విధాత, వరంగల్: వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో దేశీ రకం కొత్త మిర్చికి రికార్డు ధర పలికింది. శుక్రవారం మార్కెట్లో దేశీ రకం కొత్త మిర్చి క్వింటాల్‌కు రూ.80,100 ధర లభించింది. ఖమ్మం జిల్లాకు చెందిన ఓ రైతు నాలుగు బస్తాలు కొత్త దేశీ రకం మిర్చి తీసుకొస్తే క్వింటాలుకు రూ.80,100 ధర పలికింది.
సహజంగా దేశీ రకానికి విపరీతమైన డిమాండ్, ధర ఉంటుంది. ఈ దఫా గతంకంటే ఎక్కువ ధర చెల్లించి వ్యాపారి కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా మార్కెట్ కార్యదర్శి రాహుల్ మాట్లాడుతూ మార్కెట్ చరిత్రలో ఇప్పటివరకు కొత్త మిర్చికి ఈ ధర పలకలేదనీ అన్నారు.
ఇదిలా ఉండగా రైతులు ఇప్పటివరకు మిర్చీని మార్కెట్ కు తక్కువ మోతాదులో తీసుకొస్తున్నారని చెప్పారు. ఆరబెట్టిన మిర్చిని మాత్రమే అమ్మకానికి తీసుకొని రావాలని కోరారు. తేమ శాతం తక్కువ ఉన్న మిర్చిని రైతులు తీసుకొస్తే అధిక ధర లభిస్తుందని కార్యదర్శి తెలిపారు.