Tuesday, January 31, 2023
More
  Homeతెలంగాణ‌95వేల మెట్రిక్ టన్నుల రైస్‌ను మిల్లింగ్ చేసి పంపాలి: అద‌న‌పు క‌లెక్ట‌ర్‌

  95వేల మెట్రిక్ టన్నుల రైస్‌ను మిల్లింగ్ చేసి పంపాలి: అద‌న‌పు క‌లెక్ట‌ర్‌

  • గ‌డువు పెంచేది లేదు.. ఈ నెలాఖ‌రు వ‌ర‌కే స‌మ‌యం

  విధాత, మెదక్ బ్యూరో: 2021-22 ఖరీఫ్ కు సంబంధించి పెండింగ్ ఉన్న 95 వేల మెట్రిక్ టన్నుల కస్టమ్ మిల్లింగ్ రైస్‌ను ఈ నెలాఖరులోగా మిల్లింగ్ చేసి పంపవలసినదిగా అదనపు కలెక్టర్ రమేష్ రైస్ మిల్లుల యాజమాన్యాన్ని కోరారు. గురువారం కలెక్టరేట్‌లోని ప్రజావాణి హాల్‌లో రా రైస్, బాయిల్డ్ రైస్ మిల్లర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయ‌న మాట్లాడారు.

  గత ఖరీఫ్‌కు సంబంధించి ఇంకను 32 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సనత్ నగర్‌లోని ఎఫ్.సి.ఐ. గోదాముకు, 63వేల మెట్రిక్ టన్నుల ధాన్యం పౌర సరఫరాల శాఖకు మిల్లింగ్ చేసి పంపవలసి ఉందని అన్నారు. ఈ మాసం చివరి వరకు పెండింగ్ ఉన్న సీఎంఆర్ రైస్ ను పంపాలని, ఎట్టి పరిస్థితులలో గడవు పెంచమని భారత ఆహార సంస్థ స్పష్టం చేసిందని అన్నారు.

  కావున సీఎంఆర్ పెండింగ్ ఉన్న 120 రా, బాయిల్డ్ రైస్ మిల్లర్లు డిఫాల్ట్ లేకుండా ఈ 20 రోజులు కష్టపడి ధాన్యాన్ని మిల్లింగ్ చేసి పంపవలసినదిగా కోరారు. ఇక నుండి ఎఫ్.సి.ఐ. పోర్టిఫైడ్ రైస్ ను మాత్ర‌మే కొనుగోలు చేస్తుందని, ఆ మేరకు రైస్ మిల్లులను ఆధునీకరించుకోవలసినదిగా సూచించారు.

  ఈ ఖరీఫ్ సీజన్ లో 410 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 45 రోజులలోగా 91,379 మంది రైతుల నుండి 3,93,578 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడంతో పాటు వంద శాతం ట్యాప్ ఎంట్రీ చేసి రైతుల ఖాతాలో రూ.850 కోట్లు జమచేసి రాష్ట్రంలో ముందున్నామన్నారు. ఇందుకు సహకరించిన రైస్ మిల్లర్లకు అదనపు కలెక్టర్ రమేష్ ధన్యవాదాలు తెలిపారు.

  ఈ సందర్భంగా ఒప్పంద పత్రాలు ఇవ్వని వారు వెంటనే అందజేయాలని కోరారు. ఎఫ్.సి.ఐ. సిబ్బంది ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు తమ దృష్టికి తెస్తే కమీషనర్ దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. పౌర సరఫరాల సంస్థ సిబ్బంది కూడా క్షేత్ర స్థాయిలో రైస్ మిల్లులను సందర్శించి ఏమైనా సమస్యలుంటే పరిష్కరించాలని సూచించారు.

  జిల్లా రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షుడు చంద్ర పాల్ మాట్లాడుతూ రైస్ మిల్లర్లు వేలాది కోట్ల రూపాయల ధాన్యం కొనుగోలు చేసి వాటిని కాపాడి ప్రభుత్వానికి ఇస్తున్న గౌరవం లేదని ఎఫ్.సి.ఐ. వారు రైస్ మిల్లర్లంటే లోకువగా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

  బుధవారం సనత్ నగర్ లోని ఎఫ్.సి. ఐలో జరిగిన సంఘటనే ఉదాహరణ అని, పౌర సరఫరా అధికారులు జిల్లా మేనేజర్ తో మాట్లాడిన తరువాతే సమస్య పరిష్కారమయ్యిందని అన్నారు. సమావేశంలో జిల్లా పౌర సరఫరాల అధికారి శ్రీనివాస్, మెదక్ నియోజక వర్గం అధ్యక్షులు సంతోష్ రెడ్డి, నరసాపూర్ నియోజక వర్గం అధ్యక్షులు యాదవ రావు, కార్యదర్శి నగేష్, రా, బాయిల్డ్ రైస్ మిల్లుల యజమానులు తదితరులు పాల్గొన్నారు.

  RELATED ARTICLES

  Latest News

  Cinema

  Politics

  Most Popular