Rahul Gandhi దానికి వచ్చే అసెంబ్లీ ఎన్నికలే నిదర్శనం అమెరికా పర్యటనలో రాహుల్‌ వ్యాఖ్యలు మోదీ అజేయుడు కాదు.. దుర్బలుడు దేశ మీడియాలో నరేంద్ర మోదీ భజన విధాత: దేశంలో ప్రతిపక్ష పార్టీలు తిరుగులేని ఐక్యతతో ఉన్నాయని, క్షేత్రస్థాయిలో ఎంతో మంచి పని జరుగుతూ ఉన్నదని కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ చెప్పారు. 2024 ఎన్నికల ఫలితాలను ప్రజలను ఆశ్చర్యపర్చేలా ఉండబోతున్నాయని అన్నారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్‌గాంధీ.. గురువారం నేషనల్‌ ప్రెస్‌ క్లబ్‌లో జరిగిన ఇష్టాగోష్ఠిలో […]

Rahul Gandhi

  • దానికి వచ్చే అసెంబ్లీ ఎన్నికలే నిదర్శనం
  • అమెరికా పర్యటనలో రాహుల్‌ వ్యాఖ్యలు
  • మోదీ అజేయుడు కాదు.. దుర్బలుడు
  • దేశ మీడియాలో నరేంద్ర మోదీ భజన

విధాత: దేశంలో ప్రతిపక్ష పార్టీలు తిరుగులేని ఐక్యతతో ఉన్నాయని, క్షేత్రస్థాయిలో ఎంతో మంచి పని జరుగుతూ ఉన్నదని కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ చెప్పారు. 2024 ఎన్నికల ఫలితాలను ప్రజలను ఆశ్చర్యపర్చేలా ఉండబోతున్నాయని అన్నారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్‌గాంధీ.. గురువారం నేషనల్‌ ప్రెస్‌ క్లబ్‌లో జరిగిన ఇష్టాగోష్ఠిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు సంధించిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.

రానున్న రెండేళ్లలో కాంగ్రెస్‌ పార్టీ మరింతగా పుంజుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ‘పైకి కనిపించని ఒక ప్రభావం నిర్మితమవుతున్నది. అది ప్రజలను ఆశ్చర్యపరుస్తుంది’ అని ఆయన చెప్పారు. కర్ణాటకలో బీజేపీని అధికారం నుంచి తప్పించి.. కాంగ్రెస్‌ విజయం సాధించిన విషయాన్ని ప్రస్తావించిన రాహుల్‌గాంధీ.. ‘రానున్న మూడు లేదా నాలుగు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కోసం ఎదురు చూడండి.. ఏం జరుగబోతున్నదో తెలిపేందుకు వాటికి మించిన సంకేతాలు లేవు’ అని వ్యాఖ్యానించారు.

ఇప్పటికే ప్రతిపక్షం చక్కటి ఐక్యతతో ఉన్నదని, రానున్న రోజుల్లో ఇది మరింత బలపడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. అన్ని పార్టీలతో తాము సంప్రదిస్తున్నామని తెలిపారు. ఈ చర్చలు కొంచెం క్లిష్టమైనవేనని, ఇచ్చిపుచ్చుకునే ధోరణిలోనే సాగాల్సి ఉన్నదని చెప్పారు. అయితే, ఈ చర్చలు ఫలిస్తాయన్న విశ్వాసం తనకు ఉన్నదని అన్నారు.

ప్రపంచ స్థాయి ప్రజారంజక నేతల్లో నరేంద్రమోదీ అగ్రస్థానాల్లో ఉండటంపై ఒకరు ప్రశ్నించగా.. దేశంలో అన్ని వ్యవస్థలను, మీడియా సంస్థలను ఆక్రమించేశారన్న రాహుల్‌.. తాను విన్న ప్రతిదీ తాను విశ్వసించనని చెప్పారు. దేశ ఓటర్లలో 60 శాతం మంది బీజేపీకి, నరేంద్రమోదీకి ఓటు వేయలేదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని రాహుల్‌ అన్నారు.

బీజేపీని ఓడించగల స్థితిలో కాంగ్రెస్‌ ఉంటుందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. మోదీని జయించడం సాధ్యం కాదని మీరు మీడియాల్లో వింటుంటారన్న రాహుల్‌.. ఇదంతా అభూత కల్పన అని, లేని దాన్ని పెద్దగా చూపిస్తున్నారని పేర్కొన్నారు. వాస్తవానికి మోదీ దుర్బలుడని అభివర్ణించారు. దేశంలో పెద్ద ఎత్తున నిరుద్యోగిత ఉన్నదని, ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయని చెబుతూ.. ఈ సమస్యలు దేశంలో ప్రజలను పీడిస్తున్నాయని పేర్కొన్నారు.

Updated On 2 Jun 2023 2:55 PM GMT
CH RAJITHA

CH RAJITHA

Next Story