Revanth Reddy | అమరుల త్యాగాల పునాదులపై గద్దెనెక్కిన కేసీఆర్( KCR ) తెలంగాణ ప్రజలను మోసాగించారు అని టీపీసీసీ( T PCC ) అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. యాత్ర ఫర్ ఛేంజ్ పాదయాత్రలో భాగంగా బుధవారం నిజామాబాద్( Nizamabad ) నియోజకవర్గం పరిధిలోని దుబ్బ చౌరస్తా నుంచి నెహ్రూ పార్క్ వరకు పాదయాత్ర చేపట్టారు. అనంతరం నెహ్రూ పార్క్ వద్ద నిర్వహించిన జన సభలో ఆయన ప్రసంగించారు.
నిజామాబాద్ జిల్లా అంటే కాంగ్రెస్ నిర్మించిన శ్రీరాం సాగర్( Sriram Sagar ) గుర్తొస్తుంది. నాటి నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్న దాశరథిని బంధించిన జైలు గుర్తొస్తుంది. నిజామాబాద్‌కు గొప్ప పేరు తెచ్చిన మహనీయుల గడ్డను ఇప్పుడు ఎవరు ఏలుతున్నారు. ఎలాంటి నాయకులను ఎన్నుకున్నారు? అమరుల త్యాగాల పునాదులపై గద్దెనెక్కిన కేసీఆర్ తెలంగాణ ప్రజలను మోసగించారు. నిజామాబాద్‌లో తెలంగాణ యూనివర్సిటీ, మెడికల్ కాలేజ్, 30 పడకల ఆసుపత్రి కాంగ్రెస్ హయాంలో వచ్చిందే. ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వమే అని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.
మంత్రి ప్రశాంత్ రెడ్డికి సవాల్..
ఎవరు వ్యాపారం చేసినా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే పెట్టుబడి లేకుండా భాగస్వామి కాదా? అమరవీరుల స్థూపంలో అవినీతి జరిగింది. అంబేడ్కర్ విగ్రహం, సచివాలయ నిర్మాణంలో అవినీతి జరిగింది. అవినీతిపై మూడు రోజులుగా మంత్రి ప్రశాంత్ రెడ్డికి సవాల్ విసురుతున్నా స్పందించడం లేదు. తన చెంచాలతో నన్ను తిట్టిస్తున్నాడు. పెద్దమనిషి స్థానంలో ఉన్న పోచారం.. ఇసుక దందాలను తన కొడుకులకు పంచి ఇచ్చిండు అని రేవంత్ ఆరోపించారు.
అరవింద్ పేరులో ధర్మం.. పనిలో మాత్రం అధర్మం..
మోదీ తన జేబులో ఉన్నాడన్న అరవింద్ పసుపు బోర్డు ఎందుకు తేలేదు? ధర్మపురి అరవింద్ పేరులోనే ధర్మం ఉంది. ఆయన పనిలో అధర్మం కనిపిస్తుంది. నిజామాబాద్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరేయడం ఖాయం. కేసీఆర్ పై కోపంతో బీజేపీ వైపు చూడొద్దు. తల్లిని చంపి పిల్లను బతికించారని మోదీ తెలంగాణను అవమానించారు అని రేవంత్ గుర్తు చేశారు.
కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం..
రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. ఇల్లు లేని పేదలకు ఇల్లు కట్టుకునేందుకు రూ.5 లక్షలు ఉచితంగా అందిస్తాం. రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా రూ.5 లక్షల వరకు వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుంది. రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తాం. 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలలను ఏడాదిలోగా భర్తీ చేస్తాం. పేదలకు రూ.500 లకే గ్యాస్ సిలిండర్ అందించే బాధ్యత కాంగ్రెస్ ది. ఎవరు మైనారిటీల సంక్షేమానికి పాటుపడ్డారో ముస్లిం సోదరులు ఆలోచించండి. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కు ఒక్క అవకాశం ఇవ్వండి అని రేవంత్ రెడ్డి కోరారు.