విధాత‌: చాలామంది దృష్టిలో ఎన్టీఆర్ తనయుడు నందమూరి బాలకృష్ణ, అల్లుడు నారా చంద్రబాబు నాయుడు వంటి వారు నాన్న‌కు, మామకు వెన్నుపోటు పొడిచిన వారు. కానీ వాస్తవానికి నాడు జరిగిన పరిస్థితులు వేరు. ఎన్టీఆర్‌కు రెండో భార్యగా ఎంటరైన లక్ష్మీపార్వతి.. ఎన్టీఆర్ నుంచి అధికారాన్ని తన చేతుల్లోకి తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉండడంతో.. వీరు పార్టీని కాపాడుకునే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ నుంచి, ఎన్టీఆర్‌ను, లక్ష్మీపార్వతిని దూరంగా పెట్టి తెలుగుదేశం పార్టీ పగ్గాలను అందిపుచ్చుకున్నారు. నాడు జరిగిన […]

విధాత‌: చాలామంది దృష్టిలో ఎన్టీఆర్ తనయుడు నందమూరి బాలకృష్ణ, అల్లుడు నారా చంద్రబాబు నాయుడు వంటి వారు నాన్న‌కు, మామకు వెన్నుపోటు పొడిచిన వారు. కానీ వాస్తవానికి నాడు జరిగిన పరిస్థితులు వేరు. ఎన్టీఆర్‌కు రెండో భార్యగా ఎంటరైన లక్ష్మీపార్వతి.. ఎన్టీఆర్ నుంచి అధికారాన్ని తన చేతుల్లోకి తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉండడంతో.. వీరు పార్టీని కాపాడుకునే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ నుంచి, ఎన్టీఆర్‌ను, లక్ష్మీపార్వతిని దూరంగా పెట్టి తెలుగుదేశం పార్టీ పగ్గాలను అందిపుచ్చుకున్నారు.

నాడు జరిగిన పరిస్థితులు, లక్ష్మీపార్వతి తీరుతెన్నులు, ఎన్టీఆర్ ఆమెకు బానిస అయిపోయిన విధానం.. వంటివి తెలిసిన వారు చంద్రబాబు, బాలయ్యలు ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచారంటే ఒప్పుకోరు. కానీ తెలుగుదేశాన్ని అప్ర‌దిష్ట‌పాలు చేసేందుకు చంద్రబాబు, బాలయ్యలను విలన్లుగా చూపించ‌డం కోసం ఎంద‌రో ఎప్ప‌టి నుంచో ప్ర‌య‌త్నాలు చేస్తూనే ఉన్నారు.

అప్పటినుంచి ఇప్పటివరకు తెలుగుదేశం ప్ర‌త్య‌ర్ధి పార్టీల వారంతా ప్రయత్నిస్తూనే వస్తున్నారు. చంద్రబాబు, బాల‌య్య‌ల‌ను ఎదుర్కొనేందుకు వారి చేతిలో ఉన్న ప్రధాన ఆయుధం మామకు వెన్నుపోటు. నాన్నకు వెన్నుపోటు వంటి వ్యాఖ్యలు మాత్రమే. తాజాగా వైసీపీ ఫైర్‌ బ్రాండ్ రోజా.. బాలకృష్ణ అన్‌ స్టాపబుల్ షోపై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ షోలో తాను పాల్గొనేది లేదని, కూతురు కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం.. కన్నతండ్రి ఎన్టీఆర్‌ని తప్పు చేసినట్టు చిత్రీకరించిన బాలయ్య షోకి తాను వెళ్ళేది లేదని తేల్చి చెప్పింది.

ఆమె మాట్లాడుతూ గతంలో నాకు అన్ స్టాప‌బుల్‌ షోలో పాల్గొనాలని పిలుపు వచ్చింది. ఆ సమయంలో అసెంబ్లీలో మా పార్టీల మధ్య గందరగోళం నెలకొంది. ఆ సమయంలో నేను బాలయ్య షోలో పాల్గొంటే జనాలలో తప్పుగా ప్రచారం జరుగుతుంది. అందుకే నాడు వెళ్లలేదు.

ఇక రెండో సీజన్లో చంద్రబాబు ఎపిసోడ్ చూశాక అసలు వెళ్ళకూడద‌ని నిర్ణయించుకున్నాను. చిత్ర పరిశ్రమకు చెందిన ప్రతి ఒక్కరికి ఎన్టీఆర్ అంటే గౌరవం ఉంటుంది. అలాంటి మహోన్నత‌ వ్యక్తి బాల‌య్య‌కు జీవితం ఇచ్చి, ఆస్తులు పంచి ఇస్తే బాల‌య్య త‌న తండ్రే త‌ప్పు చేశాడని నిరూపించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి కుర్చీ లాక్కున్న చంద్రబాబు కడిగిన ముత్యం అని బాలయ్య నిరూపించే ప్రయత్నం చేశాడు. అలాంటి టాక్ షోకి వెళ్లడం నాకు నచ్చదని చెప్పుకొచ్చింది.

