ప్రతిపక్షాల ఐక్యకార్యాచరణ.. సమితి ఏర్పాటు.. శాంతియితంగా ఉద్యమం నియోజకవర్గం స్థానంలో రెవెన్యూ డివిజన్ ఎర్పాటు చేయాలని డిమాండ్ ఐక్యకార్యాచరణ సమితి నిరసన కార్యక్రమాలు ఉద్యమానికి దూరంగా బీఆర్ఎస్ సీఎం దృష్టికి తీసుకెళ్తా.. మంత్రి హరీశ్‌రావు హామీ విధాత,మెదక్: రద్దైన రామాయంపేట అసెంబ్లీ నియోజక వర్గ కేంద్రాన్ని రెవెన్యూ డివిజన్‌గా చేయాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్షాలన్నీ ఏకమయ్యాయి. కాంగ్రెస్, బీజేపి, ఎమ్మార్పీఎస్, ఇతర సంఘాలు అన్ని ఏకమై జేఏసీగా ఏర్పడి రామాయంపేట మున్సిపాలిటీ కేంద్రంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. […]

- ప్రతిపక్షాల ఐక్యకార్యాచరణ.. సమితి ఏర్పాటు..
- శాంతియితంగా ఉద్యమం
- నియోజకవర్గం స్థానంలో రెవెన్యూ డివిజన్ ఎర్పాటు చేయాలని డిమాండ్
- ఐక్యకార్యాచరణ సమితి నిరసన కార్యక్రమాలు
- ఉద్యమానికి దూరంగా బీఆర్ఎస్
- సీఎం దృష్టికి తీసుకెళ్తా.. మంత్రి హరీశ్‌రావు హామీ
విధాత,మెదక్: రద్దైన రామాయంపేట అసెంబ్లీ నియోజక వర్గ కేంద్రాన్ని రెవెన్యూ డివిజన్‌గా చేయాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్షాలన్నీ ఏకమయ్యాయి. కాంగ్రెస్, బీజేపి, ఎమ్మార్పీఎస్, ఇతర సంఘాలు అన్ని ఏకమై జేఏసీగా ఏర్పడి రామాయంపేట మున్సిపాలిటీ కేంద్రంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ఇటీవల రామాయంపేట 24 గంటల బంద్‌కు పిలుపు నివ్వగా బంద్ సక్సెస్ అయ్యింది. బీఆర్ఎస్ పార్టీ నేతలు తప్ప ప్రతిపక్షాలు అన్ని డివిజన్ కేంద్ర సాధన ఉద్యమంలో పాల్గొంటున్నారు. కార్మికులు, తాపీ మేస్త్రీలు, అన్ని పార్టీల నాయకులు కార్యకర్తలు, వ్యాపార వర్గాలు కలసి ఉద్యమాన్ని ముందుకు తీసుకు వెళ్తున్నారు.
గత అసెంబ్లీ ఎన్నికల ముందు సైతం అన్ని పార్టీలు ఐక్యంగా ధర్నాలు, రాస్తారోకోలు, ప్రభుత్వ దిష్టి బొమ్మల దహనం, తదితర కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ ప్రభుత్వం స్పందించలేదు. ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలపై కేసులు పెట్టి ఉద్యమాన్ని అణిచివేశారు.
అప్పట్లో మంత్రి హరీశ్‌రావు జేఏసీ నాయకులను నిజాంపేట్‌కు పిలిపించి మాట్లాడి రాష్ట్రంలో డివిజన్లు ఏర్పాటు చేసిన క్రమంలో రామాయంపేటను తప్పక రెవెన్యూ డివిజన్ చేస్తామని మంత్రి హరీశ్‌రావు హామీ కూడా ఇచ్చారు.
అయితే రాష్ట్రంలో ఇటీవల 2 డివిజన్లు ఏర్పాటవగా.. రామాయంపేట ప్రస్తావన రాలేదు. దాంతో మళ్ళీ రామాయంపేట రెవెన్యూ డివిజన్ సాధన కోసం ప్రతి పక్షాలు ఉద్యమిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల రామాయంపేట బంద్‌కు ప్రతిపక్షాలు పిలుపు నివ్వడంతో సక్సెస్ అయింది.
