రేవంత్ రెడ్డి, బండి సంజయ్‌లపై మండిపాటు మీది సంసారం, మాది వ్యభిచారమా మోడీ.. వేట కుక్కల దాడి భూపాల్ పల్లి బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ ఆగ్రహం తెలంగాణ రాష్ట్రానికి ఇద్దరు పిచ్చోళ్ళు మోపయ్యారని అందులో ఒకడు రేవంత్ రెడ్డి, ఇంకొకడు బండి సంజయ్ అంటూ రాష్ట్ర మున్సిపల్ అండ్ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తీవ్రంగా విరుచుక పడ్డారు. ఒకరేమో ప్రగతిభవన్ పేల్చేయాలంటాడు.. ఇంకొకడేమో సెక్రటేరియట్ కూలుస్తామంటాడు.. ఈ పిచ్చోళ్ళ చేతిలో రెండు పార్టీలు చేరాయని […]

  • రేవంత్ రెడ్డి, బండి సంజయ్‌లపై మండిపాటు
  • మీది సంసారం, మాది వ్యభిచారమా
  • మోడీ.. వేట కుక్కల దాడి
  • భూపాల్ పల్లి బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ ఆగ్రహం

తెలంగాణ రాష్ట్రానికి ఇద్దరు పిచ్చోళ్ళు మోపయ్యారని అందులో ఒకడు రేవంత్ రెడ్డి, ఇంకొకడు బండి సంజయ్ అంటూ రాష్ట్ర మున్సిపల్ అండ్ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తీవ్రంగా విరుచుక పడ్డారు. ఒకరేమో ప్రగతిభవన్ పేల్చేయాలంటాడు.. ఇంకొకడేమో సెక్రటేరియట్ కూలుస్తామంటాడు.. ఈ పిచ్చోళ్ళ చేతిలో రెండు పార్టీలు చేరాయని ఎద్దేవా చేశారు. కేసీఆర్ లేకుంటే, తెలంగాణ రాష్ట్రం లేకుంటే గంజిలో ఈగ లెక్క ఒకరు కార్పొరేటర్‌గా ఒకరేదో రంగులేసుకునేటోనిగా వీరు బతకాల్సి వచ్చేదని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో రాష్ట్ర అధ్యక్షులుగా ఓ దుకాణం పెట్టుకుని, ఇష్టం ఉన్నట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పై మంత్రి కేటీఆర్ ఒంటికాలు పై లేచారు. కేటీఆర్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి పిచ్చి కుక్కలా మొరుగుతున్నారని విమర్శించారు. నిన్న ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడట, ఒక్క ఛాన్స్ అడుక్కుంటండూ… 75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో 50 ఏళ్లు కాంగ్రెస్ పార్టీయే పాలించిందని, పదిసార్లు అవకాశం ఇచ్చారని గుర్తు చేశారు.

అప్పుడు ఏం చేయలేని వారు, ఇప్పుడు ఏదో చేస్తామంటూ మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీకెందుకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలి… వెళ్లిపోయే కరెంటు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు, ఎప్పుడు ఏ రైతు చచ్చిపోతాడో తెలియని పరిస్థితులలో ఆ రోజులు మళ్లీ వచ్చేందుకు మీకు అవకాశం కల్పించాలా అంటూ ప్రశ్నించారు.

దిక్కుమాలిన, అన్యాయమైన ఆ పాలన కావాలా అంటూ ప్రజలను అడిగారు. కనీసం తాగునీరు లేని రోజులు వెళ్ళదీసిన సందర్భాలు యాదికి లేవా? అంటూ మాట్లాడారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ఈ జిల్లాలో ఉందని, నిర్మించిన ఘనత కేసీఆర్ దని గుర్తు చేశారు. అప్పుడేం పీకలేనోళ్లు ఇప్పుడు ఏదో చేస్తామంటూ చెబుతున్నారని.. అప్పుడు కాంగ్రెస్ పార్టీ సోయి ఏమైందని ప్రశ్నించారు.

భూపాల్ పల్లి జిల్లా కేంద్రంలో గురువారం సుమారు రూ.297 కోట్లకు పైగా నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులు ప్రారంభించారు. అనంతరం అంబేద్కర్ స్టేడియంలో స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అధ్యక్షతన జరిగిన భారీ బహిరంగ సభలో కేటీఆర్ ప్రసంగించారు ఈ సందర్భంగా కేటీఆర్ ఓ పిట్ట కథ చెప్పారు

అవును వారిని విలీనం చేసుకున్నాం

అవును రేవంత్ రెడ్డి అన్నట్లు కాంగ్రెస్ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలను టిఆర్ఎస్‌లో విలీనం చేసుకున్నామని కేటీఆర్ చెప్పారు. అయితే తాము రాజ్యాంగబద్ధంగానే 2/3 మెజారిటీతో కలుపుకున్నామని ఇందులో తప్పేముంది అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ రాజస్థాన్‌లో చేస్తే సంసారం మేము తెలంగాణలో చేస్తే వ్యభిచారమా అంటూ నిలదీశారు.

