Revanth Reddy |
- జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు కాంగ్రెస్ అండ
- బానిసల కంటే హీనంగా జానియర్ పంచాయతీ కార్యదర్శుల పరిస్థితి
- 12 రోజులుగా సమ్మె చేస్తున్నా సర్కారుకు చీమకుట్టినట్లు కూడా లేదనివ్యాఖ్య
- సమ్మె విరమించకుంటే ఉద్యోగాల నుంచి తొలగిస్తామనడం దిగజారుడు తనానికి నిదర్శనం
- సీఎం కేసీఆర్‌కు పీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ
విధాత: బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో జూనియర్ పంచాయతీ కార్యదర్శలు పరిస్థితి బానిసల కంటే హీనంగా తయారైందని పీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి (Revanth Reddy) అన్నారు. వారితో గొడ్డు చాకిరీ చేయించుకోవడమే తప్ప, వారి హక్కులను పరిరక్షించడంలో ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంద న్నారు. ఈ మేరకు పీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి మంగళవారం సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు.
న్యాయంగా వారికి దక్కాల్సిన హక్కు అయిన ఉద్యోగాలను రెగ్యులర్ చేయాలని గత 12 రోజుల నుంచి సమ్మె చేస్తున్న మీ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు అయిన లేదని ఆ లేఖలో రేవంత్ ఆరోపించారు. ఎంత సేపు రాజకీయాలే తప్ప జూనియర్ పంచాయితీ కార్యదర్శుల గోసను పట్టించుకునే సోయి లేకుండా పోయిందన్నారు.
మీ దౌర్భగ్యం కారణంగా పంచాయితీ కార్యదర్శులు ఉద్యోగాల రెగ్యులరైజేషన్ కోసం రోడెక్కే పరిస్థితి వచ్చిందన్నారు. అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి ఇచ్చిన హామీకే దిక్కులేకపోతే రాష్ట్రంలో పాలన ఉన్నట్టా లేనట్టా! అని అడిగారు.
ఇప్పటికైనా పంచాయితీ కార్యదర్శులను రెగ్యులర్ చేస్తూ తక్షణమే ఉత్తర్వులు జారీ చేయాల్సిన బాధ్యత మీపైన ఉందన్నారు. లేనిపక్షంలో వారి పోరాటానికి కాంగ్రెస్ పార్టీ మద్దతుగా నిలవడమే కాక, వారి తరపున ప్రత్యక్ష కార్యచరణకు సైతం సిద్ధమవుతామని హెచ్చరించారు.
మీ ప్రభుత్వం దేశంలోనే మా పంచాయితీలు ఆదర్శం అందుకే కేంద్ర ప్రభుత్వం అవార్డులు ఇస్తుందని గొప్పలు చెప్పుకుంటోందని, ఆ గొప్పల వెనుక పగలనక రాత్రనక కుటుంబాన్ని సైతం పట్టించుకోకుండా జూనియర్ పంచాయితీ కార్యదర్శులు పడిన శ్రమ ఉందని రేవంత్ అన్నారు.
రాష్ట్రంలో గ్రామపంచాయితీలకు వారి కష్టంతో 79 అవార్డులు వచ్చిన విషయాన్ని మరిచిపోవద్దని హితవు పలికారు. ఇంత చేసి మీకు అవార్డులు తెస్తే వారి సర్వీసులను రెగ్యులర్ చేయకుండా వేధించడం ఎంత వరకు సహేతుకమని ప్రశ్నించారు. వారి కష్టానికి మీ ప్రభుత్వం ఇచ్చే రీవార్డు ఇదేనా అని అడిగారు.
తెలంగాణ వస్తే కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాలు ఉండవంటూనే బాండ్ లేబర్ మాదిరిగా మూడేళ్ల ప్రొబేషన్ పీరియడ్ తో 9,355 మందిని పలు రకాల షరతులను విధించి రూ. 100 బాండ్ పేపర్ మీద సంతకాలు తీసుకొని ఉద్యోగాల్లోకి తీసుకున్నారని రేవంత్ అన్నారు.
ప్రొబేషనరీ మూడేళ్ల పీరియడ్ పూర్తయినప్పటికీ క్రమబద్దీకరణ చేయకుండా మరో ఏడాది ప్రొబేషన్ టైమ్ మరో ఏడాది పెంచుతున్నట్లు సీఎం హోదాలో మీరు అసెంబ్లీలో ప్రకటించిన మీరు ఆ తరువాత రెగ్యులరైజ్ చేస్తానని ఇచ్చిన హామీని రేవంత్ గుర్తు చేశారు. ఆనాడు ప్రొబేషన్ ను ఏడాది పెంచడం కోసం 2022, జూలై 17న , తెలంగాణ రెగ్యులరైజేషన్ ఆఫ్ అపాయింట్మెంట్ యాక్టుకు విరుద్ధంగా జీఓ నెం 26 ద్వారా జారీ చేశారన్నారు.
