విధాత: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ క‌న్యాకుమారి నుంచి క‌శ్మీర్ దాకా చేప‌ట్టిన 4,080 కిలోమీట‌ర్ల భార‌త్ జోడో యాత్ర ముగిసింది. ప్రియాంకాగాంధీ, మ‌హ‌బూబా ముఫ్తీ త‌దిత‌ర నేత‌ల స‌మ‌క్షంలో క‌శ్మీర్‌లోని లాల్ చౌక్‌లో రాహుల్ గాంధీ త్రివ‌ర్ణ ప‌తాకాన్ని ఆవిష్క‌రించారు. దేశంలో ద‌క్షిన కొస‌నుంచి ఉత్త‌రాదిన ఉన్న క‌శ్మీర్ దాకా 134 రోజుల పాటు వివిధ రాష్ట్రాల్లోని 75 జిల్లాల గుండా ఈ యాత్ర గ‌త ఏడాది సెప్టెంబ‌ర్ 7న క‌న్యాకుమారిలో ప్రారంభ‌మై నేటితో (జ‌న‌వ‌రి […]

విధాత: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ క‌న్యాకుమారి నుంచి క‌శ్మీర్ దాకా చేప‌ట్టిన 4,080 కిలోమీట‌ర్ల భార‌త్ జోడో యాత్ర ముగిసింది. ప్రియాంకాగాంధీ, మ‌హ‌బూబా ముఫ్తీ త‌దిత‌ర నేత‌ల స‌మ‌క్షంలో క‌శ్మీర్‌లోని లాల్ చౌక్‌లో రాహుల్ గాంధీ త్రివ‌ర్ణ ప‌తాకాన్ని ఆవిష్క‌రించారు.

దేశంలో ద‌క్షిన కొస‌నుంచి ఉత్త‌రాదిన ఉన్న క‌శ్మీర్ దాకా 134 రోజుల పాటు వివిధ రాష్ట్రాల్లోని 75 జిల్లాల గుండా ఈ యాత్ర గ‌త ఏడాది సెప్టెంబ‌ర్ 7న క‌న్యాకుమారిలో ప్రారంభ‌మై నేటితో (జ‌న‌వ‌రి 29) ముగిసింది. భార‌త్ జోడో యాత్ర ముగింపు స‌మావేశంలో మాట్లాడుతూ.. ప్ర‌తిప‌క్షాల మ‌ధ్య ఎన్ని విభేదాలున్నా.. ఆర్ ఎస్ఎస్‌, బీజేపీల‌ను ఎదుర్కోవ‌టంలో క‌లిసి న‌డుస్తామ‌ని ప్ర‌క‌టించారు.

జోడో యాత్ర సంద‌ర్భంగా.. దేశ ప్ర‌జ‌ల ఆద‌రాభిమానాల‌ను ప్రేమ‌ను చ‌విచూశాన‌ని రాహుల్‌గాంధీ అన్నారు. దేశంలోని భిన్న వ‌ర్గాల ప్ర‌జ‌ల‌ను నేరుగా క‌లిసి మాట్లాడే అవ‌కాశం ద‌క్కింద‌నీ, వారి క‌ష్ట‌, సుఖాల‌ను ప్ర‌త్య‌క్షంగా చూశాన‌ని రాహుల్ తెలిపారు. ఆ క్ర‌మంలోనే ప్ర‌ధానంగా రైతులు, నిరుద్యోగుల ఆకాంక్ష‌ల‌ను, స‌మ‌స్య‌లు త‌న‌తో పంచుకున్నార‌ని చెబుతూ.. వారి స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం తాము పాటుప‌డ‌తామ‌ని ప్ర‌క‌టించారు.

జోడో ముగింపు సంద‌ర్భంగానే కేంద్రంలోని బీజేపీ స‌ర్కార్ వైఫ‌ల్యాల‌ను రాహుల్ గాంధీఎండ‌గ‌ట్టారు. నేటి పాల‌కుల‌కు దేశ ర‌క్ష‌ణ‌, స‌రిహ‌ద్దుల ప‌రిర‌క్ష‌ణ అనేది ప‌ట్ట‌కుండా పోయింద‌ని ఆయ‌న మోదీ ప్ర‌భుత్వాన్ని దుయ్య‌బ‌ట్టారు. చైనా స‌రిహ‌ద్దుల‌ను చెరిపేసి భార‌త భూ భాగాల‌ను ఆక్ర‌మించుకొన్నా మోదీ ప‌ట్టించుకోవ‌టం లేద‌ని విమ‌ర్శించారు.

ముగింపు స‌మావేశంలో మాట్లాడుతూ… తాను ఈ మ‌ధ్య‌నే కొంద‌రు మిలిట‌రీ అధికారుల‌నూ, ల‌డ‌క్ ప్రాంత వాసుల‌నూ క‌లిసిన‌ట్లు తెలిపారు. వారు చెప్పిన దాని ప్ర‌కారం.. సుమారు రెండు వేల కిలోమీట‌ర్ల మేర భార‌త భూ భాగంలోకి చైనా సేన‌లు చొచ్చుకు వ‌చ్చాయ‌నీ, అయినా మ‌న పాల‌కుల‌కు సోయి లేద‌ని మండిప‌డ్డారు. చైనా చొర‌బాట్ల విష‌యంలో మోదీకి ఎందుకంత భ‌యం అని నిల‌దీశారు. దేశ స‌రిహ‌ద్దుల‌ను కాపాడ‌లేని మోదీ అధికారం నుంచి దిగిపోవాల‌ని సూచించారు.

