- రైతులకు 5 శాతం నిధులు ఖర్చు చేయని సీఎం కేసీఆర్..
- లక్ష రుణ మాఫీ నాలుగేళ్లుగా పెండింగ్లోనే..
- కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు గడప గడపకు వివరించాలని పిలుపు
- బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో ఎంపీ ధర్మపురి అరవింద్
విధాత, మెదక్ ఉమ్మడి జిల్లా బ్యూరో: రైతు ప్రభుత్వంగా చెప్పుకుంటున్న సీఎం కెసిఆర్ రైతులకు కేటాయించిన బడ్జెట్ లో 5శాతం కూడా ఖర్చు చేయలేదని మెదక్ బీజేపీ పాలక్ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆరోపించారు. శనివారం మెదక్ నియోజక వర్గ బీజేపీ ముఖ్య కార్యకర్తలు, గ్రామ స్థాయి బూత్ లెవల్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.
పార్టీలోని యువకులు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను గడప గడపకు వివరించి పార్టీని అధికారంలోకి తీసుకు రావాలని సూచించారు. పార్టీ కోసం కష్టపడి పనిచేస్తే తెలంగాణ కొత్త సెక్రటేరియట్లో పార్టీ జెండా ఎగురుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణలో సునాయాసంగా బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
బిఆర్ఎస్ పార్టీ పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. గత నాలుగేళ్లుగా రైతులకు సంబంధించి లక్ష రూపాయల రుణమాఫీ పెండింగ్ లో ఉంది అన్నారు. రైతులకు వడ్డీలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు.
కార్యకర్తలు 9 నెలలు కష్టపడాలని సూచించారు. రాష్ట్రంలో 90 సీట్లు గెలిపించేది కార్యకర్తలేనని అన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ ను తేవడానికి కార్యకర్తలు ముఖ్య పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించడానికి కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలన్నారు.
9 సంవత్సరాలలో కోటి ఎకరాల మాగాని ఏమైందని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా పారడం లేదని మోటార్లు మునిగి పోతున్నాయని అన్నారు. డ్రిప్ ఇరిగేషన్ మీద ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వడం లేదని మండిపడ్డారు. సీఎం కెసిఆర్ తెలంగాణ రాష్ట్రానికి కాపలా కుక్కని చెప్పి గుంట నక్కలా మారాడని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం లేదని మండిపడ్డారు.