Rains | పిడుగుపాటుకు ముగ్గురి బలి నాలలో కొట్టుకపోయి బాలుడి మృతి హైద్రాబాద్‌ జలమయం శ్రీరాంసాగర్‌, కడెం, మూసీ ప్రాజెక్టుల గేట్ల ఎత్తివేత విధాత: తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండటంతో వరదలతో ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు పొంగిపొర్లుతున్నాయి. గోదావరి, మూసీ నదులు మరోసారి వరద ఉదృతితో పరవళ్లు తొక్కగా శ్రీరాంసాగర్‌, కడెం ప్రాజెక్టుల గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల కొనసాగిస్తున్నారు. కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, మెదక్‌, వరంగల్‌, గ్రేటర్‌ హైద్రామాద్‌ పరిధిలో భారీ వర్షాలు […]

Rains |

  • పిడుగుపాటుకు ముగ్గురి బలి
  • నాలలో కొట్టుకపోయి బాలుడి మృతి
  • హైద్రాబాద్‌ జలమయం
  • శ్రీరాంసాగర్‌, కడెం, మూసీ ప్రాజెక్టుల గేట్ల ఎత్తివేత

విధాత: తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండటంతో వరదలతో ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు పొంగిపొర్లుతున్నాయి. గోదావరి, మూసీ నదులు మరోసారి వరద ఉదృతితో పరవళ్లు తొక్కగా శ్రీరాంసాగర్‌, కడెం ప్రాజెక్టుల గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల కొనసాగిస్తున్నారు. కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, మెదక్‌, వరంగల్‌, గ్రేటర్‌ హైద్రామాద్‌ పరిధిలో భారీ వర్షాలు కురిశాయి.

అత్యధికంగా కామారెడ్డి జిల్లా గాంధారిలో 140మిల్లిమీటర్ల వర్షాపాతం నమోదైంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపురంలో 123మిల్లిమీటర్ల వర్షాపాతం నమోదైంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పిడుగులు పడడంతో ఒక రైతు, ఇద్దరు కూలీలు మృతి చెందారు. కాటారం మండలం దామెరకుంటలో రైతు రాజేశ్వర్ రావు, చిట్యాల మండల కైలాపూర్ వద్ద పిడుగుపాటుతో మహిళా కూలీలు చెలివేరు సరిత (30), నెరిపటి మమత (32) మిరప నాటు వేస్తూ పిడుగు పాటుకు గురై మృతి చెందారు.

వరంగల్ జిల్లాలో కురిసిన వర్షాలకు జిల్లాలోని మోరంచపల్లి వరదల్లో చిక్కుకొని నలుగురు మృతి చెందిన ఘటన మరువకముందే, పిడుగు పడి ముగ్గురు మృతి చెందండం విషాదం రేపింది. హైద్రాబాద్‌లో ప్రగతి నగర్ నాలాలో పడి బాలుడు మిథిన్‌(4) దుర్మరణం చెందాడు. నిజామాబాద్ జిల్లా పోచంపాడు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు భారీ వరద రావడంతో ఇన్ ఫ్లో 76000 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. 16 గేట్ల ద్వారా గోదావరిలోకి 64000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091.332 అడుగులకు గాను ప్రస్తుతం1091 అడుగులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 90.3 టీఎంసీలకు గాను 90 టీఎంసీలుగా ఉంది. కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు, జిల్లా వ్యాప్తంగా గత మూడు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా అన్ని వాగులు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో చెరువులన్నీ నిండుకుండలా మారాయి.

తాడ్వాయి మండలం సంతాయిపేట గ్రామ శివారులోని భీమేశ్వర వాగు గుడిపై నుంచి వాగు ఉదృతంగా ప్రవహించడంతో గుడి లోపలికి వరద నీరు చేరింది. అదేవిధంగా గాంధారి మండలంలోని పెద్దవాగు, పాల్వంచ వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. భారీ వర్షానికి బిక్కనూర్ టోల్ ప్లాజా వద్ద రెండు వైపులా భారీగా ట్రాఫిక్ జామైంది. తాడ్వాయి మండలం బ్రాహ్మణపల్లి గ్రామ శివారులోని వాగు నిన్నటి నుంచి ఉదృతంగా ప్రవహించడంతో ఐదు గ్రామాలైన టేక్రియాల్, చందాపూర్, సంగోజివాడి, కాలోజి వాడి, బ్రాహ్మణపల్లి గ్రామాలకు పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి.