పొడిగించిన ప్రొబేషన్ పీరియడ్ కూడా ఈ ఏడాది ఏప్రిల్ 11తో ముగిసినప్పటికీ, దున్నపోతు మీద వానకురిసినట్లు ప్రభుత్వంలో ఎటువంటి చలనం లేకపోవడంతో దిక్కులేని పరిస్థితుల్లో పంచాయితీ కార్యదర్శులు సమ్మెకు దిగారన్నారు. ఇటువంటి సమస్యలను సావధానంగా విని పరిష్కరించాల్సిన ప్రభుత్వమే సమ్మె విరమించి ఉద్యోగాల్లో చేరకుంటే తొలగిస్తామని బెదిరింపులకు పాల్పడటం మీ దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు.
గ్రామపంచాయతీ పరిధిలో 56 రకాల విధులను అప్పగించి రోజు 10 నుంచి 12 గంటలపాటు జూనియర్ పంచాయితీ కార్యదర్శులతో వెట్టి చాకిరి చేయించుకుంటోంది మీ ప్రభుత్వం. రోజు రోజుకు నిర్వహించాల్సిన బాధ్యతలు పెరగుతుండటం, మితిమీరిన ఒత్తిడితో పంచాయితీ కార్యదర్శులు తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారు. ఇప్పటికే స్థానిక రాజకీయాల కారణంగా రాష్ట్రంలో దాదాపు 1500 మంది ఉద్యోగాలు వదిలేశారు. ఇతర అనారోగ్య సమస్యలతో 44 మంది వరకు మృతి చెందారు.
ఇంత చేస్తున్న మీ ప్రభుత్వం గ్రామ కార్యదర్శుల రెగ్యులర్ చేసే విషయంపై ఎటువంటి నిర్ణయం తీసుకోవడం లేదు. ఉన్నత చదువులు చదివి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించి ఉన్నత స్థానంలో నిలవాలనే ఆశ ఉన్నప్పటికీ తక్కువ జీతమే అయిన వచ్చిన ప్రభుత్వ ఉద్యోగ అవకాశం వదలు కోకూడదని జూనియర్ పంచాయితీ కార్యదర్శి ఉద్యోగంలో చేరారు. ఎంతో పనిభారం పెరిగినా భరిస్తూ రెగ్యులర్ చేస్తారని ఆశగా ఎదురు చూశారు.
మూడేళ్ల ప్రొబేషన్ ముగిసిన మరో ఏడాది పొడిగించిన అలస్యంగానైనా న్యాయం జరుగుతుందనే సదుద్దేశంతో దానికి కూడా అంగీకరించి తమ బాధ్యతలను సక్రమంగా నిర్వహించారు. ఇప్పుడు నాలుగేళ్ల ప్రొబేషన్ పీరియడ్ ముగిసిన తమ ఉద్యోగాలను రెగ్యులర్ చేయకపోవడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. నోటిఫికేషన్ ప్రకారం..మూడేళ్ల తర్వాత గ్రేడ్-4 ఉద్యోగులుగా గుర్తించాలి. కానీ నాలుగేళ్లు పూర్తి కావొస్తున్నా ఆ దిశగా మీ ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా చోద్యం చూస్తోందన్నారు.
కాంగ్రెస్ పార్టీ చేసిన డిమాండ్లు ఇవే..
- జూనియర్ పంచాయితీ కార్యదర్శులు కోరుకుంటున్న విధంగా వారి ఉద్యోగాలను రెగ్యులర్ చేయాలి.
- 4 సంవత్సరాల సర్వీసులను పరిగణనలోకి తీసుకోవాలి.
- కేడర్ స్ట్రెంట్ తో పాటు సర్వీసును రూపొందించాలి.
- 010 పద్దు కింద వేతనాలిస్తూ ఈహెచ్‌ఎస్(EHS) కార్డులను అందజేయాలి.
- చని పోయిన పంచాయితీ కార్యదర్శుల స్థానంలో వారి కుటుంబ సభ్యులకు అవకాశం కల్పించేలా కారుణ్య నియామకాలు చేపట్టాలి.
- ఓపీఎస్(OPS (Out Sourcing Secretary)) వారిని కూడా రెగ్యులర్ చేయాలి.
- ఇతర శాఖల్లోని ప్రభుత్వ మహిళా ఉద్యోగుల మాదిరిగా మహిళా పంచాయితీ కార్యదర్శులకు 6 నెలల ప్రసూతి సెలవులు, 90 రోజుల చైల్డ్ కేర్ సెలవులు ఇవ్వాలి.