Tuesday, January 31, 2023
More
  Homelatest‘క్లాసిక్స్‌’: RatCatcher మూవీ రివ్యూ.. ఒక అంతర్మథ‌నం

  ‘క్లాసిక్స్‌’: RatCatcher మూవీ రివ్యూ.. ఒక అంతర్మథ‌నం

  విధాత‌: సినిమా అనేది భావవ్యక్తీకరణ మాధ్యమం అయితే దాన్ని స్పష్టంగా సూటిగా వ్యక్తీకరించగలిగిన దర్శకులు కొందరే. ఆ కోవకే చేందుతుంది లైన్ రాంసే. జేమ్స్ నీళ్ళ కొలను దగ్గర ఆడుతూ ఉంటాడు. కిటీకీ లోంచి రయాన్ చూస్తాడూ. తనకీ స్నేహితుడితో ఆడుకోవాలని అనిపిస్తుంది.

  కానీ తల్లి మాత్రం జైల్లో ఉన్న తండ్రిని చూడటానికి బయలుదేరమంటుంది. వెంట నడిచినట్టే నడిచి తల్లిని ఏమార్చి స్నేహితుడిని చేరుకుంటాడు రయాన్. అక్కడ జేమ్స్.. రయాన్ని నీళ్లలోకి తోయగా రయాన్ జేమ్స్ మొహాన బురద కొడతాడు. అలా సరదాగా మొదలైన గొడవ కొంచం తీవ్రమవుతుంది. రయాన్ని ఆ కాలువ లోతుల్లోకి బలంగా ఒక్క తోపుతోసి పరుగు తీస్తాడు జేమ్స్, కొద్ది దూరం పరిగెత్తి వెనక్కి తిరిగి చూస్తాడు. ఆ సంఘటన మొదలు జేమ్స్ మనసులో అదే ఆలోచన… తప్పు చేసిన ఫీలింగ్.

  1970 కథా కాలంలో గ్లాస్గోలోని ఒక మురికి వాడల నేపథ్యంలో తీసిన సినిమా. అక్కడన్నీ పాతబడిన అపార్ట్మెంట్లు.. వాటి చుట్టూ శుభ్రం చేసే దిక్కులేక పేరుకుపోయిన చెత్త సంచులు. వాటిల్లో తిరుగాడే ఎలకలు. చదువు సంధ్యా లేక అల్లరి చిల్లర గా తిరిగే పిల్లలు.

  జేమ్స్ కి తల్లీ, తండ్రి, ఓ అక్కా ఓ చెల్లీ ఉంటారు. వీళ్లంతా పాతబడిన అపార్ట్మెంట్లలో ఉంటారు. ఈ సంసారం భార్యాభర్తలు, పిల్లల మధ్య సంబంధ బాంధవ్యాలు ఒకవైపు చూపిస్తూనే మరోవైపు చుట్టూ ఉండే వివిధ వయసుల పిల్లల మనస్తత్వాలు, ప్రీ టీన్ ఏజ్ లో ఉండే సహజ ప్రవర్తనలూ, సహజాత ప్రోద్బలాల‌ ప్రభావాలు చూపించారు. మొత్తం నేపథ్యంలో జేమ్స్ ఇంట్రావర్ట్ మనస్థత్వం చక్కగా సహజంగా ఆవిష్కరించబడింది.

  ప్రభుత్వం ఈ అపార్ట్మెంట్లకి దూరంగా కొత్త అపార్ట్మెంట్లు కట్టిస్తుంటుంది. ఖాళీగా ఉండి కొత్తగా ఉన్న కొత్త ఇళ్ళు జేమ్స్ కి బాగా నచ్చుతాయి. వంట గది కిటికీలోంచి కనుచూపు మేరా పరచుకున్న గోధుమ చేలలోకి దూకి రివ్వున కొట్టే గాలిని, ఆకాశాన్నీ అనుభవిస్తాడు.

  అక్కడ అన్నీ మరిచిపోయి హాయిగా గంతులేస్తాడు. జేమ్స్ కి ‘ అన్నే’ అనే టీనేజ్ అమ్మాయితో స్నేహం కుదురుతుంది. ఆ పిల్ల లోకల్ టీన్ గ్యాంగ్‌తో అబ్యూజ్‌కి గురవుతూ ఉంటుంది. జేమ్స్ ఆ మూక లాగ కాకుండా సున్నితుడుగా ఉండటం వల్ల ఆమెకు అతడితో స్నేహం బావుంటుంది.

  అయితే అతను ఎంత వద్దనుకున్నా కొన్ని సంఘటనలు తను గతంలో చేసిన ‘ఆ పొరపాటు ‘ వైపు లాగుతుంటాయి. పశ్చాత్తాపం ప్రకటించే వీలు లేదు. ఎవ్వరికీ చెప్పుకునేందుకులేదు. లోలో ఆలోచిస్తూ.. ఈ లోపు జేమ్స్ కుటుంబానికి ఒక కొత్త అపార్ట్మెంట్ కేటాయిస్తారు. వాళ్ళంతా తలా ఓ సామాను తీసుకొని గోధుమ చేల మీదుగా కొత్త ఇల్లు వైపు నడుస్తుంటారు. చివరగా జేమ్స్ కుర్చీ పట్టుకొని కొత్తింటి వైపు నడుస్తూ ఉంటాడు.

  పిల్లల లోకం వేరు. వాళ్ళ భావనలూ.. బాధలూ భయాలూ ఆలోచనలూ చేసే చేష్టలూ వేరు. వాళ్ళ మనస్తత్వం ఒకలా ఉంటుంది. ఇంట్లో వాతావరణం మరోలా ఉంటుంది. పెద్దలంతా తమ తమ పనుల్లో బిజీగా ఉంటారు. పట్టించుకునే నాథుడుండడు. వాళ్ళేదో చేస్తారు, అది తప్పో ఒప్పో మంచో చెడో వాళ్లకే తెలియదు. చెప్పుకునే దిక్కుండదు.

  లోలోపల మధన పడుతూ.. వాళ్ళేం చేస్తారో వాళ్లకే తెలీదు. !! కొన్ని సినిమాలకి కథలుండవు.. ఓ సంఘటన తద్వారా మనసులో జరిగే ఘర్షణా ఆలోచనలూ మానసిక స్థితిగతులే ఉంటాయ్. అవి ఒక అబ్స్ట్రా క్ట్ కవిత మల్లే అర్థం అయ్యీ కానట్టు ఉంటాయి. కానీ మనసుకు హత్తుకుపోతాయి.

  పిల్లలుగా నటించినవాళ్ళూ ..పెద్దలుగా నటించినవాళ్ళూ అతి సహజనటన కనపరిచారు. ముఖ్యంగా జేమ్స్ పాత్ర. టైం అండ్ స్పేస్ చక్కగా కుదిరాయి. రాచల్ పోర్ట్మన్ సంగీతం ఎప్పటిలాగే ఆకట్టుకుంటుంది. నాకైతే బాగా నచ్చింది. మీకూనచ్చుతుందనే అనుకుంటున్నాను.

  – భవాని

  RELATED ARTICLES

  Latest News

  Cinema

  Politics

  Most Popular