గ్రేటర్‌ హైద్రాబాద్‌ పరిధిలో మంగళవారం కుండపోతగా భారీ వర్షాలు కురిశాయి. మియాపూర్ లో అత్యధికంగా 14.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వర్షాల ధాటికి ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడటంతో విద్యాసంస్థలకు మూడు రోజులు సెలవులు ప్రకటించారు. ఉస్మాన్‌ సాగర్‌, హిమాయత్‌ సాగర్‌ జలాశయాల గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల చేపట్టారు.

హుస్సెన్‌ సాగర్‌ నీటి మట్టం కూడా గరిష్ట స్థాయికి చేరింది. రాజేంద్రనగర్, అత్తాపూర్, కాటేదాన్, నార్సింగీ, మణికొండ, గండిపేట, బండ్లగూడ లో కుండపోత వర్షంతో ఉప్పర్ పల్లి 191 పిల్లర్‌ వద్ద ట్రాఫిక్‌ స్తంభించగా, శివరాంపల్లి 296 వద్ద చెరువు వద్ద రోడ్డు చెరువును తలపించింది. శివరాంపల్లి లో అధిక శాతం వర్షపాతం నమోదైంది. పలు కాలనీలు, రోడ్లు జలమయమయ్యాయి.

పలు చోట్ల విద్యుత్తుకు, ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. హైటక్‌ సిటీ, ఖైరాతాబాద్‌లలో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. నగరంలోని అనేక బస్తీల్లో వర్షం కారణంగా ఇళ్లలోనికి నీళ్లు చేరాయి. లింగంపల్లి అండర్ పాస్‌ వద్ద వరద మయం కావడంతో ట్రాఫిక్ జామైంది.

పలు ప్రాంతాల్లో నాలాలు పొంగి ప్రవహిస్తున్నాయి. భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితుల్లో జనం అప్రమత్తంగా ఉండాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్, జలమండలి ఎండీ, హైద్రాబాద్ కలెక్టర్లు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అత్యవసర సేవలకు జీహెచ్‌ఎంసీ కంట్రోల్ రూమ్ 21111111, 23225397 నంబర్లను సంప్రదించాలని, ప్రజలు అవసరమైతేనే బయటకు రావాలని సూచించారు.

మూసీ నది వరద ఉదృతి పెరిగి పోచంపల్లి, బీబీనగర్, బొల్లెపల్లి, సంగెం కాజ్‌వేల మీదుగా వరద పోటెత్తింది. దీంతో ఆ మార్గంలో కొన్ని గంటల పాటు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. మూసీ ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరిగి ప్రాజెక్టులోకి 1350క్యూసెక్కుల ఇన్ ఫ్లో చేరుతుంది. దీంతో 3,753క్యూసెక్కులను 5గేట్లను ఎత్తడం ద్వారా 3235క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వల ద్వారా 385క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు.

ప్రాజెక్టు 4.46టీఎంసీల నీటి మట్టంకుగాను 4.09అడుగులు, 645అడుగులకుగాను 643.60అడుగుల నీటీ నిల్వలున్నాయి. ప్రాజెక్టులోకి అంతకంతకు వరద ఉదృతి పెరుగుతుంది. కాగా ఉమ్మడి మహబూబ్ నగర్‌, ఉమ్మడి నల్లగొండ జిల్లాల పరిధిలోని కృష్ణా పరివాహకంలో మాత్రం వర్షాలు, వరదల కరవు కొనసాగుతుంది.

మరో ఐదు రోజులు భారీ వర్షాలు.. 8 జిల్లాల్లో ఎల్లో అలర్ట్‌

తెలంగాణలో మరో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు పడుతాయని హైద్రాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరిత ఆవర్తనంతో పాటు ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణితో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడుతాయని హైద్రాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.

హైద్రాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, జగిత్యాల, కామారెడ్డి, పెద్దపల్లి, వికారాబాద్‌, మహబూబ్‌నగర్‌, మెదక్ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతాయని, ఈ జిల్లాలో ఎల్లో అలర్ట్ జారీ చేశామని ప్రకటించింది. గ్రేటర్ పరిధిలో మరో 24గంటల పాటు భారీ వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ తెలిపింది.

Updated On 5 Sep 2023 2:51 PM GMT
krs

krs

Next Story