చప్పట్లు కొట్టే వారందరూ ఓట్లు వేయరు
విధాత: ఈ సంక్రాంతికి నందమూరి బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి విడుదల అయింది. ఈ చిత్రం పూర్తిగా మాస్ యాక్షన్ మూవీగా తెరకెక్కింది. అయితే ఈ చిత్రం మొత్తం మీద ప్లస్ పాయింట్ ఏమిటంటే బాలకృష్ణ నోటి నుంచి వచ్చిన పవర్ఫుల్ డైలాగులు.
సాయి మాధవ్ బుర్ర రాసిన ఈ డైలాగులకు థియేటర్లలో చప్పట్లు మార్మోగుతున్నాయి. ముఖ్యంగా బాలయ్య అభిమానులు, నందమూరి, నారా కుటుంబాల అభిమానులు, టిడిపి కార్యకర్తలు, అభిమానులు మాత్రం ఈ చిత్రానికి జేజేలు పలుకుతున్నారు. ఇందులో బాలయ్య చెప్పే డైలాగ్స్ నభూతో నభవిష్యతి అంటున్నారు.
మరోవైపు వైసీపీ నాయకులు, కార్యకర్తలు,. అభిమానులు మాత్రం సోషల్ మీడియా వేదికగా బాలయ్యపై మండి పడుతున్నారు. ఈ చిత్రాన్ని బయ్కాట్ చేయాలని పిలుపునిస్తున్నారు. కాగా తాజాగా రోజా బాలయ్య పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ఎమర్జెన్సీ పాలన కొనసాగుతోందన్న బాలకృష్ణ వ్యాఖ్యలపై మంత్రి రోజా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
జగన్ తీసుకు వచ్చిన జీవో నెంబర్ వన్ పూర్తిగా చదివితే అర్థమవుతుంది. చంద్రబాబు భ్రమ నుంచి బాలయ్య బయటకు రావాలి. బాలయ్య ఎమర్జెన్సీ అనడం సిగ్గుచేటు. బాలకృష్ణకు స్క్రిప్ట్ చదవడం తప్పించి జీవోలు చదవడం రాదా అని ప్రశ్నించారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రజల బాగోగులు తెలిసిన వ్యక్తి అని జీవో నెంబర్ వన్ ఎందుకు తీసుకొచ్చామో తెలుసుకుంటే ఎమర్జెన్సీ అనే కామెంట్లను బాలయ్య వెనక్కు తీసుకుంటారని ఈ ఫైర్ బ్రాండ్ అంటున్నారు.
ఇక వీర సింహారెడ్డి మూవీ గురించి మాట్లాడుతూ సినిమాల్లో ఎన్ని డైలాగ్స్ కొట్టినా చప్పట్లు కొట్టడానికి పనికొస్తాయి అని ఎద్దేవా చేశారు. బాలయ్య పరిస్థితి రాసిచ్చినా మాట్లాడలేని పరిస్థితి అని రోజా చురకలంటించారు. చంద్రబాబు సభలలో 11 మంది ప్రాణాలు కోల్పోయినప్పుడు బాలయ్య ఎందుకు మాట్లాడలేదని ఆమె ప్రశ్నించారు.
ఎంతసేపటికి తన కూతురి స్వార్థం కోసం తన అల్లుడిని ముఖ్యమంత్రి చేయడం కోసం ఆయన చంద్రబాబు నాయుడుకు ఊడిగం చేస్తున్నారు. అన్ స్టాపబుల్ విత్ ఎన్.బి.కె. షో కేవలం చంద్రబాబు లోకేషన్లు హైలెట్ చేయడానికి ఉపయోగపడిందని.. తాను కడుపు కోత బిగించిన తండ్రిని తప్పుగా ప్రాజెక్ట్ చేయడానికి ఈ షోను వాడుకున్నారని విమర్శించారు.
చంద్రబాబును, లోకేష్ ను హైలైట్ చేయడమే ఈ షో ఉద్దేశమని ఎవరేమైనా పర్వాలేదు మా కుటుంబం బాగుండాలి అనే స్వార్థం బాలయ్యలో కనిపిస్తోందని జబర్దస్త్ రోజా తీవ్ర పదజాలంతో విరుచుకు పడ్డారు. బావ మీటింగులు మాత్రం జరగాలని బాలయ్య భావిస్తున్నారు. అంతకుమించి ఆయనకు ఇంకేమీ అవసరం లేదు. నేను ప్రతి ఏటా సంక్రాంతి జరుపుకుంటాను. జగన్ పాలనలో రైతులు సుభిక్షంగా ఉన్నారని రోజా వ్యాఖ్యానించడం విశేషం.