- సీల్డ్ కవర్లో పంపిన ప్రొఫెసర్ల కమిటీ
- ఈ నివేదిక ఎంసీఏకి పంపించారు
- డాక్టర్ సైఫ్ సస్పెన్షన్‌కు సన్నాహం
- సమ్మె యోచన విరమించిన పీజీ మెడికోలు
- సీపీతో విషయాలు చెప్పేందుకు హామీ
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: వరంగల్(WARANGAL) కాకతీయ మెడికల్ కాలేజ్ (KMC) పీజీ మెడికో ధరావత్ ప్రీతి ఆత్మహత్యాయత్న సంఘటనపై నలుగురు ప్రొఫెసర్లతో ఏర్పాటు చేసిన విచారణ కమిటీ (Enquiry comitee) తమ నివేదికను డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ (DME)కి సీల్డ్ కవర్లో అందజేసింది. సీల్డ్ కవర్లో ప్రొఫెసర్ల కమిటీ విచారణ నివేదికను పంపించారు. ఎంజీఎం వర్గాలు వెల్లడించిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.
ఈ విచారణ కమిటీ అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్లో కాలేజీలో, ఎంజీఎం హాస్పిటల్‌లో ఏం జరిగిందో విచారించి తమ నివేదికను రూపొందించింది. ఈ నివేదికను రహస్యంగా పెట్టి డీఎమ్ఈకి పంపించారు. ఈ నివేదికపై ఆధారపడి కాలేజీ యంత్రాంగం తదుపరి చర్యలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి. ఈ సీల్డ్ కవర్ నివేదికకు ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ కవరింగ్ లెటర్ జత చేసి పంపించినట్లు చెబుతున్నారు. ఆ నివేదికలోని వివరాలు నలుగురు ప్రొఫెసర్లకు తప్ప ఇతరులకు తెలిసే అవకాశాలు లేవు. ఇదే నివేదికను మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(MCI) కు సైతం పంపించారు.
సీనియర్ పీజీ విద్యార్థి సైఫ్‌ను సస్పెండ్‌కు సన్నాహం
తన జూనియర్ పీజీ వైద్య విద్యార్థిని ధరావత్ ప్రీతిని వేధించిన కేసులో అరెస్టైన సీనియర్ వైద్య విద్యార్థి సైఫ్ ను KMC నుంచి సస్పెండ్ చేసేందుకు యాజమాన్యం సన్నాహాలు చేస్తోంది. ప్రీతి ఆత్మహత్యాయత్నం సంఘటనను మెడికో లీగల్ కేసు (MLC)గా పరిగణిస్తూ ఈ మేరకు చర్యలు చేపట్టేందుకు కాలేజీ సిద్ధమవుతోంది.
సాధారణంగా ఏ విద్యార్థి అయినా 24 గంటల పాటు రిమాండ్ లో ఉంటే ఆటోమేటిక్‌గా సస్పెన్షన్ కు గురి అయ్యే అవకాశాలుంటాయి. సైఫ్ విషయంలో కూడా ఫార్మలిటీస్ (Formalities)పూర్తి చేసే కార్యక్రమంలో కాలేజీ యజమాన్యం ఉంది. ఈ కార్యక్రమం పూర్తి కాగానే సస్పెన్షన్ చేసినట్లు ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం నమోదైన కేసులో విచారణ పూర్తయి నిందితునికి శిక్ష పడితే కాలేజీ నుంచి రస్టికేట్ (Rusticate)చేసే అవకాశాలు కూడా ఉంటాయి.
సమ్మెపై వెనక్కి తగ్గిన పీజీ విద్యార్థులు
కేఎంసీ సీనియర్ పీజీ విద్యార్థులు శుక్రవారం ఇచ్చిన సమ్మె నోటీసు (Straike) నుంచి వెనక్కి తగ్గారు. నోటీసు నేపథ్యంలో ఎంజీఎం సూపరింటెంట్ డాక్టర్ చంద్రశేఖర్ పీజీ విద్యార్థులతో జరిపిన సంప్రదింపుల మేరకు ప్రస్తుతానికి వారు వెనక్కి తగ్గినట్లు సమాచారం. ప్రీతి ఆత్మహత్యాయత్నం సంఘటన, తమ సహచర విద్యార్థి సైఫ్ పై కేసు నమోదైన నేపథ్యంలో పీజీ విద్యార్థులు వాస్తవాలు వెలుగులోకి తీయాలంటూ డిమాండ్ చేస్తూ సమ్మెకు సిద్ధమైన విషయం తెలిసిందే.
ప్రస్తుతం ఒక వైపు ప్రొఫెసర్ల విచారణ కమిటీ నివేదిక పంపించిన నేపథ్యం, మరోవైపు పోలీసులు కేసు నమోదుచేసి సైఫ్‌ను అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించారు. ఇంకా పోలీసుల దర్యాప్తు కొనసాగుతున్నందున నిజానిజాలు వెలుగు చూసే అవకాశం కల్పించేందుకు సహకరించాలని ఎంజీఎం అడ్మినిస్ట్రేషన్ ప్రతినిధులు కోరారు. వారు నచ్చ చెప్పడంతో పీజీ విద్యార్థులు సమ్మె యోచన విరమించినట్లు చెబుతున్నారు.
సీపీని (CP) కలిసేందుకు హామీ
ఏదైనా విషయాలు ఉంటే వరంగల్ సిపి రంగనాథ్‌కు నేరుగా పీజీ విద్యార్థులు వెళ్లి తమ అభిప్రాయాలు వ్యక్తపరచవచ్చని ఎంజీఎం వర్గాలు చేసిన సూచన మేరకు సమ్మె నుంచి వెనక్కి తగ్గారు. సిపి కూడా వారి అభిప్రాయం వినేందుకు సుముఖత వ్యక్తం చేసినందున సమ్మె యోచన విరమించారు. వారిచ్చిన భరోసా మేరకు పీజీ విద్యార్థులు తమ కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నారు. అయితే నిరసనగా నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. దీంతో ఎంజీఎం పాలన యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. సామాన్య రోగులకు సైత సమ్మె వల్ల కలిగే ఇబ్బందులు తప్పాయి.
ప్రీతికి న్యాయం చేయాలని గిరిజన సంఘం నిరసన
ఇదిలా ఉండగా కాకతీయ మెడికల్ కాలేజీ(kmc) వద్ద తెలంగాణ రాష్ట్ర గిరిజన సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. మెడికో (Medico)గిరిజన బిడ్డ ప్రీతికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. గిరిజన సంఘాల నాయకులను కేసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.