బాలయ్యతో నాకు సత్సంబంధాలే ఉన్నాయి. ఇద్దరం కలిసి పనిచేశాం. కానీ ఆయన కన్నతండ్రికి అన్యాయం చేశాడు. బాబుని మంచివాడుగా నిరూపించే ప్రయత్నం చేస్తున్నాడు. ఎన్టీఆర్‌ని చెడ్డవాడిగా చూపించే పనిలో పడ్డాడు అని వ్యాఖ్యానించింది.

అయితే రోజా రాజకీయ ప్రస్థానం తెలుగుదేశం నుంచే మొదలైందని చాలామందికి గుర్తుండక పోవచ్చు. 2009 ఎన్నికల ముందు ఆమె కాంగ్రెస్‌లో కూడా చేరారు. నాడు వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆమె పార్టీ కండువా పుచ్చుకున్నారు. టిడిపిలో నాకు గౌరవం ఇవ్వలేదు. అందుకే అక్కడ ఉండలేకపోయానని ఆమె ఆరోపణలు చేశారు.

ఇక సీజన్ 2 మొదటి ఎపిసోడ్లో బాలయ్య చంద్రబాబు, లోకేష్‌ను పిలిచిన సంగతి తెలిసిందే. అందులో 1995 ఆగస్టు సంక్షోభం చర్చకు వచ్చింది. ఎన్టీఆర్‌ని కాళ్లు పట్టుకుని బతిమిలాడాన‌ని నారా చంద్రబాబునాయుడు చెప్పి.. నా నిర్ణయం తప్పా అని బాలయ్యను అడిగారు.

అవును ఆ రోజు నాకు ఇంకా గుర్తు ఉందని బాలకృష్ణ సమాధానం చెప్పారు. వెన్నుపోటుప‌రంగా త‌న‌ను విమర్శించే వారికి ఆ సంఘటనకు వివరణ ఇవ్వాలని బాబు ప్రయత్నం చేశారు. మొత్తంగా ఎన్టీఆర్ నిర్ణయాలు, పాలన పెడదోవ‌న‌ పడుతున్న తరుణంలో ఆయన్ని పదవి నుండి తొలగించాలని నిర్ణయానికి వచ్చినట్టు బాబు పరోక్షంగా తెలియజేశారు. అది వైసీపీ బ్యాచ్‌కి నచ్చడం లేదు.

ఇంతకాలం తాము ఏదో మసి పూసి మారేడు కాయను చేసి చంద్రబాబును బాలయ్యను వెన్నుపోటు దారులుగా చూపిస్తుంటే.. ప్రజలందరికీ అర్థమయ్యేలా ఈ షో ద్వారా వారిద్దరూ వివరణ ఇచ్చే ప్రయత్నం చేయడం వారికి నచ్చడం లేదు. తద్వారా ప్రజలకు నాడు ఏమి జరిగిందో వివరించే ప్రయత్నం చేసి దానిని జనాలు నమ్మితే తమ ఉనికికే ముప్ప‌ని వైసిపి బ్యాచ్ భావిస్తోంది.

గతంలో రోజా పలు నీతి వాక్యాలు చెప్పింది. తనకు ఎవరిపైన వ్యక్తిగత ద్వేషం లేదని, జబర్దస్త్ షో నుంచి నాగబాబు వెళ్లిపోవడానికి తాను కారణం కాదని చెప్పింది. నాగబాబుతో పాటు తాను ఎవ్వరిని విమర్శించ లేదని, వ్యక్తిగతంగా ఎవరిని విమర్శించనని తాను ఇకపై కూడా ఇలాగే ఉంటానని తెలిపింది. ఎవరిని టార్గెట్ చేయ‌న‌ని, ఎవ‌రిని వ్య‌క్తిగ‌తంగా విమర్శలు చేసి బాధించడం తనకు ఇష్టం ఉండదు అని చెప్పి సినీ పక్కిలో ఒక ఎమోషనల్ ఫీలింగ్ ఇస్తూ మాట్లాడింది.

మ‌రి నేడు బాల‌య్య‌ను, మ‌రోవైపు మూడు పెళ్లిళ్ల విషయంలో ప‌వ‌న్ ని టార్గెట్ చేయ‌డాన్ని ఏమ‌నాలి? మరి ఈ రెండింటిని చూసిన తర్వాత జనాలకు వాస్తవాలు ఏమిటి అనేవి ఇప్పటికైనా అర్థమవుతాయేమో వేచి చూడాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. బాలయ్య షో పై ఫైర్ అయిన ఫైర్ బ్రాండ్‌పై ఆయన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నీ చరిత్ర బయటికి తీస్తే చాలా ఉందంటూ.. సోషల్ మీడియా వేదికగా రోజాపై వార్ మొదలెట్టారు.

Updated On 4 Jan 2023 6:29 AM GMT
krs

krs

Next Story