Rupert Murdoch ।
- మీడియా రారాజు మర్దోక్ ఎంగేజ్‌మెంట్
- 66 ఏళ్ల యాన్ లెస్లీ స్మిత్‌తో వేసవిలో పెళ్లి
కల్యాణం ఎప్పుడూ కమనీయమే! పడుచోడికైనా.. ముసలోడికైనా! అందుకే ఆ 92 ఏళ్ల వ్యక్తి ఐదో పెళ్లికి సిద్ధపడ్డాడు! ప్రామిస్.. ఇదే నాకు ఆఖరి పెళ్లి అంటున్నది మరెవరో కాదు.. మీడియా రారాజుగా చెప్పే రుపర్ట్ మర్దోక్.. యాన్ లెస్లీ స్మిత్ అనే 66 ఏళ్ల మహిళతో ఎంగేజ్‌మెంట్ కూడా చేసుకున్నాడు మర్దోక్!
విధాత: శతకోటీశ్వరుడు, మీడియా మొఘల్ రూపర్ట్ మర్దోక్ (Rupert Murdoch) ఐదోసారి పెళ్లికి సిద్ధపడ్డారు. అదీ 92 ఏళ్ల వయసులో. ఈ విషయాన్ని ఆయన సొంత టాబ్లాయిడ్ న్యూస్‌పేపర్ న్యూయార్క్ పోస్ట్ (New York Post) ద్వారా ప్రకటించారు.
యాన్ లెస్లీ స్మిత్ అనే మహిళను ఆయన వివాహం చేసుకోనున్నారు. ‘చాలా ఉద్వేగంగా ఉన్నది. ప్రేమలో పడటం అంటే భయమేసింది.. కానీ.. నాకు తెలుసు. ఇదే ఆఖరిసారని. అదే ఉత్తమం. నాకు చాలా సంతోషంగా ఉన్నది’ అని ఆయన న్యూయార్క్ పోస్ట్‌కు చెప్పారు.
అమెరికాలో ఫాక్స్ న్యూస్ (Fox News), బ్రిటన్‌లో టాబ్లాయిడ్ సన్ (Sun) ఇతనివే. అంతేకాదు.. న్యూయార్క్ పోస్ట్, వాల్‌స్ట్రీట్ జర్నల్ (Wall Street Journal) అధిపతి కూడా ఈయనే. ఈ వేసవిలో పెళ్లి చేసుకునేందుకు మర్దోక్, స్మిత్ ప్లాన్ చేసుకుంటున్నారు.
జీవితంలో రెండో భాగాన్ని కలిసి బతకాలని అనుకుంటున్నామని చెబుతున్నారీ కొత్త జంట. కాలిఫోర్నియా (California)లోని బెల్ ఎయిర్‌లో ఉన్న తన మోరగా వైన్‌యార్డ్‌లో గత ఏడాది సెప్టెంబర్‌లో నిర్వహించిన ఒక పార్టీలో వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది. ‘ఆ పార్టీలో ఆమె కలిసింది. కాసేపు మాట్లాడుకున్నాం. రెండు వారాల తర్వాత ఆమె నాకు ఫోన్ చేసింది’ అని మర్దోక్ తెలిపారు.
మర్దోక్‌కు ఇప్పటికి నాలుగు సార్లు పెళ్లి అయింది. అందులో ముగ్గురు భార్యల ద్వారా ఆరుగురు సంతానం కలిగారు. అందులో ఇద్దరు కుమార్తెలు. మర్దోక్ నాలుగో భార్య మాజీ సూపర్ మోడల్ జెర్రీ హాల్. వాళ్లిద్దరూ 2022లో విడిపోయారు. స్మిత్‌కు కూడా గతంలో రెండు సార్లు వివాహం జరిగింది. స్మిత్ భర్త 14 ఏళ్ల క్రితం చనిపోయారు. ఆమె భర్త కూడా మీడియా రంగంలోనే ఉండేవారు. రేడియో, టీవీ చానళ్లు కూడా నెలకొల్పారు.