు నీట మునిగే ప్రమాద‌ముందని ఆ గ్రామస్థులు మన్నే సత్తయ్య, నర్సింహులు కోరారు. స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించాల‌ని ఈఈ నీటిపారుదల శాఖాధికారిని ఆదేశించారు.

సమాచార హక్కు చట్టం క్రింద 2018-2022 వరకు గ్రామంలో చేపట్టిన నూతన ఇండ్ల నిర్మాణం పర్మిషన్ ల వివరాలు ఇవ్వవలసినదిగా కోరినా గ్రామ పంచాయతీ సెక్రెటరీ ఇవ్వడం లేదని, తగు చర్య తీసుకోవలసిందిగా చిలిపిచేడ్ నుండి జయరాజ్ విజ్ఞప్తి చేశారు.

శివ్వంపేట మండలం చిన్న గొట్టిముక్కల లో ని సర్వే నెంబరు 16/1/21లో మా తండ్రి గారి పేర పట్టా ఉన్న ఒక ఎకరా భూమి పహానీలో లేదని సరిచేయవలసినదిగా అశోక్ అభ్యర్థించారు.

నరసాపూర్ మండలం నారాయణపూర్ గ్రామంలోని సర్వే నెంబరు 199 లో 7. 15 ఎకరాల భూమి ని సర్వే చేయగా ఫారెస్ట్ గెజిట్ లో ఉన్న‌ద‌ని దానిని తొలగించి అసలైన పట్టాదారులకు భూమి ఇవ్వవలసినదిగా ఆ గ్రామా గిరిజనులు విజ్ఞప్తి చేశారు.

కార్యక్రమంలో పశు సంవర్ధక శాఖాధికారి విజయ శేఖర్ రెడ్డి, జిల్లా మైనారిటీ అధికారి జెంలా నాయక్, మెప్మా పిడి ఇందిరా, నీటిపారుదల శాఖ ఈఈ శ్రీనివాస్ రావు, ఏడుపాయల ఈఓ సారా శ్రీనివాస్, కలెక్టరేట్ ఏ.ఓ. యూనుస్ తదితర అధికారులు పాల్గొన్నారు.

Updated On 19 Dec 2022 2:55 PM GMT
CH RAJITHA

CH RAJITHA

Next Story