మార్గ‌ద‌ర్శ‌కాల జారీకి జాప్యం చేస్తున్న ప్ర‌భుత్వం రేష‌న్ దుకాణాల చుట్టూ ప్ర‌ద‌క్షిణ‌లు చేస్తున్న ల‌బ్ధిదారులు పండుగ వేళ అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్న పేద‌లు విధాత: రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రతినెలా పేదలకు పంపిణీ కావాల్సిన రేషన్ బియ్యం సరఫరాకు ప్రభుత్వం మార్గదర్శకాల జారీలో చేస్తున్న జాప్యంతో జనవరి నెల రేషన్ బియ్యం కోసం ల‌బ్ధిదారులు ఎదురు చూడాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. అసలే సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రభుత్వం పండుగ కానుకగా అదనపు కోటా […]

  • మార్గ‌ద‌ర్శ‌కాల జారీకి జాప్యం చేస్తున్న ప్ర‌భుత్వం
  • రేష‌న్ దుకాణాల చుట్టూ ప్ర‌ద‌క్షిణ‌లు చేస్తున్న ల‌బ్ధిదారులు
  • పండుగ వేళ అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్న పేద‌లు

విధాత: రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రతినెలా పేదలకు పంపిణీ కావాల్సిన రేషన్ బియ్యం సరఫరాకు ప్రభుత్వం మార్గదర్శకాల జారీలో చేస్తున్న జాప్యంతో జనవరి నెల రేషన్ బియ్యం కోసం ల‌బ్ధిదారులు ఎదురు చూడాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది.

అసలే సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రభుత్వం పండుగ కానుకగా అదనపు కోటా బియ్యం, ఇతర సరుకులను అందించాల్సింది పోయి.. నెల నెలా ఇవ్వాల్సిన బియ్యాన్ని సైతం సకాలంలో పంపిణీ చేయకపోవడం పట్ల లబ్ధిదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ప్రతినెల 1వ తేదీ నుండి 15వ తేదీ లోగా పంపిణీ కావలసిన రేషన్ బియ్యం పది రోజులు కావస్తున్నా పంపిణీ చేపట్టకపోవడంతో నిత్యం రేషన్ దుకాణాల చుట్టూ లబ్ధిదారులు ప్రదక్షిణలు చేస్తున్న పరిస్థితి కొనసాగుతుంది. కేంద్రం కరోనా నేపథ్యంలో పేదలకు అందిస్తున్న ఐదు కిలోల ఉచిత బియ్యానికి తోడు రాష్ట్ర ప్రభుత్వం ఆరు కిలోల బియ్యం అందించాల్సి ఉంది.

కొన్ని నెలలుగా కేంద్ర, రాష్ట్ర బియ్యం కలిపి ఒక్కో లబ్ధిదారుడికి 10 కిలోలు పంపిణీ చేస్తుంది. తాజాగా కేంద్రం ఉచితంగా ఇస్తున్న 5 కిలోల బియ్యాన్ని మరో ఎడాది పొడిగించింది. రాష్ట్రం మాత్రం మొత్తంగా ఒక్కో లబ్ధిదారుడికి 5 కిలోలు ఇవ్వాలని తొలుత ఆదేశాలు ఇచ్చినప్పటికీ కేంద్రం ఇచ్చే 5 కిలోలనే తాము ఇస్తున్నట్లుగా ప్రజలు అర్థం చేసుకుంటారని గ్రహించిన రాష్ట్ర ప్రభుత్వం గతంలో మాదిరిగా రాష్ట్రం నుండి ఐదు కిలోలు లేక 6 కిలోలు కలిపి ఇవ్వాలని భావించింది.

రాష్ట్ర వాటా రేషన్ బియ్యం విషయంపై ప్రభుత్వం అధికారికంగా నిర్ణయం తీసుకోవడంలో పది రోజులుగా తాత్సార్యం చేస్తుండటం రేషన్ బియ్యం కోసం ఎదురుచూస్తున్న పేదలకు ఇబ్బందికరంగా మారింది. ప్రభుత్వం నుండి రేషన్ బియ్యం పంపిణీపై స్పష్టమైన ఆదేశాలు లేకపోవడంతో రేషన్ డీలర్లు దుకాణాలు తెరవడం లేదు. దీంతో బియ్యం కోసం పేదలు నిత్యం రేషన్ దుకాణాల చుట్టూ తిరుగుతున్నారు.

ఉమ్మడి నల్గొండ జిల్లాలో 7లక్షల 89వేల కార్డుదారులకు సంబంధించి 25 లక్షల 49 వేల మందికి ప్రతినెల 23,021 టన్నుల బియ్యం సరఫరా కావాల్సి ఉంది. ప్రస్తుత నల్గొండ జిల్లాలోనే 991 రేషన్ దుకాణాల ద్వారా 4470 మెట్రిక్ టన్నుల బియ్యం నెలవారీగా పేదలకు అందించాల్సి ఉంది.

లబ్ధిదారులు ఈ నెల బియ్యం కోసం పది రోజుల నుండి నిత్యం రేషన్ దుకాణాలు చుట్టూ తిరుగుతున్నారు. అధికారులు మాత్రం తమకు ప్రభుత్వం నుండి గైడ్లైన్స్ వస్తేనే బియ్యం పంపిణీకి సంబంధించి రేషన్ డీలర్లను పంపిణీకి ఆదేశించగలమని చెబుతున్నారు. ప్రస్తుతానికి దుకాణాలకు బియ్యం నిల్వలు చేరుకున్నాయని గైడ్లైన్స్ అందిన వెంటనే పంపిణీకి చర్యలు చేపడతామన్నారు.

Updated On 9 Jan 2023 11:12 AM GMT
krs

krs

Next Story