ప్రాభవం కోల్పోయిన రామాయంపేట..
ముఖ్యమంత్రి అంజయ్య ప్రాతినిధ్యం వహించిన రామాయంపేట నియోజకవర్గం 2009 నియోజకవర్గాల పునర్విభజనలో రద్దయింది.1952లో ఏర్పాటైన ఈ నియోజకవర్గం 2009లో రద్దు చేశారు. కొత్తగా ఉమ్మడి మెదక్ జిల్లాలో పటాన్ చెరు కేంద్రంగా నియోజకవర్గం ఏర్పాటయింది.
1952 నుంచి వెలగు వెలిగిన రామాయంపేట క్రమక్రమంగా తన ప్రభావాన్ని కోల్పోయింది. ఒకప్పుడు వ్యాపార పరంగా గజ్వేల్, తూప్రాన్,కామారెడ్డి జిల్లా బిక్నూర్ మండలాల నుంచి రామాయంపేటకు వచ్చే వారు. ప్రస్తుతం రామాయంపేట వ్యాపార పరంగా పూర్తిగా దెబ్బతిన్నది. రామాయంపేట రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఏర్పడితే మళ్లీ పూర్వ వైభవం వస్తుందని ఉద్యమకారుల ఆకాంక్ష.
ఉద్యమానికి కార్యాచరణ ప్రణాళిక
రామాయంపేట రెవెన్యూ డివిజన్ సాధన కోసం ఉద్యమ కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నారు.
గతంలో 183 రోజులపాటు రిలే నిరాహారదీక్షలు, బంద్‌లు, రాస్తారోకోలు నిర్వహించారు. మళ్లీ ఉద్యమం ఊపందుకోవడంతో 2 రోజులక్రితం ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, మంత్రి హరీశ్‌రావులను రామాయంపేట రెవెన్యూ డివిజన్ సాధన సమితి నాయకులు కలిసి వినతిపత్రం సమర్పించారు.
సీఎం దృష్టికి తీసుకెళ్తాo: మంత్రి హరీష్ రావు
సోమవారం ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అధ్వర్యంలో రామాయంపేట రెవెన్యూ డివిజన్ సాధన జేఏసీ నాయకులు మంత్రి హరీష్ రావు ను హైదరాబాద్ లో కలిశారు. సీఎం దృష్టికి తీసుకువెళ్ళి సమస్యను పరిష్కరిస్తానని జేఏసీ నాయకులకు మంత్రి హామీ ఇచ్చారు.
అడగని చోట డివిజన్ ఇచ్చారు..
రామాయంపేటను 2014 నుంచి డివిజన్ చేయాలని కోరుతున్నామని ప్రభుత్వం స్పందించడం లేదు. గతంలో హమీ ఇచ్చ్చి మరిచారు. ఇకపై ఉద్యమాన్ని ఉదృతం చేసి రామాయంపేట రెవెన్యూ డివిజన్ సాధించుకుంటాం. - దామోదర్, జేఏసీ నాయకుడు
మంత్రి హామీ అమలు కాకుంటే ఉద్యమిస్తాం
మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఇచ్చిన హామీ అమలు కాకుంటే ఉద్యమం తప్పదని కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ ఎంపీపీ రమేష్ రెడ్డి హెచ్చరించారు. డివిజన్ సాధన కోసం శాంతి యుతంగా ఉద్యమం చేస్తామన్నారు. - రమేష్ రెడ్డి, కాంగ్రెస్ నేత
2014 నుంచి ఉద్యమిస్తున్నాం
2014 నుండి రామాయంపేట రెవెన్యూ డివిజన్ సాధన కోసం ఉద్యమం నిర్వహిస్తున్నాం. బీఆర్ఎస్ ప్రభుత్వం అవసరం లేని చోట డివిజన్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారని అవసరమున్న రామాయంపేటను రెవెన్యూ డివిజన్ చేయడం లేదని విమర్శించారు.
-అశ్విని, బీజేపీ నేత
