విధాత: ఒకవైపు భర్త నాగచైతన్యతో విడాకులు… మరోవైపు మయోసైటీస్ వంటి ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న సమంత ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నట్టు తెలుస్తోంది. ఆమె త్వరలో సినిమా షూటింగులకు హాజరు కానుంది.
ముందుగా శాకుంతలం చిత్రానికి సంబంధించి పెండింగ్ వర్క్ పూర్తి చేసే పనిలో ఉంది. దీంతో చిత్ర నిర్మాత అయిన దిల్ రాజు ఫిబ్రవరి 17న విడుదల చేస్తున్నట్టు ప్రకటించాడు. తేదీ పక్కా కావడంతో సమంత ప్రస్తుతం మిగిలి ఉన్న డబ్బింగ్‌ని పూర్తి చేసే పనిలో ఉన్నట్లుగా సమాచారం.
యశోద వంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత ఆమె నటించిన సినిమా కావడంతో శాకుంతలంపై భారీ అంచనాలే ఉన్నాయి. అందులోనూ క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ లాంటి దర్శకుడు భారీ బడ్జెట్‌తో తీసి.. తాను కూడా నిర్మాణ భాగస్వామిగా ఈ చిత్రానికి వ్యవహరిస్తున్నాడు. కాగా ఈమె మయోసైటీస్ నుంచి బాగానే కోలుకుంటున్నారని తెలుస్తోంది. చాలా రోజుల తర్వాత ఆమె ముంబై ఎయిర్‌పోర్ట్‌లో కెమెరాకు దొరికింది.
యశోద మూవీకి డబ్బింగ్ చేసి పోతున్న సమయంలో చేతికి సెలైన్ పెట్టుకుని ఉన్న సమంత ఫోటోతో నాడు సమంత ప్రముఖంగా వార్తల్లో నిలిచింది. ఆ తర్వాత మయోసైటీస్ అనే వ్యాధితో బాధపడుతున్నట్లు వెల్లడించింది. ఆ వ్యాధికి ఆమె ట్రీట్మెంట్ కూడా తీసుకుంటుంది. దాని నుంచి కోలుకుంటున్న సందర్భంగా ఇప్పుడు ఇలా ఎయిర్‌పోర్ట్‌లో సమంత కనిపించింది.
పూర్తి వైట్ అండ్ వైట్ డ్రెస్ లో కనిపించిన ఈమె కళ్ళకు బ్లాక్ గాగుల్స్ పెట్టుకుంది. ఎలాంటి మేకప్పు లేకుండా చాలా సింపుల్‌గా కనిపించింది. ఎప్పుడూ నవ్వుతూ కనిపించే ఆమె ఈ ఫోటోలో మాత్రం చాలా సీరియస్‌గా ఉంది. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్‌గా మారింది. యశోద తర్వాత శాకుంతలంతో వస్తున్న ఆమె ఓవైపు ఖుషి మూవీలోను నటిస్తోంది.
త్వరలోనే మరో షెడ్యూల్ కోసం ఖుషీ సెట్స్ లో చేరనుంది. శివ నిర్వాణ డైరెక్షన్ వహిస్తున్న ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్నాడు. మొత్తానికి సమంత మూడు నెలల తర్వాత ఇలా బయటికి వచ్చినట్టు అర్థమవుతుంది. ఆమె గాగుల్స్ పెట్టుకోవడంతో ముఖంలోని ఫీలింగ్స్ తెలియడం లేదు.
మయోసైటిస్ బారినపడ్డ సమంతలో కొన్ని మార్పులు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. ఆమె ముఖం ఆయిలీగా ఉంది. అది మేకప్ వలనా లేక అనారోగ్య సమస్య కారణంగా అలా కనిపిస్తోందా అనేది తెలియదు. అలాగే సమంత కాస్త సన్నబడింది. ఎప్పుడు స్లిమ్‌గా, ఫిట్‌గా ఉండే ఆమె ట్రీట్మెంట్ ఒత్తిడి కారణంగా బరువు తగ్గినట్టు తెలుస్తోంది.
సమంత కళ్ళజోడు పెట్టుకోవడానికి ఏదో కారణం ఉందన్న అనుమానం కలుగుతుంది. కెమెరామెన్లు ఆమెను వెంటాడుతుంటే కొంచెం అసహనంగా ఫీల్ అయింది. వారు న్యూ ఇయర్ విషెస్ చెబుతున్నా కానీ సమంత స్పందించలేదు.
సమంత కోలుకున్న సూచనలు కనిపిస్తున్నప్పటికీ బిహేవియర్ చాలా కొత్తగా ఉంది. ఇంతకుముందు సమంతకు సింగర్ చిన్మయి డబ్బింగ్ చెబుతూ ఉండేది. కానీ సమంత తాజాగా ఇంటి నుంచే డబ్బింగ్ వర్క్‌ను పూర్తి చేస్తోంది. ప్రస్తుతం సమంత సొంతంగా డబ్బింగ్ చెబుతోంది.
ఆమెతో సినిమాలు తీసేందుకు కరణ్ జోహార్‌తో పాటు బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థలు సిద్ధంగా ఉన్నాయని వినికిడి. సమంత నటిస్తున్న సిటాడెల్ వెబ్ సిరీస్‌కు ఫ్యామిలీ మెన్ 2 డైరెక్టర్స్ రాజ్ అండ్ డీకే దర్శకులు. ఇది హాలీవుడ్ సిరీస్ రీమేక్‌గా తెరకెక్కనుంది.