విధాత : గ్రూప్‌ 1 ప్రిలిమ్స్‌ పరీక్షను 48 గంటల్లో రద్దు చేయాలని, చేయకపోతే హైదరాబాద్‌ నడిబొడ్డున ఆమరణ దీక్ష చేస్తానని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ (RS Praveen Kumar) హెచ్చరించారు. ఈ లీకేజీ కేసును సీబీఐకి అప్పగించాలని, టీఎస్‌పీఎస్సీ (TSPSC) చైర్మన్‌ పదవి నుంచి జనార్దన్‌రెడ్డి వైదొలగాలని ఆయన డిమాండ్‌ చేశారు. 30 లక్షల మంది నిరుద్యోగులకు అన్యాయం జరిగిన ఘటనలో సీఎం కేసీఆర్‌ (CM KCR) ఎందుకు మౌనంగా ఉన్నారని, మంత్రి […]

విధాత : గ్రూప్‌ 1 ప్రిలిమ్స్‌ పరీక్షను 48 గంటల్లో రద్దు చేయాలని, చేయకపోతే హైదరాబాద్‌ నడిబొడ్డున ఆమరణ దీక్ష చేస్తానని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ (RS Praveen Kumar) హెచ్చరించారు. ఈ లీకేజీ కేసును సీబీఐకి అప్పగించాలని, టీఎస్‌పీఎస్సీ (TSPSC) చైర్మన్‌ పదవి నుంచి జనార్దన్‌రెడ్డి వైదొలగాలని ఆయన డిమాండ్‌ చేశారు.

30 లక్షల మంది నిరుద్యోగులకు అన్యాయం జరిగిన ఘటనలో సీఎం కేసీఆర్‌ (CM KCR) ఎందుకు మౌనంగా ఉన్నారని, మంత్రి కేటీఆర్‌ (KTR) ఎందుకు ట్వీట్‌ చేయట్లేదని ఆయన ప్రశ్నించారు. 48 గంటల్లో గ్రూప్‌ ప్రిలిమ్స్‌ పరీక్షను రద్దు చేసి మళ్లీ పెడుతామని ప్రకటన చేయకపోతే 30 లక్షల మంది నిరుద్యోగుల కోసం హైదరాబాద్‌లో ఆమరణ దీక్షకు కూర్చుంటానని ప్రవీణ్‌కుమార్‌ ఈ సందర్భంగా హెచ్చరించారు.

ఆ పరీక్షలన్నీ రద్దు చేయాలి

జనార్దన్‌రెడ్డి హయాంలో జరిగిన పరీక్షలన్నీ రద్దు చేయాలని ప్రవీణ్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. ఈ వ్యవహారంపై గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తానని, రాష్ట్రపతికి కూడా లేఖ రాస్తానని ఆయన వెల్లడించారు. పాస్‌వర్డ్‌లు అన్నీ చైర్మన్‌కే తెలుస్తాయని, పేపర్లు ఎవరు సెట్‌ చేస్తున్నారన్నది కూడా ఆయనకే తెలుస్తుందని ఆయన పేర్కొన్నారు. అలాంటి పాస్‌వర్డ్‌.. ఆయన కింద పనిచేసే రాజశేఖర్‌రెడ్డికి, ప్రవీణ్‌లకు ఎలా వచ్చింది? వారికి ఎవరు ఇచ్చారు? ఎక్కడి నుంచి దొంగిలించారు? అని ఆయన ప్రశ్నించారు.

దీనిపై కూడా సిట్టింగ్‌ జడ్జితో పూర్తి విచారణ చేపట్టాలని ఆయన గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు. దీని వెనుక ఎవరో పెద్దలు ఉన్నారని, వారికి కావాల్సిన వ్యక్తులకు ఉద్యోగాలు వచ్చేలా పెద్ద కుట్ర జరిగిందని ఆరోపించారు. లేకపోతే ఈ ప్రవీణ్ అనే వ్యక్తి గ్రూప్‌ 1 ప్రిలిమ్స్‌ పరీక్షకు అదనపు సమయం ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. పొద్దున జరగాల్సినది మధ్యాహ్నం ఎందుకు పెట్టారని నిలదీశారు. ఇది పత్రికల్లో వస్తే గాని బయటి ప్రపంచానికి తెలియదన్నారు.