బరాబర్ మాది కుటుంబ పాలన

బరాబర్ మాది కుటుంబ పాలన. ముమ్మాటికి కుటుంబ పాలనే. నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలు కేసిఆర్ కుటుంబమే అంటూ కేటీఆర్ సమర్ధించుకునే ప్రయత్నం చేశారు. తెలంగాణలో 65 లక్షల మందికి రైతుబంధు, వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, నేత, గీత, బీడీ కార్మికులకు ఆసరా పెన్షన్లు, ఇంటింటికి నల్లా నీరు, 12 లక్షల మందికి కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్, 90 శాతం ఉద్యోగాలలో స్థానికులకు రిజర్వేషన్, రెండు లక్షల 26 వేల ఉద్యోగాల భర్తీ, 14 లక్షల మందికి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం, గొల్ల కురుమలకు రూ. 12,000 కోట్ల నిధులతో గొర్రెల పంపిణీ చేసిన కేసీఆర్‌ది కుటుంబ పాలనే అన్నారు.

ముదిరాజ్, గంగపుత్రుల మత్స్య‌సంప‌ద పెంపు కోసం, ఉచిత చేపల పంపిణీ, నాయి బ్రాహ్మణ, రజకులకు ఉచిత కరెంటు ఇచ్చారని, ఏ కులం ఏ వర్గం అనేది లేకుండా అందరి సంక్షేమానికి పాటుపడిన కేసీఆర్ పాలన కుటుంబ పాలనే అన్నారు. రాష్ట్రంలో 978 గురుకుల పాఠశాలలో 700 కోట్ల రూపాయలతో ఐదున్నర లక్షల మంది పేద విద్యార్థులకు విద్యనందిస్తున్న మాది కుటుంబ పాలనే. దేశంలో ఎక్కడైనా ఈ సంక్షేమ అభివృద్ధి పథకాల అమలవుతున్నాయా అంటూ ప్రశ్నించారు.

మోడీ వేట కుక్కల దాడి

తమకు గిట్టని వారిపై ప్రధాని మోడీ దాడికి పాల్పడుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు. ఒక్కొక్కరికి 15 లక్షలు ఖాతాల్లో వేస్తామని చెప్పి తప్పించుకుంది ఎవరని ప్రశ్నించారు. రాష్ట్రానికి మెడికల్ కాలేజీలు, నవోదయ విద్యాలయాలు, కేంద్ర ప్రభుత్వ నిధులు రాకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కుకర్మాగార నిర్మాణం జాడ లేకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక మన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కరోనా మందు మోడీయే కనిపెట్టాడని చెబుతున్నాడని హేళన చేశారు.

మోడీ ఎవరికి దేవుడు

మోడీని బండి సంజయ్ దేవుడన్నా… దేవుడు అంటూ పొగుడుతున్నారని.. ఎవరికి దేవుడు అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. 70 రూపాయల పెట్రోల్ 110 రూపాయలు పెంచినందుకా? 410 గ్యాస్ సిలిండర్ రూ.1200 పెంచినందుకా? ఢిల్లీలో 700 మంది రైతుల ఉసురు తీసినందుకా? ద్రవ్యోల్బనం తగ్గించినందుకా? నిరుద్యోగం పెంచినందుకా? రూపాయిని పాతాళంలోకి నెట్టి అప్పులను ఆకాశంలోకి తెచ్చిన అసమర్ధ ప్రధాని, దేశాన్ని అధోగతి పాలు చేసిన మోడీ, ఆదాయమంతా అయినోడు అదానికి కట్టబెట్టినోడు.. ఎవరికి దేవుడు అంటూ తీవ్రంగా నిలదీశారు.

పైగా రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ఆపాడంటూ కీర్తిస్తున్నారని, మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దు సమస్యను పరిష్కరించలేని మోడీ సమస్యను పరిష్కరించారంటూ కొనియాడుతున్నారని విమర్శించారు. సింగరేణి ప్రైవేటీరించే సవాలే లేదని, ఆరు నూరైనా మన ప్రభుత్వం అడ్డుకొని తీరుతుందని కేటీఆర్ హామీ ఇచ్చారు.

సభలో మంత్రులు సత్యవతి రాథోడ్ ఎర్రబెల్లి దయాకర్ రావు, జగదీశ్ రెడ్డి, మాజీ స్పీకర్ ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనా చారి, మండలి డిప్యూటీ వైస్ చైర్మన్ బండ ప్రకాష్, ఎంపీ దయాకర్, పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. సభ భారీ స్థాయిలో నిర్వహించారు.

Updated On 24 Feb 2023 2:03 AM GMT
CH RAJITHA

CH RAJITHA

Next Story