Revanth Reddy ఈ ఎన్నికల్లో బీఆరెస్‌ అభ్యర్థి ఖర్చు 50 కోట్లు మొత్తం 5వేల కోట్లు ఖర్చు చేయాలని చూస్తున్నారు టీపీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సంచలన ఆరోపణలు బీఆరెస్, బీజేపీ.. రెండు పార్టీలూ ఒక్క‌టేనని వ్యాఖ్య విధాత‌, హైద‌రాబాద్‌: రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కో ఎమ్మెల్యే అభ్యర్థికి 50 కోట్లు ఖర్చుపెట్టే ఆలోచనలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉన్నారని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఎన్నికల్లో మొత్తం 5వేల కోట్లు బీఆరెస్‌ ఖర్చు పెట్టే […]

Revanth Reddy

  • ఈ ఎన్నికల్లో బీఆరెస్‌ అభ్యర్థి ఖర్చు 50 కోట్లు
  • మొత్తం 5వేల కోట్లు ఖర్చు చేయాలని చూస్తున్నారు
  • టీపీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సంచలన ఆరోపణలు
  • బీఆరెస్, బీజేపీ.. రెండు పార్టీలూ ఒక్క‌టేనని వ్యాఖ్య

విధాత‌, హైద‌రాబాద్‌: రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కో ఎమ్మెల్యే అభ్యర్థికి 50 కోట్లు ఖర్చుపెట్టే ఆలోచనలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉన్నారని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఎన్నికల్లో మొత్తం 5వేల కోట్లు బీఆరెస్‌ ఖర్చు పెట్టే అవకాశం ఉన్నదని విమర్శించారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున దందాలు చేసిన కేసీఆర్‌.. లక్ష కోట్లు దాచుకున్నరని ఆరోపించారు. వీటి నుంచి ఒక్కో ఎమ్మెల్యేకు రూ.50కోట్లు ఖర్చు చేసి గెలవాలనుకుంటున్నారని ఆరోపించారు.

శుక్ర‌వారం రేవంత్‌రెడ్డి స‌మ‌క్షంలో ఆర్మూరు నియోజక వర్గ బీజేపీ నాయకులు ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి ఆయ‌న అనుచ‌రుల‌తో కాంగ్రెస్‌పార్టీలో చేరారు. ఈ సంద‌ర్భంగా రేవంత్ మాట్లాడుతూ బీఆరెస్‌తో కొట్లాడే వారికి ఆర్మూర్‌లో బీజేపీ పదవులు ఇవ్వలేదన్నారు. ఈ పరిస్థితి రాష్ట్రమంతా ఉందని చెప్పారు. బీజేపీ, బీఆరెస్ ఒకదానికొకటి సహకరించుకుంటున్నాయని విమ‌ర్శించారు.

జీవన్ రెడ్డిని ఈడీ అమీన్‌తో పోల్చిన రేవంత్‌.. ఆర్మూర్‌కు ఆయన చేసిందేమీ లేదని విమ‌ర్శించారు. జమిలి పేరుతో బీజేపీ, బీఆరెస్ రెండు పార్టీలు కాంగ్రెస్‌ను ఓడించాలని చూస్తున్నాయని ఆరోపించారు. ఇద్దరు కాదు వంద మంది వచ్చినా కాంగ్రెస్‌ను ఏమీ చేయలేరని ధీమా వ్య‌క్తం చేశారు. ‘ఆర్మూర్ గడ్డపైకి నేను వస్తా. కాంగ్రెస్ కార్యకర్తలకు అండగా ఉంటా. మీరు ధైర్యంగా ఉండండి జీవన్ రెడ్డి పని పట్టండి’ అని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

కేసీఆర్‌ దోపిడీకి బీజేపీ వత్తాసు

కేసీఆర్ దోపీడీని బీజేపీ బలపరుస్తున్నదని రేవంత్‌రెడ్డి విమర్శించారు. బీఆరెస్ రాష్ట్రాన్ని దోచుకుంటున్నా ఎందుకు బీజేపీ చర్యలు తీసుకోవడం లేదని బండి సంజయ్, కిషన్ రెడ్డి, అరవింద్‌ల‌ను ప్ర‌శ్నించారు. అరవింద్ కూడా మోదీ చెప్పింది తప్ప ఏం చేయలేరని అన్నారు. కాంగ్రెస్ నేతలపై ఈడీ, సీబీఐ కేసులు పెట్టిన బీజేపీ కేసీఆర్ పై ఎందుకు పెట్టలేదని విమ‌ర్శించారు.

కేసీఆర్ ఏమైనా సత్యహరిశ్చంద్రుడా? మహాత్ముడా? అని రేవంత్ ప్ర‌శ్నించారు. శాండ్, ల్యాండ్, మైన్ అన్ని దందాల్లో బీఆరెస్ నేతలే ఉన్నార‌ని ఆరోపించారు. రాష్ట్రంలో అరాచకాలన్నింటికీ బీఆరెస్, కేసీఆర్ కారణమ‌ని రేవంత్ మండిప‌డ్డారు. సీఎం కేసీఆర్ పాల‌నలో రాష్ట్రం ఏడున్నర లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిందన్నారు. రాష్ట్రంలో పుట్టబోయే బిడ్డపై కూడా కేసీఆర్ లక్షన్నర అప్పు చేశాడ‌ని రేవంత్ రెడ్డి తెలిపారు.

Updated On 8 Sep 2023 11:58 AM GMT
somu

somu

Next Story