జూనియర్‌ లైన్‌మెన్‌ పరీక్షల్లోనూ ఇలానే కుంభకోణం

ఇదే కుంభకోణం జూనియర్‌ లైన్‌ మెన్‌ పరీక్ష విషయంలోనూ జరిగిందని ఆయన ఆరోపించారు. ఒకటే పేరు మీద, ఒకే వ్యక్తి నాలుగు హాల్‌టికెట్లు ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. ఈ విషయం తాను రఘుమారెడ్డికి చెప్పేవరకు వారికి తెలియదన్నారు. ఆ సమయంలో తాను ఆధారాలతో సహా ఇస్తే ‘చూస్తాను.. చేస్తాను’ అన్నారే తప్పించి ఏమీ చేయలేదని ఆరోపించారు. దాన్ని రద్దు కూడా చేయలేదన్నారు.

కొనసాగుతున్న సిట్‌ దర్యాప్తు

టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీక్‌ కేసులో సిట్‌ అధికారి ఏఆర్‌ శ్రీనివాస్‌ నేతృత్వంలో దర్యాప్తు కొనసాగుతున్నది. సర్వీస్ కమిషన్‌ కార్యాలయానికి నేర విభాగ అదనపు సీపీ కార్యాలయానికి చేరుకున్నారు. ప్రశ్నపత్రం లీకైన సెక్షన్‌లో అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. ఎన్ని పేపర్లు లీక్‌ అయ్యాయి అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కమిషన్‌ కార్యాలయంలోని ఇతర సిబ్బందిని విచారిస్తున్నారు. ప్రధాన నిందితుడు ప్రవీణ్ క్యాబిన్‌ను తనిఖీ చేస్తున్నారు.

చైర్మన్‌ అసమర్థత వల్లే లీకేజీ- ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి

టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ ప్రెస్‌మీట్‌ వింటే ఆశ్చర్యం వేసిందని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. ప్రశ్నపత్రాల లీకేజీపై ఆయన మాట్లాడుతూ.. నమ్మినవాళ్లే మోసం చేశారని చైర్మన్‌ అంటున్నారని, నిజానికి ఆయన అసమర్థవల్లే పేపర్‌ లీకేజీ జరిగిందని ఆరోపించారు. అసమర్థుడైన చైర్మన్‌ను ఎందుకు కొసాగించాలని ఆయన ప్రశ్నించారు. చైర్మన్‌గా జనార్దన్‌రెడ్డి విఫలమయ్యారని జీవన్‌రెడ్డి విమర్శించారు. టీఎస్‌పీఎస్సీ ఉద్యోగి ప్రవీణ్‌కు గ్రూప్‌ 1 ప్రిలిమ్స్‌లో 103 మార్కులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు.

గ్రూప్‌ 1 ప్రిలిమ్స్‌ పేపర్‌ కూడా లీకైందనే అనుమానాలు ఉన్నాయన్నారు. ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగికి టీఎస్‌పీఎస్సీ కంప్యూటర్‌ నెట్‌వర్కింగ్‌ ఎలా అప్పగిస్తారని ఆయన నిలదీశారు. చివరికి లీకేజీ విషయం కూడా అభ్యర్థులే బైటపెట్టారని, రూ. 10 లక్షలు పెట్టి పేపర్‌ కొనలేని అభ్యర్థి పోలీసులకు సమాచారం ఇచ్చాడని తెలిపారు. దీనిపై పోలీసులు టీఎస్‌పీఎస్సీ కార్యాలయంలో పేపర్‌ లీక్‌ అయినట్టు చైర్మన్‌ కు సమాచారం ఇస్తే.. అవును అయినట్టు ఉన్నదని జనార్దన్‌రెడ్డి అప్పుడు కళ్లు తెరిచారని జీవన్‌రెడ్డి ఎద్దేవా చేశారు.

Updated On 15 March 2023 11:43 AM GMT
Somu

Somu

Next Story