భార‌త్ జోడో యాత్ర ముగింపు సంకేతంగా.. రాహుల్ గాంధీ క‌శ్మీర్‌లోని లాల్ చౌక్‌లో త్రివ‌ర్ణ ప‌తాకాన్ని ఆవిష్క‌రించారు. స‌రిగ్గా 75 ఏండ్ల క్రితం భార‌త తొలి ప్ర‌ధానిగా రాహుల్ గాంధీ తాత పండిట్ జ‌వ‌హ‌ర్ లాల్ నెహ్రూ లాల్ చౌక్‌లో మొద‌టి సారి త్రివ‌ర్ణ ప‌తాకాన్ని ఎగుర‌వేయ‌టం గ‌మనార్హం.

నిజానికి లాల్ చౌక్‌లో త్రివ‌ర్ణ‌పాత‌క ఆవిష్క‌ర‌ణ అనేది కాంగ్రెస్ కార్య‌క్ర‌మంలో భాగంగా లేదు. ఎందుకంటే.. లాల్‌చౌక్‌లో జాతీయ జెండా ఎగుర‌వేయ‌టం బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఎజెండాగా కాంగ్రెస్ భావించింది. కానీ మారిన ప‌రిస్థితుల నేప‌థ్యంలో లాల్‌చౌక్‌లో ప‌తాక ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మానికి కాంగ్రెస్ పూనుకొన్న‌ది.

మొద‌టి సారి లాల్ చౌక్‌లో త్రివ‌ర్ణ ప‌తాకం నెహ్రూ ఆవిష్క‌రించిన నాడు క‌శ్మీర్‌కు స్వ‌యంప్ర‌తిప‌త్తి, రాజ్యాంగ ర‌క్ష‌ణ‌ల నేప‌థ్యంలో క‌శ్మీర్ జాతీయ నేత షేక్ అబ్దుల్లా స్నేహ హ‌స్తం అందించ‌టంతో జ‌రిగింది. ఇప్పుడు ఆ రాజ్యాంగ ర‌క్ష‌ణ‌ల‌న్నీ బీజేపీ ప్ర‌భుత్వం తుంగ‌లో తొక్కి, క‌శ్మీర్‌ను మిల‌ట‌రీ మ‌యం చేసిన‌ చీక‌టి పాల‌న‌లో రాహుల్ త్రివ‌ర్ణ ప‌తాకాన్ని ఆవిష్క‌రించార‌ని కాంగ్రెస్ వివ‌రించింది.

స‌మ‌కాలీన భార‌త చ‌రిత్ర‌లో సుదీర్ఘ పాద యాత్ర‌గా చెప్పుకొంటున్న భార‌త్ జోడో యాత్ర అనేక విధాలుగా విశిష్ట‌త‌లు క‌లిగింద‌ని రాజ‌కీయ ప‌రిశీల‌కులు అంటున్నారు. మున్నెన్న‌డూ లేని విధంగా కాంగ్రెస్ పార్టీ బ‌ల‌హీన ప‌డి దేశ వ్యాప్తంగా బీజేపీకి ప్ర‌త్యామ్నాయ శ‌క్తిగా ప్ర‌జ‌ల‌కు విశ్వాసాన్ని ఇవ్వ‌లేని స్థితిలో రాహుల్ ఈ యాత్ర‌కు శ్రీ‌కారం చుట్టాల్సి వ‌చ్చింద‌ని రాజ‌కీయ విశ్లేష‌కుల అభిప్రాయం.

ఏదేమైనా.. మోదీ వ్య‌తిరేక విప‌క్షాల్లో జ‌వ‌స‌త్వాలు నింప‌టంలో భార‌త్ జోడా యాత్ర స‌ఫ‌లీకృతం అయ్యింద‌ని కాంగ్రెస్ వ‌ర్గాలు అంటున్నాయి. రాహుల్ గాంధీ త్యాగం, సాహసంతో నిర్వ‌హించిన జోడో యాత్రతో కాంగ్రెస్‌కు పూర్వ‌వైభ‌వం వ‌స్తుంద‌ని కాంగ్రెస్ శ్రేణులు ఆకాంక్షిస్తున్నాయి.

భార‌త్ జోడో యాత్ర ముగింపు సంద‌ర్బంగానే.. జ‌న‌వ‌రి 30న క‌శ్మీర్‌లో విప‌క్షాల‌న్నింటి భాగ‌స్వామ్యంతో భారీ బ‌హిరంగ నిర్వ‌హిస్తున్నామ‌ని రాహుల్ గాంధీ ప్ర‌క‌టించారు. ఈ ముగింపు స‌మావేశంలో.. సుమారు 17 బీజేపీయేత‌ర విప‌క్షాలు పాల్గొంటుండ‌టం గ‌మ‌నార్హం.

Updated On 30 Jan 2023 4:05 AM GMT
krs

krs

Next Story