Samantha | సమంత తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి దాదాపు 13 సంవత్సరాలు అవుతున్నది. నాగచైతన్యతో గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ‘ఏ మాయ చేశావే’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఇప్పటికే టాలీవుడ్‌లో అగ్రహీరోయిన్‌గా కొనసాగుతున్నది.
అయితే, ఇటీవల పలు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. యశోద, శాకుంతలం సినిమాలు డిజాస్టర్‌గా నిలిచాయి. అంతకు ముందు నయనతార, విజయ్ సేతుపతితో కలిసి నటించిన ‘కథువక్కు రెండు కాదల్’ సినిమా సక్సెస్ కాకపోయినా.. డిమాండ్ మాత్రం భారీగానే ఉన్నది. ఈ క్రమంలో సినిమా సినిమాకు పారితోషకం పెరుగుతూ వస్తున్నది. పారితోషకంతో ఆస్తులను కొనుగోలు చేస్తున్నది.
విడాకులకు ముందు సమంతా, నాగచైతన్య ఒకే ఇంట్లో ఉండే వారు. విడాకుల తర్వాత ఆ ఇంటినే కొనుగోలు చేసి అక్కడే ఉంటూ వచ్చింది. తాజాగా హైదరాబాద్‌లో ఖరీదైన ఏరియాలో లగ్జరీ ఇంటిని భారీ ధరకు కొనుగోలు చేసినట్లు తెలుస్తున్నది. 7944 చదరపు అడుగుల విస్తీర్ణంలో నాలుగు పడక గదుల డ్యూప్లెక్స్ హౌస్‌ని కొనుగోలు చేసినట్లుగా సమాచారం.
నగరంలోని జయభేరీ ఆరెంజ్ కౌంటీలో ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేసిందని టాలీవుడ్‌లో ప్రచారం జరుగుతుంది. ఈ అపార్టమెంట్‌లోని 14వ అంతస్థులో ప్లాట్‌ను రూ.7.8కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిందని సమాచారం. సమంత ప్రస్తుతం హైదరాబాద్‌లోని పలాటియల్ హౌస్‌లో నివాసం ఉంటున్నది. నాగ చైతన్యను వివాహం చేసుకున్న తర్వాత ఓ సీనియర్ నటుడి నుంచి ఈ ఇంటిని కొనుగోలు చేశారు.
విడాకుల తర్వాత ఆ ఇంటిని అమ్మేయగా.. సమంతా భారీ మొత్తంలో డబ్బు చెల్లించి, ఆ ఇంటిని తిరిగి కొని అక్కడే ఉంటున్నది. ఇక సమంత ఆస్తుల విలువ రూ.100కోట్లుపైగానే ఉంటుందని అంచనా. ప్రస్తుతం సమంత ఒక్కో సినిమాకు రూ.4కోట్ల నుంచి రూ.5కోట్ల వరకు వసూలు చేస్తున్నది. దాంతో పాటు ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రకటనలు ఇస్తూ.. భారీగానే ఫీజు తీసుకుంటున్నది.
ఇంటితో పాటు లగ్జరీ కార్లు సైతం ఉన్నారు. ల్యాండ్ రోవర్, బీఎండబ్ల్యూ7తో సహా పలు లగ్జరీ కార్లను కొనుగోలు చేసింది. దాంతో పాటు పలు వెంచర్లలోనూ పెట్టుబడులు పెట్టినట్లు టాక్. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం సమంత విజయ్ దేవరకొండతో ఖుషీ చిత్రంలో నటిస్తున్నది. అలాగే హిందీ వెబ్ సిరీస్ సిటాడెల్‌లో నటిస్తున్నది.