విధాత, యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణ పూర్ మండలం రాచకొండ లోని మెట్ల బావి, ప్రాచీన శివాలయాన్ని పునరుద్ధరిస్తామని మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ పమేల సత్పతిలు గత డిసెంబర్ 20న చేసిన ప్రకటన మేరకు మరమ్మతు పనులు వేగంగా సాగుతున్నాయి.
గురువారం రాచకొండ గుట్టల్లోని మెట్ల బావి మరమ్మతుల పనులను ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పరిశీలించారు. 700 సంవత్సరాల క్రితం రాచకొండను రాజధానిగా నిర్మించుకొని పద్మనాయక రాజులు పరిపాలన సాగించిన కాలంలో అప్పట్లో ప్రజల సౌకర్యార్థం అనేక దేవాలయాలు, మెట్ల బావులు, కొలనులు ,చెరువులు నిర్మించారు.
శతాబ్దాలు గడుస్తుండడంతో అవన్ని శిథిలావస్థకు చేరుకున్నాయి. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం పురాతన ఆలయాలను, మెట్ల బావులను పునరుద్ధరణ చేపడుతున్న క్రమంలో రాచకొండ మెట్ల బావిని 30లక్షలతో మరమ్మతులు చేపట్టారు.
తుది దశకు చేరుకున్న మెట్ల బావి పునరుద్ధరణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి పక్కనే ఉన్న శివాలయం, లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయాన్ని కూడా సందర్శించారు. త్వరలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఆలయాల మరమ్మతులు చేపట్టి రాచకొండను మరింత అభివృద్ధి చేస్తామని ప్రకటించారు.