దమ్ము.. ధైర్యం ఉంటే రాజీనామా చెయ్.. ఎన్నికల్లో తేల్చుకుందాం: సైదిరెడ్డి సవాల్ 50వేల ఓట్లతో గెలుస్తాం.. ఒక్క ఓటు తక్కువొచ్చిన రాజకీయాలు వదిలేస్తా: ఉత్తమ్ విధాత: హుజూర్ నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డికి, మాజీ మంత్రి నల్గొండ ఎంపీ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డికి మధ్య కొనసాగుతున్న రాజకీయ వైరం మళ్లీ సవాళ్ల మంటలు రేపింది. నూతన సంవత్సర వేళ పరస్పరం రాజకీయ సవాళ్లతో సై అంటే సై అంటూ మీడియా ద్వారా వారిద్దరు రచ్చకెక్కడంతో నియోజకవర్గ […]

  • దమ్ము.. ధైర్యం ఉంటే రాజీనామా చెయ్.. ఎన్నికల్లో తేల్చుకుందాం: సైదిరెడ్డి సవాల్
  • 50వేల ఓట్లతో గెలుస్తాం.. ఒక్క ఓటు తక్కువొచ్చిన రాజకీయాలు వదిలేస్తా: ఉత్తమ్

విధాత: హుజూర్ నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డికి, మాజీ మంత్రి నల్గొండ ఎంపీ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డికి మధ్య కొనసాగుతున్న రాజకీయ వైరం మళ్లీ సవాళ్ల మంటలు రేపింది. నూతన సంవత్సర వేళ పరస్పరం రాజకీయ సవాళ్లతో సై అంటే సై అంటూ మీడియా ద్వారా వారిద్దరు రచ్చకెక్కడంతో నియోజకవర్గ రాజకీయాలు శీతాకాలంలోనూ సెగలు రాజేస్తున్నాయి.

ఉప ఎన్నికల అఫిడవిట్ లో ఆస్తుల లెక్కలు తప్పుగా చూపానని తనపై పద్మావతి ఉత్తమ్ కోర్టులో కేసులు వేయడం పై రగిలిపోతున్న సైదిరెడ్డి హుజూర్ నగర్ లో మీడియా ముఖంగా ఉత్తమ్ పై నిప్పులు కక్కారు. కోర్టుల్లో కేసులు వేస్తూ.. అభివృద్ధి లేదంటూ ఆరోపణలు ఎందుకు చేస్తున్నావని ఉత్తమపై సైదిరెడ్డి భగ్గుమన్నారు.

ఉత్తమ్..! నీకు దమ్ము.. ధైర్యం ఉంటే ఎంపీ పదవికి రాజీనామా చెయ్.. నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా.. మళ్ళీ ఎన్నికల్లో నీవు లేదా నీ భార్య నాపై పోటీ చేయాలని, ప్రజాక్షేత్రంలో తేల్చుకుందాం అంటు ఉత్తమ్ కుమార్ రెడ్డికి సవాల్ విసిరారు. లేదంటే 25 ఏళ్లలో నీవు చేసిన అభివృద్ధి పైన.. మూడేళ్లలో నేను చేసిన అభివృద్ధి పైన ముఖాముఖి బహిరంగ చర్చకు రావాలని సైదిరెడ్డి తీవ్ర స్థాయిలో ఉత్తమ్‌కు సవాల్ చేశారు.

సైదిరెడ్డి సవాల్ పై ఉత్తమ్ కుమార్ రెడ్డి సైతం అంతే దీటుగా ప్రతిస్పందించి స్థానికంగా రాజకీయ సెగలను మరింత రాజేశారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ హుజూర్ నగర్ లో ఉత్తమ్, కోదాడలో పద్మావతి పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్న క్రమంలో ఉత్తమ్ దంపతులు కోదాడలో ఆ రెండు నియోజకవర్గాల కార్యకర్తలు, ప్రజలతో నూతన సంవత్సరం సందర్భంగా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.

తనపై హుజూర్ నగర్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి విసిరిన సవాల్ కు ఈ ఆత్మీయ సమ్మేళనం వేదికగా ఉత్తమ్ ఘాటుగా స్పందించారు. హుజూర్ నగర్, కోదాడలలో వచ్చే ఎన్నికల్లో నేను, పద్మావతి 50వేల ఓట్ల మెజారిటీతో గెలుస్తామని, ఒక్క ఓటు తక్కువ వచ్చినా రాజకీయాల నుండి తప్పుకుంటానంటూ సంచలనం వ్యాఖ్యలు చేశారు.

ఎన్నికలు ఎప్పుడొచ్చినా కాంగ్రెస్ శ్రేణులు సిద్ధంగా ఉన్నాయన్నారు. 1994లో ప్రజాసేవ లక్ష్యంగా సైన్యం నుండి రాజకీయాల్లోకి వచ్చిన తాను ఐదు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలిచి కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాలలో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించానన్నారు.

పిల్లలు లేని తమ దంపతులకు కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాల ప్రజలనే పిల్లలుగా భావిస్తూ వారి సంక్షేమానికి పాటు పడుతున్నామన్నారు. హుజూర్ నగర్ నియోజకవర్గంలో మఠంపల్లి, మేళ్లచెరువు, నేరేడుచర్ల మండలాలకు రైల్వే లైన్ తీసుకొచ్చి ఆ ప్రాంతాల అభివృద్ధికి బాటలు వేశానన్నారు.

కోదాడ- ఖమ్మం రైల్వే లైన్ పనులకు ప్రయత్నాలు మొదలయ్యాయన్నారు. తాను ఎన్నడూ దిగజారుడు రాజకీయాలు చేయలేదని, కొత్తగా స్వార్థపూరిత నాయకులు రాజకీయాలలోకి వచ్చి రాజకీయ విలువలను, భాషను దిగజార్చుతున్నారంటూ పరోక్షంగా సైదిరెడ్డి పై మండిపడ్డారు.

ఇలా పరస్పరం సవాళ్లు.. ప్రతి సవాళ్లతో అటు సైదిరెడ్డి, ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి రానున్న ఎన్నికల సమరానికి ముందే ఢీ అంటే ఢీ అంటూ రెచ్చిపోతుండటంతో నియోజకవర్గం రాజకీయల్లో రెండు పార్టీల శ్రేణుల మధ్య రాజకీయ వైరం మునుముందు మరింత ముదరడం ఖాయంగా కనిపిస్తుంది.

Updated On 2 Jan 2023 11:16 AM GMT
CH RAJITHA

CH RAJITHA

Next Story