విధాత: దక్షిణాదిలోనే కాదు బాలీవుడ్లో కూడా హీరోయిన్ సమంత గురించి తెలియని వారు ప్రస్తుతం ఉండరు. ఆమె పలు సినిమాలు, వెబ్ సిరీస్ ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఇటీవల నాగచైతన్య నుంచి విడిపోయిన ఆమె మయోసైటిస్ అనే ప్రాణాంతక వ్యాధితో పోరాడుతోంది.
నాగచైతన్యతో విడిపోయిన బాధ ఒకవైపు… ప్రాణాంతక వ్యాధి పీడించడం మరోవైపు ఇలా సమంతను చూసిన వారు అయ్యో అంటున్నారు. కానీ ఆమె మాత్రం ఎంతో గుండె నిబ్బరంగా ఇప్పటికీ ప్రాణాలతో పోరాడుతూనే ఉన్నానని చెప్పడం ఆమె అభిమానులను కలచివేసింది.
తాజాగా సమంత తన అభిమానులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసింది. తను పుట్టెడు దుఃఖంలో ఉండి కూడా ఇతరుల కోసం దేవుడిని ప్రార్థించింది. సమంత గొప్ప మనసుని చూసి నెటిజన్లు సామ్‌ని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
అయితే ఆమె యశోద చిత్రం ప్రమోషన్స్ సమయంలో మీడియాతో మాట్లాడుతూ.. తన ఆరోగ్య పరిస్థితిపై కాస్త స్పష్టత ఇచ్చింది. తానేమి చనిపోవడం లేదు.. బతికే ఉన్నాను… మయోసైటీస్ ప్రాణాంతకం ఏమీ కాదు… అలా అని చిన్న సమస్య కూడా కాదు.. నేను పోరాడాల్సి ఉంది.. ఈ మహమ్మారి నుండి బయట పడతానని నమ్మకం నాకు ఉంది.. అంటూ నాడు సమంత ఎమోషనల్ అయ్యింది.
ప్రస్తుతం సమంతా మెరుగైన వైద్యం కోసం పలు దేశాలకు వెళ్తున్నట్టు సమాచారం. ఇటీవలే దక్షిణ కొరియా వెళ్లిందంటూ ప్రచారం జరిగింది. ఈమె కోలుకొని షూటింగ్స్‌లో పాల్గొనడానికి కొంత సమయం పట్టేలా ఉంది. మరోవైపు ఈమె నటిస్తున్న ఖుషి, శాకుంతలం చిత్రాలు కొంత భాగం షూటింగును పూర్తి చేసుకున్నాయి. దాంతో వైద్యుల సలహా మేరకు ఆమె నిర్మాతలకు ఇబ్బంది కలగకుండా ఆ చిత్రాలను పూర్తి చేయాలని అనుకుంటుందని సమాచారం.
కానీ కొత్త చిత్రాలను మాత్రం క్యాన్సిల్ చేశారట. అంతేకాదు అంతకుముందు ఒప్పుకున్న బాలీవుడ్ చిత్రాలతో పాటు కొత్త చిత్రాలను ఏమీ ఆమె ఓకే చేయడం లేదు. అయితే ఒకటి మాత్రం నిజం. సమంతలో ఒకప్పటి చురుకుతనం, ఎనర్జీ మాత్రం లేవు. ఆమె అరుదుగా సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతున్నారు.
ఆమె ఇంత బాధలోనూ అభిమానులకు న్యూ ఇయర్ విషెస్ తెలుపుతూ.. బాధ్యతలు ముందుకు తీసుకువెళ్లాలి.. నియంత్రించగలిగే విషయాలు నియంత్రిద్దాం.. కొత్త లక్ష్యాలు, తీర్మానాలు చేద్దాం. మన కోరికలు నెరవేరడంలో ఆ దేవుని దయ మనకు ఉంటుంది.. హ్యాపీ న్యూ ఇయర్.. అని తన సందేశం ఇచ్చింది.
ఈ పోస్ట్ ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతుంది. ఫ్యాన్స్ ఆమెకు తిరిగి న్యూ ఇయర్ విషెస్నుతెలియజేస్తున్నారు. ఆమె పూర్తిగా కోలుకొని వచ్చే ఏడాది మరల చిత్రాలు చేయాలని, వచ్చే ఏడాది ఆమెకు తీపి గుర్తుగా మారాలని అభిమానులు భగవంతుని ప్రార్థిస్తున్నారు.