HomelatestRevanth Reddy | కల్వకుంట్ల ఫ్యామిలీ ‘దారి’ దోపిడీ

Revanth Reddy | కల్వకుంట్ల ఫ్యామిలీ ‘దారి’ దోపిడీ

Revanth Reddy |

  • కేటీఆర్ ధన దాహానికి ఓఆర్ఆర్ బలి
  • లిక్కర్‌ స్కాం లాంటిదే ఓఆర్‌ఆర్‌
  • బీజేపీ ఎందుకు నిలదీయదు?
  • కేసీఆర్‌ మోదీ అవిభక్త కవలలు
  • టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి

విధాత: కేటీఆర్ ధన దాహానికి ఔటర్ రింగ్ రోడ్ బలైందని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ఆరోపించారు. శుక్రవారం గాంధీభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కల్వకుంట్ల కుటుంబం దారిదోపిడీకి పాల్పడిందన్నారు. బేస్ ప్రైస్ లేకుండా ఓఆర్ఆర్ టెండర్లు పిలవడంపై తాము ప్రశ్నించామని చెప్పారు. 30 రోజుల్లోగా 10శాతం, 120 రోజుల్లోగా పూర్తి డబ్బు ఐఆర్బీ (IRB) సంస్థ చెల్లించాలని నిబంధన ఉందన్నారు.

కానీ.. అలాంటి నిబంధనలు లేవని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బుకాయించారన్నారు. డబ్బు చెల్లింపునకు సంబంధించి కన్సెషన్ అగ్రిమెంట్‌లోని 20, 21 పేజీల్లో తాము చెప్పిన నిబంధనలు స్పష్టంగా ఉన్నాయన్నారు. తాను చెప్పింది 10శాతమే, కానీ వాస్తవంగా 30 రోజుల్లో 25 శాతం టెండర్ పొందిన సంస్థ చెల్లించాలని చెప్పారు.

ముగిసిన 30 రోజుల గడువు

ఏప్రిల్ 27, 2023న లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ జరిగిందని, 30 రోజుల గడువు ముగిసిందని రేవంత్ తెలిపారు. నియమ నిబంధనలు ఉల్లంఘించిన ఐఆర్బీ సంస్థ టెండర్ ను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు రూపాయి చెల్లించని సంస్థ టెండర్ ను రద్దు చేయమంటే ప్రభుత్వం బుకాయిస్తోందన్నారు. ఒకవేళ నిబంధనలు ఏమైనా మారిస్తే, ఆ మార్చిన నిబంధనలు ఏమిటో బయటపెట్టాలన్నారు.

లిక్కర్ దందా విషయంలో టెండర్ నిబంధనలు సరళీకృతం చేసి ఢిల్లీలో లిక్కర్ వ్యాపారం చేశారని, కేసీఆర్ కుటుంబం ఈ దందాలో రూ.100 కోట్ల స్కాం చేసిందని రేవంత్ ఆరోపించారు. ఢిల్లీ లిక్కర్ స్కాం లాగే ఓఆర్‌ఆర్‌ విషయం కూడా పెద్ద స్కామ్ అని అన్నారు. తాను చెప్పింది, రఘునందన్ చెప్పింది ఒక్కటే నన్నారు. మరి బండి సంజయ్, కిషన్ రెడ్డి లు ఓఆర్ఆర్ అంశంపై ఎందుకు విచారణకు ఆదేశించడం లేదని ప్రశ్నించారు. దీని వెనక గూడుపుఠానీ ఏమిటని నిలదీశారు.

మేం చెప్పింది నిజమా? అబద్ధమా?

తాము బయటపెట్టిన నిబంధనలు నిజమా కాదా చెప్పాల్సిన బాధ్యత అరవింద్ కుమార్, సోమేశ్ కుమార్ పై ఉందని రేవంత్ అన్నారు. నిబంధనలు టెండర్ వచ్చిన సంస్థ కోసం మారిస్తే.. ఇది ఢిల్లీ లిక్కర్ స్కాం లాంటిదేనన్నారు. బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ ఓఆర్ఆర్ టెండర్ పై సీబీఐ కి పిర్యాదు చేశారన్నారు.

