Thursday, March 23, 2023
More
    Homelatestఈటల అధ్యక్ష ఆశలకు.. రాములమ్మ చెక్‌! ఆమే చెప్పారా.. చెప్పించారా?

    ఈటల అధ్యక్ష ఆశలకు.. రాములమ్మ చెక్‌! ఆమే చెప్పారా.. చెప్పించారా?

    • బండి నాయకత్వంలోనే ఎన్నికలకు పోతామన్న విజయశాంతి

    EETALA RAJENDER VIJAYASANTHI BJP

    విధాత: బీజేపీ నాయకత్వం ఈటల రాజేందర్‌కు ఎసరు పెడుతున్నదా? అన్న సందేహాలు రాజకీయ పరిశీలకుల్లో వ్యక్తమవుతున్నాయి. కొద్ది కాలంగా ఈటలకు, రాష్ర్ట నాయకత్వానికి మధ్య విభేదాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ఈటల, బండి సంజయ్‌ మధ్య కోల్డ్‌ వార్‌ నడుస్తోందన్న ప్రచారం కూడా ఉన్నది.

    ఈ నేపథ్యంలో శుక్రవారం బీజేపీ రాష్ర్ట కార్యాలయంలో విజయశాంతి 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానం సందర్భంగా జరిగిన కార్యక్రమానికి ఈటల దూరంగా ఉండటం కొత్త చర్చకు దారి తీసింది. బీజేపీ నాయకత్వం ఈటలను ఈ కార్యక్రమానికి ఆహ్వానించలేదా? ఆహ్వానించినా ఆయన రాలేదా? అనేది సందేహం.

    తనకు ఆహ్వానం లేనప్పుడు రాష్ట్రంలో ఎక్కడ ఉన్నా ఈ విషయం వెలుగు చూస్తుందని, బయట ఏదో కార్యక్రమం పెట్టుకొని వెళ్లడమే మంచిదని భావించి ఈటల ప్రత్యేకంగా పని కల్పించుకొని ఢిల్లీకి వెళ్లినట్లు రాజకీయవర్గాలలో చర్చ జరుగుతున్నది.

    విరుద్ధంగా పరిణామాలు

    బీఆర్‌ ఎస్‌ నుంచి బయటకువచ్చి నిలబడి పోరాడి గెలిచిన నేతల్లో ఈటల మొదటివారు. తన రాజీనామా కారణంగా వచ్చిన ఉప ఎన్నికలో హుజూరాబాద్‌ నుంచి గెలిచి ఈటల సంచలనం సృష్టించారు. ఇది బీజేపీ జాతీయ నాయకత్వాన్ని ఆకర్షించింది. జాతీయ స్థాయిలో కాస్త గుర్తింపు రావడం స్థానిక రాష్ట్ర నాయకత్వానికి కంటగింపుగా మారిందన్న అభిప్రాయం రాజకీయ వర్గాలలో ఏర్పడింది.

    అయితే ఈటలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తారని, ఆయన నాయకత్వంలోనే అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికలకు బీజేపీ వెళుతుందన్న చర్చ సంక్రాంతికి ముందు బాగా జరిగింది. ఈటల కూడా తనకు బీజేపీ రాష్ట్ర పగ్గాలు అప్పగిస్తారని ఆశించినట్లు తెలుస్తోంది. కానీ జరుగుతున్న పరిణామాలు ఇందుకు విరుద్ధంగా ఉన్నాయి. శుక్రవారం నాటి కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ తరుణ్‌చుగ్‌, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండిసంజయ్‌ సమక్షంలో విజయశాంతి చేసిన ప్రకటన కొత్త చర్చకు దారి తీసింది.

    ఒక నాటి మిత్రులే మరి!

    విజయశాంతి తెలంగాణ ఉద్యమ సమయంలో ఈటల రాజేందర్‌తో కలిసి ఆనాటి టీఆర్‌ఎస్‌లో పని చేశారు. ఈటల రాజేందర్‌పై ఆనాటి టీఆర్‌ఎస్‌ వర్గాలలో సాఫ్ట్‌ కార్నర్‌ ఉన్నది. విజయశాంతి, ఈటల మంచి మిత్రులుగా టీఆర్‌ఎస్‌లో ఉన్నారు. రాజకీయాలలో ఎప్పుడు ఏమి జరుగుతుందో చెప్పలేమన్నట్లుగా ఉంది ప్రస్తుత పరిస్థితి.

    గత కొంత కాలంగా బీజేపీలో వర్గ పోరు నడుస్తోందన్న అభిప్రాయం సర్వత్రా వెలువడుతున్నది. మొదటి నుంచి ఆర్‌ఎస్‌ ఎస్‌, బీజేపీలో ఉన్నవారికి, ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరిన వారికి మధ్య పొసగడం లేదన్న చర్చ జరుగుతున్నది.

    దీంతో కావాలనే ఈటల రాజేందర్‌కు మంచి మిత్రుత్వం ఉన్న విజయశాంతి చేత బండి నాయకత్వంలోనే ఎన్నికలకు వెళతామన్న ప్రకటన చేయించారన్నచర్చ జరుగుతున్నది. ఇది ఇంత వరకే పరిమితమా? లేక ఈటలను పార్టీ నుంచి వెళ్లగొట్టే కుట్ర కూడా జరుగుతున్నదా? అనే సందేహాలు రాజకీయ వర్గాలలో వ్యక్తమవుతున్నాయి.

    RELATED ARTICLES

    Latest News

    Cinema

    Politics

    Most Popular