సొంత ఎమ్మెల్యే ఫిర్యాదును బండి, కిషన్ రెడ్డి నమ్ముతున్నారా.. లేదా అని ప్రశ్నించారు. ఈ అంశంపై కేటీఆర్ స్పందించాలన్నారు. లేకపోతే అరవింద్ కుమార్ స్పందించాలన్నారు. దీనిపై పూర్తి బాధ్యత అరవింద్ కుమార్ పై నే ఉందన్నారు. అరవింద్ కుమార్ ఊచలు లెక్కపెట్టాల్సి వస్తుందని హెచ్చరించారు.

బీజేపీది మూడో స్థానమేనని ఆ పార్టీ నాయకులే అంటున్నారు

తెలంగాణలో బీజేపీది మూడో స్థానమే అని వాళ్ల జాతీయ నాయకులే చెబుతున్నారని రేవంత్ అన్నారు. కాంగ్రెస్ ను గెలవకుండా అడ్డుకోవడమే వారి లక్ష్యమన్నారు. మేం ముందు నుంచి చెబుతున్నట్లు బీజేపీ, బీఆరెస్ ఒక్కటేన్నారు. కేసీఆర్, మోదీ అవిభక్త కవలలన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ను గెలిపించాల్సిన అవసరం ఉన్నదన్న రేవంత్‌రెడ్డి.. కొందరు ఆవేశంలో బీజేపీలో చేరిన తరువాత అసలు సంగతి తెలుసుకున్నారన్నారు. బీఆర్ఎస్‌ను ఓడించడం కాంగ్రెస్‌తోనే సాధ్యమన్నారు.

కేసీఆర్ వ్యతిరేక పునరేకీకరణ జరగాలని తాను అందుకే చెప్పానని రేవంత్ అన్నారు. ఇప్పటికైనా భ్రమలు వీడి బీజేపీలో కొనసాగుతూ ఉక్కిరి బిక్కిరవుతున్న నేతలు కలిసి రావాలని పిలుపు ఇచ్చారు. ఆలోచన చేసి మంచి ముహూర్తంలో మంచి నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ను నేను ప్రశ్నిస్తున్నా…బీఆర్ఎస్ కు మైనారిటీ ఓట్లను మోదీకి తాకట్టు పెడుతున్నారని, దీన్ని మీరు ఎలా సమర్దించుకుంటారు? అని అడిగారు.

ఇప్పటికైనా ఈ విషయాన్ని మీకు విషయం అర్ధమైందా? అర్థం కాకపోతే అర్ధం చేసుకోండన్నారు. ఏ హామీలు అమలు చేశారని, ప్రజలకు ఏం నమ్మకం కలిగించారని హరీష్ తమ పాలనను సమర్దించుకుంటారని రేవంత్ అన్నారు.

తాను స్వాతిముత్యం.. మామ ఆణిముత్యం అని అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు సెక్యూరిటీ లేకుండా హరీష్, కేటీఆర్ ఓయూకు వెళ్లి నిరుద్యోగులతో చర్చించాలని, క్షేమంగా తిరిగివస్తే వాళ్లు చెప్పింది నిజమని ఒప్పుకుంటామన్నారు.

నిరుద్యోగ ఖాళీలపై సీఎం శాసనసభలో చెప్పింది అబద్దమా? అని అడిగారు. గంటా చక్రపాణి గవర్నర్ కు ఇచ్చిన నివేదిక అబద్దమా? అని అన్నారు. 110 నెలల్లో లక్ష 10వేల మంది పదవీ విరమణ చేశారన్నారు. బిస్వాల్ కమిటీ చెప్పినట్టు ఇప్పటి వరకు 2లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని లెక్కలు చెబుతున్నాయన్నారు. హరీష్.. పొడుగు ఉంటే సరిపోదు.. మెదడు కూడా ఉండాలని, అది మోకాళ్ళలోనో, అరికాళ్ళలోనో ఉంటే సరిపోదన్నారు.

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img

Latest News

Cinema

Politics

Most Popular